యోగులు సీఎం అవ్వడమేంటి?: సాధువు విమర్శలు

ABN , First Publish Date - 2022-01-25T23:38:40+05:30 IST

రెండు వాగ్దానాలపై ఏ వ్యక్తి నిలబడలేడు. ఒక యోగి ఇప్పటికే మహంత్‌గా ఉండొచ్చు కానీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అవ్వకూడదు. ఇలాంటివి ‘ఖలీఫత్’ సిద్ధాంతంలోనే అవుతాయి..

యోగులు సీఎం అవ్వడమేంటి?: సాధువు విమర్శలు

లఖ్‌నవూ: యోగులు ముఖ్యమంత్రులు అవ్వడమేంటని ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాధువు స్వామి అవిముక్తేశ్వరానంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరును ఆయన ప్రస్తావించకపోయినప్పటికీ యోగీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని స్పష్టమవుతూనే ఉంది. సెక్యూలరిజం ప్రకారం పాలన చేస్తానని ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఒక మత విశ్వాసానికి ఎలా కట్టుబడి ఉంటారని అవిముక్తేశ్వరానంద సోమవారం ప్రశ్నించారు.


ప్రయాగ్‌రాజ్‌లో మీడియాతో అవిముక్తేశ్వరానంద మాట్లాడుతూ ‘‘రెండు వాగ్దానాలపై ఏ వ్యక్తి నిలబడలేడు. ఒక యోగి ఇప్పటికే మహంత్‌గా ఉండొచ్చు కానీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అవ్వకూడదు. ఇలాంటివి ‘ఖలీఫత్’ సిద్ధాంతంలోనే అవుతాయి. ఒక ఇస్లామీ ప్రవర్త, పాలనాధికారి అయ్యేది ఖలీఫత్ ద్వారానే’’ అని అన్నారు. యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే గోరఖ్‌పూర్ మందిరంలో మహంతిగా ఉన్న విషయం తెలిసిందే.


ఇక కొద్ది రోజుల క్రితం ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ‘మాఘ మేళా’పై సైతం యోగిపై విమర్శలు గుప్పించారు. ‘‘ఈ యేడాది మాఘ మేళా అత్యంత అనాదరణకు గురైంది. కొంత మంది సాధువులు తీవ్ర బెదిరింపులకు, స్వీయ దహనాల వరకు వెళ్లారు. నాయకులు ఎన్నికల్లో మునిగిపోతే ప్రభుత్వ అధికారులు ఎలా కట్టడి చేయగలుగుతారు?’’ అని అవిముక్తేశ్వరానంద అన్నారు. ఇక గంగా నదిలో ఉన్నపళంగా పెరిగిన నీటి మట్టాన్ని ప్రభుత్వం ముందుగా అంచనా వేయడంలో విఫలమైందని, ప్రభుత్వ సంస్థలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోలేకపోయిందని విమర్శించారు.


రాజకీయాల్లోకి సాధువులను దింపడం ఇప్పుడు ఒక ట్రెండని, ఈ పని అన్ని పార్టీలు ఇప్పుడు ఆచరిస్తున్నాయని, అయితే మతపరమైన పదవుల్లో రాజకీయ పార్టీలు తమ మనుషులను నిల్చోబెడుతున్నాయని అవిముక్తేశ్వరానంద అన్నారు. గత ఎన్నికల్లో చేసిన తప్పులు మళ్లీ చేయొద్దని ప్రజల్ని హెచ్చరించిన అవిముక్తేశ్వరానంద.. ఈసారి ఎన్నికల్లో సరైన నాయకులనే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2022-01-25T23:38:40+05:30 IST