Abn logo
Jun 18 2021 @ 01:15AM

ధర పలకని మామిడి..!?

గిట్టుబాటు ధరపై స్పష్టత కరువు 

రైతుల గోడు పట్టని ప్రభుత్వం 

నామమాత్రంగా సమీక్షలు  

జిల్లా మామిడిపై ఆసక్తి చూపని గుజ్జు పరిశ్రమలు 

పొలాల్లో... మండీల్లో కుళ్లుతున్న... మామిడి  

రైతు కంట కన్నీరు మిగిల్చిన మామిడి 


చిత్తూరు (సెంట్రల్‌), జూన్‌ 17: వాతావరణం అనుకూలించక.. పురుగుల దాడితో మామిడి దిగుబడి తగ్గింది. గిట్టుబాటు ధరకూడా లభించలేదు. ఉన్నతాధికారులు పలుమార్లు జరిపిన సమీక్షలు సత్ఫలితాలివ్వలేద. ఈ పరిణామాలు రైతులను కష్ట.. నష్టాలపాలు చేసింది. దీంతో గిట్టుబాటు ధరల కోసం మామిడి రైతులు రోడ్డెక్కే పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు జిల్లాలోని గుజ్జు పరిశ్రమలు ఇతర ప్రాంతాల మామిడికి ప్రాధాన్యం ఇవ్వడం కూడా ధరల పతనానికి మరో కారణం. కనీసం కూలీ డబ్బులు కూడా రాకుండా పోవడంతో చెట్లలోనే మామిడి కుళ్లిపోగా, కూలీ, రవాణా ఖర్చులు భరించి మండీలకు తెచ్చిన కాయలకు సమయానికి ధరలేక మగ్గిపోతున్నాయి. 


అంచనాలు తారుమారు 

జిల్లా వ్యాప్తంగా 1.12 లక్షల హెక్టార్లలో రైతులు తోతాపూరి, కాలేపాడు, ఖాదర్‌, పుల్లూరా, మల్గూభా, మల్గికా, అత్తిరసం, నీలం, బేనిషా వంటి రకాల మామిడిని రైతులు సాగు చేశారు. దుక్కిదున్ని పాదులు కట్టడానికి, క్రిమిసంహారక మందులు, ఎరువులకు కలిపి ఎకరాకు రూ.50 వేల వరకు రైతులు ఖర్చు చేశారు. తరచూ కురిసిన తేలికపాటి వర్షంతో మామిడి పలు దశల్లో పక్వానికి వచ్చాయి. గత నెల 15 నుంచి మొదలైన మామిడి కోతలు నెలాఖరుకు ముగియనున్నాయి. అనుకూలించిన వాతావరణ పరిస్థితులతో దాదాపు 5 లక్షల మెట్రిక్‌ టన్నులు దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారులు లెక్కకట్టారు. ఎకరాకు 7 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుందని రైతులు భావించారు. క్షేత్రస్థాయికి వచ్చేసరికి వీరి అంచనాలు తారుమారయ్యాయి. పూత దశలో తేనెమంచు పురుగు, కాయ దశలో తొటిమి తొలిచే పురుగులు ఆశించడం, వాతావరణంలో మార్పుతో పూత రాలిపోవడంతో దిగుబడి తగ్గిపోయింది. గతేడాది దిగుబడి తగ్గినా గిట్టుబాటు ధరతో కొంతవరకు రైతులు లాభాలు చూశారు. ఈసారి ధరలు తక్కువగా ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. 


గిట్టుబాటు ధర ఏదీ? 

గతేడాది తోతాపురి, పుల్లూరా, ఖాదర్‌ వెరైటీ రకాలు టన్ను ధర రూ.20 వేల నుంచి రూ.25 వేలు పలికాయి. ఒకానొక దశలో టన్నుకు రూ.50 వేల ధర వచ్చింది. ఈ ఏడాది అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. తెగుళ్ల కారణంగా ఆశించిన స్థాయిలో పంట చేతికి రాకపోగా కరోనా కారణంగా మార్కెటింగ్‌ లేకపోవడంతో ధరలు పడిపోయాయి. గత నెల చివరి వారంలో తోతాపూరి, పుల్లూరా, ఖాదర్‌ రకాలు టన్నుకు కేవలం రూ.7 వేల నుంచి రూ.12 వేలు ధర పలకగా.. నేడు తోతాపురి రకాన్ని అడిగే వారే  లేరు. టేబుల్‌ వెరైటీగా చొప్పుకునే మల్గూభా, అత్తిరసం నీలం, కాలేపాడు, బేనీషా మల్లికా, ఖాధర్‌, సింధూరా రకాలు సైతం టన్నుకు రూ.20 వేల నుంచి రూ.26 వేలుకు ఎగబాకినా, వీటి ధరలు సైతం ఒక్కసారిగా పతనమయ్యాయి. తిరుచానూరు, పుత్తూరు, చిత్తూరు, బంగారుపాళ్యంలోని మార్కెటింగ్‌ యార్డుల్లో మామిడి రకాల ధరలను మార్కెటింగ్‌ శాఖ అధికారులు నిర్ధారించినా, నాణ్యత ప్రమాణాల ఆధారంగానే ధరలు ఉంటాయని చెబుతున్నారు. 


