సాహిత్యంలోనూ గదులేనా?

ABN , First Publish Date - 2021-04-19T05:45:44+05:30 IST

ఎవరి జీవితానుభవాలను వాళ్ళే చెప్పాలన్న వాదం, లేదా అభిప్రాయం కొంత కాలం నుంచీ సాహిత్యంలో వినిపిస్తోంది. స్త్రీలను గురించి స్త్రీలూ, దళితుల గురించి...

సాహిత్యంలోనూ గదులేనా?

ఎవరి జీవితానుభవాలను వాళ్ళే చెప్పాలన్న వాదం, లేదా అభిప్రాయం కొంత కాలం నుంచీ సాహిత్యంలో వినిపిస్తోంది. స్త్రీలను గురించి స్త్రీలూ, దళితుల గురించి దళితులూ, ముస్లింల గురించి ముస్లింలూ చెప్పాలంటున్నారు. ఇందుకు అనుగుణంగా స్త్రీల కథలూ, దళితుల కథలూ, ముస్లింల కథలూ సంకలనాలుగా వెలువడుతున్నాయి. ఈ ధోరణి మంచిదేనా, కాదా, మంచిదైతే ఎంత వరకూ మంచిది అన్న చర్చ ఇంతవరకూ జరిగినట్టు లేదు. ఆయా సామాజిక వర్గానికి నచ్చకపోతే, తనపై ఆ వర్గ వ్యతిరేకి అన్న ముద్ర పడుతుందన్న భయం కారణం కావచ్చుననిపిస్తోంది. ఇందులో దళితులు, ముస్లింల విషయంలో కనిపిస్తున్న ఏకీభావం స్త్రీల విషయంలో కనిపించడం లేదు. ఉన్నత కులాల (కులమూ, వర్గమూ పూర్తి విడిగా లేవు) స్త్రీల అనుభవాలూ, దళిత స్త్రీల అనుభవాలూ వేరు వేరు కనుక, సరే, ఈ అంతర్గత చర్చనలా ఉంచుదాం. 


ఎవరి అనుభవాలు వాళ్ళే చెప్పాలి... అన్నంతవరకే ఆలోచిద్దాం. ఎవరి అనుభవాలు వాళ్ళే చెప్పాలనడం న్యాయమైనదే, ఆహ్వానించవలసిందే. ఎందుకంటే మన సమాజం నిచ్చెనమెట్ల సమాజమే గాదు, వేరు వేరు గదుల్లో వుంటున్న సమాజం. ఒక గదిలో వున్నవారి అనుభవాలు ఇంకో గదిలో వున్నవారికి పూర్తిగా తెలీవు. పైపై సమాచారం మాత్రమే తెలుస్తుంది. జనం నివసించడానికికైతే ఇళ్ళూ, గదులూ లేవు కానీ ఇటువంటి గదుల నిర్మాణం మాత్రం ఇంకా ఇంకా పెరుగుతోంది. ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్పినప్పుడు, ఆ గది బయట గదుల్లో వున్నవారికి కూడా వాళ్ళ వాస్తవ జీవితం ఏదో, ఎలా వుందో తెలిసే అవకాశం వస్తుంది. సామాజికంగానే కాక, సాహిత్యపరంగా కూడా అవసరమైనదే. ఊహించో, తెలిసీ తెలియకనో చెప్పే అవసరం వుండదు. అయితే, ఎవరి అనుభవాలు వాళ్ళే చెప్పాలి, ఇతరులు చెప్పరాదు అని ‘తీర్పు’ లాగా వుండవచ్చా? ఇతరులు ఎంత బాగా చెప్పినా, అది స్వీయానుభవం కాదు కనుక సానుభూతి మాత్రమేననీ, అందువల్ల తమకు కలిగే ప్రయోజనమేదీ వుండదనీ అనవచ్చా? ఆ సానుభూతి తమను వంచించ డానికేనన్న భావమూ వుంది. అది సరైనదేనా?


అన్యాయం పట్ల మొట్టమొదట వ్యక్తమయ్యే వ్యతిరేకత బాధితుల పట్ల సానుభూతి మాత్రమే. అందువల్ల సానుభూతిని కపటంగా భావించరాదు. ‘‘ముదితల్‌ నేర్వగ రాని విద్య కలదే ముద్దార నేర్పించినన్‌’’ అనడం స్త్రీలను వంచించడానికి కాదు. ‘నేర్పించినన్‌’ అన్నది అప్పటి వాస్తవిక దృక్పథం, సానుభూతి కూడా. సానుభూతి ఏ రకంగా చూసిన పరిమితి అవుతుందే కానీ వంచన కాదు. దళితుల గురించి చెప్పినా, ముస్లింల గురించి చెప్పినా ఇదే వర్తిస్తుంది. మాట్లాడుతున్నది అనుభవాలకు సాహిత్య రూపం ఇవ్వడం గురించి కనుక, ఇది చెప్పుకోవాలి. అనుభవాలు అందరికీ వుంటాయి. వాటికి సాహిత్య రూపం ఇవ్వడం అందరికీ సాధ్యం కాదు. ఇచ్చినా తమకే నష్టం కలిగే అభిప్రాయాలను వ్యక్తం చెయ్య రన్న గ్యారంటీ ఏదీ లేదు. అయితే, ఇవి చిన్న సమస్యలే. వాటిని అధిగమించడం అసాధ్యమేమీ కాదు. 


సమాజంలో ఇప్పటికే మనం విడివిడిగా, వేరు వేరు గదుల్లో ఉంటున్నాం. సాహిత్యంలో కూడా అలాగే ఉందామా? ఉండకూడదనుకుంటే, స్త్రీల గురించి స్త్రీలూ, దళితుల గురించి దళితులూ, ముస్లింల గురించి ముస్లిములూ మాత్రమే చెప్పాలనడం ఎందుకు? 

పి. రామకృష్ణ

Updated Date - 2021-04-19T05:45:44+05:30 IST