ఎట్టకేలకు దిగొచ్చిన బ్రిటన్.. భారత ప్రయాణికులకు భారీ ఊరట!

ABN , First Publish Date - 2021-10-08T13:51:59+05:30 IST

భారత్ దెబ్బకు బ్రిటన్ ఎట్టకేలకు దిగొచ్చింది. సోమవారం(అక్టోబర్ 11) నుంచి కొవిషీల్డ్‌ లేదా యూకే ప్రభుత్వం ఆమోదించిన ఇతర టీకా వేసుకుని ఆ దేశానికి వెళ్లే భారత ప్రయాణికులు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని బ్రిటిష్ హై కమిషన్ గురువారం వెల్లడించింది. గతంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు టీకా తీసుకున్నప్పటికీ 10 రోజుల పాటు..

ఎట్టకేలకు దిగొచ్చిన బ్రిటన్.. భారత ప్రయాణికులకు భారీ ఊరట!

లండన్: భారత్ దెబ్బకు బ్రిటన్ ఎట్టకేలకు దిగొచ్చింది. సోమవారం(అక్టోబర్ 11) నుంచి కొవిషీల్డ్‌ లేదా యూకే ప్రభుత్వం ఆమోదించిన ఇతర టీకా వేసుకుని ఆ దేశానికి వెళ్లే భారత ప్రయాణికులు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని బ్రిటిష్ హై కమిషన్ గురువారం వెల్లడించింది. గతంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు టీకా తీసుకున్నప్పటికీ 10 రోజుల పాటు క్వారంటైన్ ఉండాలని యూకే ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ కూడా ఈ నెల 4 నుంచి మన దేశానికి వచ్చే బ్రిటన్ పౌరులకు ఇవే ఆంక్షలను అమలు చేస్తామని ప్రకటించింది. 


ఈ నిబంధనల ప్రకారం బ్రిటన్‌లో టీకా తీసుకున్నా ఆ దేశ పౌరులు మన దగ్గరకు వస్తే 10 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందే. బయల్దేరడానికి 72 గంటల ముందుగా చేయించుకున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగెటివ్‌ రిపోర్టు తప్పనిసరి. అలాగే విమానాశ్రయంలో దిగాక ఒకసారి, 8వ రోజు మరోసారి టెస్టు చేయించుకోవాలని భారత్ ఆంక్షలు విధించింది. ఈ విషయమై ఇరుదేశాల మధ్య వివాదం నెలకొంది. ఇక భారత చర్యతో దిగొచ్చిన బోరిస్ జాన్సన్ సర్కార్ మన ప్రయాణికులపై ఉన్న 10 రోజుల క్వారంటైన్ ఆంక్షలను తొలగిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. 


సోమవారం నుంచి భారత్ సహా 47 దేశాల వారికి ఈ నిబంధనను తొలగిస్తున్నట్లు బ్రిటిష్ హై కమిషన్ వెల్లడించింది. కనుక రెండు డోసుల కోవిషీల్డ్ టీకా తీసుకున్న భారత ప్రయాణికులు ఇకపై ఇంగ్లాండ్ వెళ్లిన తర్వాత 10 రోజులు క్వారంటైన్‌లో ఉండనక్కర్లేదు. ఇది బ్రిటన్ వెళ్లే భారత ప్రయాణికులకు భారీ ఊరటనిచ్చే విషయం. ఇక బ్రిటన్ ఆంక్షలను సడలించిన దేశాల జాబితాలో భారత్‌‌తో పాటు బ్రేజిల్, ఘనా, హాంగ్‌కాంగ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, టర్కీ తదితర దేశాలు ఉన్నాయి. తాజాగా యూకే ప్రభుత్వం రెడ్‌లిస్ట్ దేశాల జాబితాను సవరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ప్రస్తుతం బ్రిటన్ రెడ్‌లిస్ట్ దేశాల జాబితాలో ఇంకా ఏడు దేశాలు ఉన్నాయి. 


కొలంబియా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, హైతీ, పనామా, పెరూ, వెనిజులా ఈ జాబితాలో ఉన్నాయి. గురువారం బ్రిటన్ రవాణాశాఖ మంత్రి గ్రాంట్ షాప్స్ మాట్లాడుతూ.. భారత్ సహా 47 దేశాల నుంచి యూకే వచ్చే ప్రయాణికులకు 10 రోజుల క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తున్నాం. కానీ, వ్యాక్సినేషన్ స్టేటస్‌తో పాటు కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ చూపించడం తప్పనిసరి. అలాగే దేశానికి వచ్చిన రెండు రోజుల తర్వాత ఆర్‌టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాలి. సోమవారం నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని ప్రకటించారు.   


Updated Date - 2021-10-08T13:51:59+05:30 IST