చినుకు కినుక!

ABN , First Publish Date - 2021-08-15T05:42:02+05:30 IST

అదునులో వరుణుడు దోబూచులాడుతున్నాడు. దీంతో పంటల సాగుకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఉన్నారు.

చినుకు కినుక!
పచ్చి మిర్చి పైరును దున్ని వేస్తున్న రైతు

అదునులో కాని పదును

జిల్లాలో బెట్ట వాతావరణం ముందుకు సాగని ఖరీఫ్‌ 

సాధారణంలో 62శాతమే పంటల సాగు

అందులోనూ పలుప్రాంతాల్లో బెట్టకొస్తున్న పైర్లు

సగం కూడా సాగుకాని కంది 

మిర్చి నాట్లకు రైతుల అవస్థలు 

కీలక సమయంలో  వరుణుడి దోబూచులాట

అదునులో వరుణుడు దోబూచులాడుతున్నాడు. దీంతో పంటల సాగుకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఉన్నారు. సిద్ధం చేసిన దుక్కులు ఖాళీగా ఉన్నాయి.  ఎండలు మండిపోతూ  వడగాలులు వీస్తున్నాయి. దీంతో రోజురోజుకూ అన్నదాతల ఆశలు అడియాశలవుతున్నాయి.అప్పుడప్పుడూ ఆకాశం మేఘావృతంగా మారడం.. వర్షం కురుస్తుందని రైతులు ఎదురుచూడటం పరిపాటిగా మారింది. ఆ ఆశలు ఎంతోసేపు నిలవడం లేదు. చిరుజల్లులతో సరిపెడుతోంది. ముందుపడ్డ వానలకు అక్కడక్కడా వేసిన పంటలు ఇప్పుడు ఎండుముఖం పట్టాయి. ప్రస్తుతం ఆరుతడి పంటలకు, కూరగాయలకు, ఆకుకూరలకు వర్షం అవసరం. ఇప్పటికే సాగు చేసిన పత్తి, మిర్చి, కంది ఇతర పైర్లు వానలేక గిడస బారిపోతున్నాయి. పశ్చిమ ప్రకాశంలో పరిస్థితి దారుణంగా ఉంది. వర్షాలు లేకపోవడం, దుమ్ముతో కూడిన వడగాలులకుతోడు కుచ్చుతెగులు సోకి మిరప ఎదుగుదల లేక గిడసబారి పోయింది. దీంతో కొందరు రైతులు దున్నేశారు. మరికొందరు వేచి చూస్తున్నారు. ఇదీ జిల్లాలో ఖరీఫ్‌ పరిస్థితి.

ఒంగోలు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కీలక సమయంలో వరుణుడు ముఖం చాటేశాడు. దాదాపు పక్షం రోజులుగా జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షం లేదు. ఖరీఫ్‌ సీజన్‌లో ఆగస్టు అత్యంత కీలకం కాగా ఈ సమయంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు మొత్తం సీజన్‌పైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.  జిల్లాలో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు ఖరీఫ్‌ సీజన్‌ కాగా జూన్‌లో కురిసే జల్లులతో సజ్జ, పెసర, నువ్వు వంటి తొలకరి పైర్లు సాగుతో పాటు ప్రధాన ఖరీఫ్‌ పంటల సాగుకు రైతులు భూములు సిద్ధం చేస్తారు. ఆ తర్వాత కురిసే వర్షాలతో ప్రధాన మెట్ట పంటలైన కంది, పత్తి, మిర్చి, మినుములను జూలై, ఆగస్టు నెలల్లో విస్తారంగా సాగు చేస్తారు. ఇక ఆగస్టు ఆఖరు నుంచి సెప్టెంబరు వరకు ఖరీఫ్‌లో మాగాణి సాగు చేస్తారు. అలా ఆగస్టు ఈ సీజన్‌లో తొలకరిలో వేసిన పైర్లు ఎదుగుదలకు, ప్రధాన పంటల సాగుకు కీలకం. ఇప్పటికే జిల్లాలోని అత్యధిక ప్రాంతాల్లో పంటలు సాగై పచ్చదనంతో పాటు ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతూ బిజీబిజీగా రైతులు ఉండాల్సిన సమయం. అలాంటిది గత పక్షం రోజులుగా వానజాడ లేక జిల్లాలో బెట్టవాతావరణం నెలకొంది.


