కరోనా వారియర్స్‌కు జీతాలేవీ?

ABN , First Publish Date - 2020-12-05T06:52:29+05:30 IST

కొవిడ్‌ వారియర్స్‌గా అందరిచేతా ప్రశంసలు అందుకున్న కార్మికులకు నాలుగు నెలలుగా జీతాలివ్వలేదు.

కరోనా వారియర్స్‌కు జీతాలేవీ?
పద్మావతి నిలయం వద్ద ఆందోళన చేస్తున్న పారిశుధ్య కార్మికులు

పద్మావతి నిలయం గేట్లుమూసి పారిశుధ్య కార్మికుల ఆందోళన 


తిరుచానూరు, డిసెంబరు 4: వందలాది మంది కరోనా బాధితులున్న ‘పద్మావతి నిలయం’లో వాళ్లు పారిశుధ్య పనులు చేపట్టారు. రిస్క్‌నూ లెక్క చేయకుండా ఎప్పటికప్పుడు గదులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు. కొవిడ్‌ వారియర్స్‌గా అందరిచేతా ప్రశంసలు అందుకున్నారు. అలాంటి కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. నాలుగు నెలలుగా జీతాలివ్వలేదు. కడుపు మండిన వందమందికిపైగా పారిశుధ్య కార్మికులు శుక్రవారం తిరుచానూరు సమీపంలోని పద్మావతి నిలయం (జిల్లా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌) గేట్లు మూసి ఆందోళనకు దిగారు. నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారిందని ఆవేదన చెందారు. ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నామని వాపోయారు. దాదాపు నాలుగు గంటల పాటు వీరి ఆందోళన కొనసాగింది. పద్మావతి నిలయం ఇన్‌చార్జి, తుడా కార్యదర్శి లక్ష్మి అక్కడికి చేరుకుని మరో పది రోజుల్లో వేతనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. కాగా, వేలాది మంది కొవిడ్‌ బాధితులు కోలుకుని వెళ్లిన పద్మాతి నిలయానికి ప్రభుత్వం నుంచి మూడు నెలలుగా దాదాపు రూ.1.5 కోట్లు రాలేదని తెలిసింది. దీనివల్ల కాంట్రాక్ట్‌ కార్మికులకు జీతాలు అందించలేని పరిస్థితి నెలకొందని అధికారులు అంటున్నారు. 

Updated Date - 2020-12-05T06:52:29+05:30 IST