గుజ్జు పరిశ్రమల ఆసక్తి కరువు 

జిల్లాలోని మామిడిని కొనుగోలు చేయడంలో గుజ్జు పరిశ్రమలు ఆసక్తి చూపలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 60 నుంచి 65 వరకు మామిడి గుజ్జు పరిశ్రమలు ఉండగా, ప్రస్తుతం సుమారు 30 ప్యాక్టరీలు మాత్రమే పనిచేస్తున్నాయి. విజయవాడ, నూజివీడు, శ్రీనివాసపురం, కోడూరు ప్రాంతాల్లో మామిడిపై జిల్లాకు చెందిన గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లా నలుమూలల నుంచి గుజ్జు పరిశ్రమలకు తరలించిన మామిడిని ఆయా పరిశ్రమలు కొంటామని నామమాత్రంగా టోకెన్లు ఇచ్చినా,  ప్రాధాన్యత మాత్రం బయట ప్రాంతాల మామిడికే ఇస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీలకు తరలించి మామిడి వాహనాల్లోనే కుళ్లిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇదిలా ఉండగా ఎగుమతి చేస్తామనుకుంటే  మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాలోనూ మామిడి సాగు అధికంగా రావడంతో అక్కడ కూడా మన మామిడికి మార్కెట్‌ లేకుండా పోయింది. 


ఫలించని సమీక్షలు 

మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘాల సమాఖ్యలు, కలెక్టర్‌ జరిపిన సమీక్షలు ఫలితాలు ఇవ్వలేదని రైతులు భావిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు మామిడికి అధికారికంగా గిట్టుబాటు ధరలు నిర్ణయించకపోవడంతోనే తాము నష్టాలపాలవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. కనీసం జిల్లాలోని మామిడినే కొనుగోలు చేయాలని గుజ్జు పరిశ్రమలకు ఆదేశాలు ఇవ్వకపోవడం ధరల పతనానికి మరో కారణమంటున్నారు. ఇప్పటికే తామెంతో నష్టపోయామని, ఇకనైనా ప్రభుత్వం గిట్టుబాటు ధర నిర్ణయించడంతో పాటు గుజ్జు పరిశ్రమల యజమానులు ఇక్కడి మామిడిని కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.  

హిందుమతి, ఏడీ, మార్కెటింగ్‌

నాణ్యత ఆధారంగా ధరలు నాణ్యత బాగుంటేనే మామిడికి ఽధర పలుకుతుంది. కాయకు తెగులు, పురుగు, సోకినా ధర రావడం లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, ఇతర కారణాలు మామిడి నాణ్యతా ప్రమాణాలకు కారణమయ్యాయి. అయినా ఎగుమతి చేయాలన్నా, గుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేయాలన్నా, మామిడి నాణ్యతే ఆధారం. వీటి ఆధారంగానే వివిధ మార్కెట్‌ యార్డుల్లో ధర పలుకుతోంది. బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డులో తోతాపురి రకం టన్ను ధర రూ.13 వేలు ఉండగా, ఖాదర్‌ రకం రూ.35 వేల నుంచి రూ.44 వేలు, బేనీషా రూ.12 వేల నుంచి రూ.17 వేలు ఉంది. తిరుచానూరు మార్కెట్‌ యార్డులో బేనీషా రూ.10 వేల నుంచి రూ.24 వేలు, కాలేపాడ్‌ రకం రూ.25 వేల నుంచి రూ.30 వేలు, రుమాని రూ.40 వేల నుంచి 60 వేలు ఉందన్నారు.  

   - హిందుమతి, మార్కెటింగ్‌ ఏడీ