సగం కూడా సాగుకాలేదు

జూన్‌ నుంచి ఇప్పటివరకు 70రోజుల్లో జిల్లాలో 173.6 మి.మీ. వర్షపాతం కురవాలి. ఆ మేర కురిసింది. అయితే అందులో ఎక్కువగా జూలైలోనే పడింది. తొలకరి సాగుచేసే జూన్‌తోపాటు ప్రస్తుత ఆగస్టులో వర్షం పడక పంటల సాగు ముందుకు సాగలేదు. జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 2.12లక్షల హెక్టార్లు కాగా ఈ సమయానికి 63,776 హెక్టార్లలో పంటలు సాగు కావాలి. అయితే కేవలం 39,885 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. అందులో కూడా 13,500 హెక్టార్లలో కంది, 11,451 హెక్టార్లలో పత్తి ఉంది. నిజానికి ఈ సమయానికి దాదాపు 30వేల హెక్టార్లకుపైగా కంది, 13వేల హెక్టార్లలో పత్తి, మరో 15వేల హెక్టార్లలో సజ్జ, నువ్వు, పెసర వంటివి సాగు కావాలి. అలాంటిది ఏ ఒక్క సాగు సరిలేదు. గత నెలలో కురిసిన వర్షాలతోనే ఆ మాత్రమైన సాగు జరిగినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం భూముల్లో ఉన్న ఆ పంటలన్నింటికీ కీలక సమయం. బాగా వర్షాలు కురిస్తే తొలుత వేసిన పైర్లు పండటం, తర్వాత వేసిన పైర్లు బాగా ఎదుగుదలతో కళకళలాడుతాయి. అలాగే రానున్న నెలన్నర రోజులు మరింత విస్తారంగా పలు రకాల పంటలు సాగవుతాయి. ప్రధానంగా మిర్చి, వరి, మినుము వంటి వాటిని సాగు చేస్తారు. 


అదును దాటుతోంది..

పక్షంరోజులుగా జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితి మొత్తం ఖరీఫ్‌ సీజన్‌ సాగుకు ప్రతికూలంగా కనిపిస్తోంది. దాదాపు వారం, పదిరోజులుగా మిర్చి, కంది, పత్తి, మినుము పంటల సాగు జిల్లాలో ముందుకు సాగడం లేదు. అదును పోతుండటంతో రైతులు అవస్థలు పడి నీరు పెట్టి మిర్చి, పత్తి వేస్తున్నారు. ఇక ఇప్పటికే సాగుచేసిన పలురకాల పంటలు పూర్తిగా బెట్టకు వచ్చాయి. పలుచోట్ల పశుగ్రాస పంటలు సైతం వర్షం లేక వాడిపోతున్నాయి. ఇలా వర్షాభావానికి తోడు ఎండల తీవ్రత పెరగడం మరింత ప్రతికూలంగా మారింది. సాధారణంగా జిల్లాలో ఈ సమయంలో 32 నుంచి 35 డిగ్రీల లోపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉంటాయి. అలాంటిది వారం పదిరోజులుగా 38 డిగ్రీలు నమోదవుతోంది. ఈ మొత్తం పరిస్థితిపై ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో సాగుపై రైతులలో ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది కూడా ఆగస్టు తొలిపక్షంలో ఇలాంటి వాతావరణమే నెలకొని పంటల సాగును దెబ్బతీసింది. ఈ వారంలో సరైన వర్షాలు కురవకపోతే సీజన్‌ను ప్రతికూల పరిస్థితి ఎదుర్కొనక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. 




Updated Date - 2021-08-15T05:42:02+05:30 IST