‘సమగ్ర శిక్ష’కులకు జీతాలేవీ?!

ABN , First Publish Date - 2021-04-13T09:51:59+05:30 IST

‘సమగ్ర శిక్ష’ ప్రాజెక్టు(ఎస్ఎస్‌ఏ) కార్యాలయాలు, వారి అధీనంలోని సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి మార్చి నెల వేతనాలు ఇప్పటి వరకు అందలేదు. ఆర్థికశాఖలోని సీఎ‌ఫ్‌ఎంఎస్‌ అధికారి నిర్వాకం వల్లే వారి జీతాలు

‘సమగ్ర శిక్ష’కులకు  జీతాలేవీ?!

రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల మందికి నేటికీ అందని మార్చి వేతనాలు

పండగ పూట సిబ్బంది యాతనలు

ఆర్థికశాఖ పీడీ అకౌంట్ల మైగ్రేషన్‌

సీఎఫ్‌ఎంఎస్‌ అధికారి నిర్వాకం


 (అమరావతి/విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘సమగ్ర శిక్ష’ ప్రాజెక్టు(ఎస్ఎస్‌ఏ) కార్యాలయాలు, వారి అధీనంలోని సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి మార్చి నెల వేతనాలు ఇప్పటి వరకు అందలేదు. ఆర్థికశాఖలోని సీఎ‌ఫ్‌ఎంఎస్‌ అధికారి నిర్వాకం వల్లే వారి జీతాలు ఆగిపోయాయని తెలుస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18 వేల కుటుంబాలు ఉగాది నాడు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం నెలవారీ జీతాల మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్న సమగ్ర శిక్షకుల పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో అకౌంట్ల సర్దుబాటు చర్యల్లో భాగంగా ఆర్థికశాఖ వివిధ కార్పొరేషన్లు, ప్రాజెక్టుల పీడీ అకౌంట్లను మైగ్రేషన్‌ చేస్తోంది.


దీంతో జీతాల చెల్లింపు ప్రక్రియ నిలిచిపోయింది. ప్రతి నెల 25లోగా జీతాల చెల్లింపు నిమిత్తం బిల్లులను విభాగాధిపతులు ఆర్థికశాఖకు సమర్పిస్తారు. అయితే, ఈసారి వరుసగా సెలవులు రావడంతో పలు విభాగాలు నిర్దేశిత సమయంలోగా బిల్లులు సమర్పించలేకపోయాయి. పడీ అకౌంట్ల మైగ్రేషన్‌ తొలుత క్లోజ్‌ అయి, సీఎ్‌ఫఎంఎస్‌ విండో మళ్లీ ఓపెన్‌ అయినప్పటికీ పీడీ అకౌంట్ల బిల్లులను గత నెల 31లోగా ఆమోదించలేదు. దీనిలో సమగ్ర శిక్ష ప్రాజెక్టుకు సంబంధించిన పీడీ అకౌంట్‌ కూడా ఉంది. ఫలితంగా పెండింగ్‌ బిల్లులన్నింటినీ 2021-22 ఆర్థిక సంవత్సరంలోకి బదలాయించి చెల్లింపులు చేయాల్సి వస్తోంది.

 

రెగ్యులర్‌ ఉద్యోగుల పరిస్థితీ ఇంతే

‘సమగ్ర శిక్ష’ రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయంలోని రెగ్యులర్‌ ఉద్యోగులతో సహా జిల్లా కార్యాలయాల్లోని అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు సిబ్బందిలో చాలా మందికి సోమవారం జీతాలు అందలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు అందజేయాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం కరోనా, ఇతరత్రా సాంకేతిక, పాలనాపరమైన కారణాలు చూపుతూ కొన్ని నెలలుగా మొదటి వారంలో జీతాలు చెల్లిస్తోంది. కానీ, ఈ నెలలో 12వ తేదీ వరకు కూడా మార్చి నెల జీతాలను చెల్లించకపోవడం గమనార్హం. తెలుగు ప్రజలకు ఉగాది ఎంతో ముఖ్యమైన పండుగ. అ విషయం తెలిసినప్పటికీ ‘సమగ్ర శిక్ష’ రాష్ట్ర, జిల్లా ప్రాజెక్టు కార్యాలయాలు, వాటికి అనుబంధంగా నడుస్తున్న విద్యా సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 18 వేల మంది ఉద్యోగుల కుటుంబాల పట్ల ఆర్థికశాఖ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.’’40% ఇచ్చేందుకు పాట్లు!


కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టు అయిన ఎస్‌ఎ్‌సఏ సిబ్బంది జీతాల్లో 60 శాతం కేంద్రమే భరిస్తుంది. మిగిలిన 40 శాతం రాష్ట్రం ఇస్తుంది. ఈ జీతాలకు కూడా రకరకాల ఆంక్షలు పెట్టడంతో సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి జిల్లాలో ఓ అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌(ఏపీసీ) నేతృత్వంలో సెక్టోరల్‌ ఆఫీసర్లు, ఇంజనీరింగ్‌ సిబ్బంది, గుమస్తాలు, ఇతర సిబ్బంది కలిసి దాదాపు 100 మంది వరకు ఉంటారు. మండలాల్లో ఉండే మండల రిసోర్స్‌ సెంటర్ల(ఎంఆర్‌సీ)లో ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసెంజర్లు పనిచేస్తున్నారు. జిల్లా స్థాయిని బట్టి స్కూల్‌ కాంప్లెక్స్‌లలో 200 నుంచి 300 మంది సీఆర్‌పీలు పనిచేస్తున్నారు. వీరితో పాటు క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ సబ్జెక్టుల బోధనకు పార్ట్‌ టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్లు 400 మంది వరకు పనిచేస్తుంటారు.


ఇన్‌క్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ బోధకులు, భవిత కేంద్రాల్లో ఆయాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)లో ఎస్‌వోలు, టీచర్లు, ఇతర సిబ్బంది ఉంటారు. ఒక్కొక్క జిల్లాలో ఏపీసీ నుంచి కింద స్థాయి సిబ్బంది వరకు 1300 నుంచి 1500 మంది వరకు పనిచేస్తున్నారు. ఈ లెక్కన రాష్ట్రం మొత్తం మీద 16 వేల నుంచి 18 వేల మంది వరకు పనిచేస్తున్నారు. వీరికి మార్చి నెల జీతాలు, వేతనాలు ఇప్పటి వరకు అందలేదు. 

Updated Date - 2021-04-13T09:51:59+05:30 IST