వరి వద్దు....!

ABN , First Publish Date - 2021-12-01T05:03:24+05:30 IST

గత నాలుగేళ్లుగా ఇబ్బడి ముబ్బడిగా వరి దిగుబడులు వస్తుండడం, కొనుగోళ్ల ప్రక్రియ సర్కారుకు సవాళ్లుగా మారుతుండడం.. ధాన్యం నిల్వలు పెద్ద ఎత్తున్న పేరుకుపోతుండడం మిల్లింగ్‌, నిల్వ సమస్యగా మారుతుండడంతో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాల్సిందిగా ప్రభుత్వం దిశా నిర్దేశం చేయనుంది.

వరి వద్దు....!

- యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు

- వరి సాగు చేయవద్దని తేల్చి చెప్పిన ప్రభుత్వం

- మొక్కజొన్న తరహాలోనే వరి పరిస్థితి

- ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన

- నూనె గింజల పంటలు సాగు చేయాలంటున్న వ్యవసాయ శాఖ

- జిల్లాలో నేలలు వరికి మాత్రమే అనుకూలంగా ఉన్నాయంటున్న రైతులు 

- ఇప్పటికే పలు ప్రాంతాల్లో నారుమళ్లు సిద్ధం చేసుకున్న రైతులు

- వరి సాగుపై అయోమయంలో అన్నదాతలు

కామారెడ్డి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): గత నాలుగేళ్లుగా ఇబ్బడి ముబ్బడిగా వరి దిగుబడులు వస్తుండడం, కొనుగోళ్ల ప్రక్రియ సర్కారుకు సవాళ్లుగా మారుతుండడం.. ధాన్యం నిల్వలు పెద్ద ఎత్తున్న పేరుకుపోతుండడం మిల్లింగ్‌, నిల్వ సమస్యగా మారుతుండడంతో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాల్సిందిగా ప్రభుత్వం దిశా నిర్దేశం చేయనుంది. కేంద్ర సైతం కొనుగోళ్లపై విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ యాసంగిలో వరి సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం సైతం స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయంగా నూనె గింజల పంటలు, పప్పు దినుసుల ఆరుతడి పంటలను సాగు చేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలంటూ ప్రభుత్వం ఆయా జిల్లాల వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో వరి సాగుకు సర్వే చేపట్టడంతో పాటు ఆరుతడి పంటలు, నూనె గింజల పంట సాగుపై రైతుల్లో అవగాహన మొదలుపెట్టారు. జిల్లాలో వరి పంట సాగయ్యేందుకు నేలలు ఉన్నాయని ఇతర పంటలు సాగుచేసే అవకాశం లేదని రైతుల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరి సాగుపై రైతులు నారుమళ్లను సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వరి సాగుపై అన్నదాతల్లో అయోమయం నెలకొంటుంది.

జిల్లాలో లక్షల ఎకరాలలోనే వరి సాగు

జిల్లాలో వానాకాలం, యాసంగి సీజన్‌లలో ఎక్కువగా వరి పంటనే రైతులు సాగు చేస్తూ వస్తున్నారు. ప్రతీ సీజన్‌లో రెండు లక్షల ఎకరాలకు పైగానే వరి సాగవుతుందంటే రైతులు వరికి ఎలా మొగ్గుచూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో వరి ధాన్యం పెద్ద ఎత్తున సాగవుతున్న సంగతి తెలిసింది. ఉచిత విద్యుత్‌, రైతుబంధుతో పాటు ఇతర సర్కారు సహాయంతో రైతులు వానాకాలం, యాసంగిలో వరి పంటకే మొగ్గు చూపుతున్నారు. అయితే జిల్లాలో మెట్టపంటల సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. మెట్ట పంటలు సాగయ్యే భూములను సైతం చదును చేసి రైతులు వరి సాగు చేస్తున్నారు. గత వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 4,87,902 ఎకరాలలో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో వరి ఒక్కటే సగానికి పైగా సాగైంది. 2.47 లక్షల ఎకరాలలో వరి సాగైంది. మొక్కజొన్న 33,363, పత్తి 58,496, కందులు 24,611, పెసర్లు 15,564, మినుములు 10,556, సోయా 85,499, చెరుకు 7,103, జొన్నలు 293 ఎకరాలలో సాగయ్యాయి.

వరికి మొక్కజొన్న తరహాలో పరిస్థితి 

ఇప్పటికే ప్రభుత్వం నిర్బంధ సాగు విధానం పేరిట మొక్కజొన్న పంటలను సాగు చేయవద్దని ఆ పంటకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ప్రభుత్వం కోరుతూ వస్తోంది. వరి, పత్తితో పాటు ఇతర పప్పుదినుసు పంటలను సాగు చేయాలంటూ గతంలో గుర్తించింది. ఇక నుంచి మొక్కజొన్న తరహాలోనే యాసంగి సీజన్‌లో వరి పంటను సాగు చేయద్దంటూ అధికారికంగానే ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు వానాకాలం, యాసంగి సీజన్‌లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ముందు ముందు తగ్గించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. వ్యవసాయ అధికారులు మాత్రం దీనిపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకున్నా ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో వరికి ప్రత్యామ్నాయంగా నూనె గింజల పంటలను సాగు చేయాలంటూ రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. వచ్చే యాసంగి నుంచి వరి సాగుకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది.

ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం

ప్రభుత్వం రాబోయే యాసంగి సీజన్‌ నుంచి వరి పంట సాగు చేయవద్దని సూచిస్తోంది. దీంతో రైతులు కూడా ఇప్పటి నుంచే అప్రమత్తమయి యాసంగిలో వరికి బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేందుకు సిద్ధం కావాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ఆయిల్‌పాం తోటల పెంపకాన్ని ప్రత్యామ్నాయ పంటగా సాగు చేయాలంటూ ఉద్యానశాఖ ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అధికారులు ఆయిల్‌పాం పంటలు సాగు చేయాలని సూచిస్తున్నా రైతులకు మాత్రం సాగుతో పాటు తర్వాత చేకూరబోయే ప్రయోజనాల విషయంలో ధీమా కల్పించలేక పోతున్నారు. దీంతో పాటు పొద్దుతిరుగుడు, కుసుమలు, ఆవాలు, శనగ, వేరుశనగలతో పాటు పప్పుదినుసు పంటలను సాగు చేయాలంటూ ఎక్కువ లాభాలు చేకూరుతాయంటూ వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన చేస్తున్నారు.


ప్రత్యామ్నాయ పంటల  వైపు రైతులు అడుగులు వేయాలి

- భాగ్యలక్ష్మీ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, కామారెడ్డి

జిల్లాలోని వ్యవసాయ భూములు వరితో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుకు అనుకూలంగానే నేలలు ఉన్నాయి. రైతులు వరికి బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు మొగ్గు చూపాలి. ప్రధానంగా నూనె గింజల పంటలైన పొద్దు తిరుగుడు, కుసుమలు, ఆవాలు, ఆయిల్‌పాం, వేరుశనగతో పాటు పప్పుదినుసు పంటలను సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయి. ప్రభుత్వం వచ్చే యాసంగి నుంచి వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించింది. ఆదేశాల మేరకు జిల్లాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.

Updated Date - 2021-12-01T05:03:24+05:30 IST