కేంద్రం ఆశయానికి గండి

ABN , First Publish Date - 2021-07-29T05:16:22+05:30 IST

కంది పంట విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహారభద్రతా పథకం కింద రైతులకు కందులు పంపిణీ చేస్తోంది. ఇందులో ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళా రైతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. వీళ్లను ప్రోత్సహించేందుకు ఆ కందులను ఉచితంగా అందజేస్తుంది.

కేంద్రం ఆశయానికి గండి

ఎస్సీ, ఎస్టీలకు అందని ఉచిత కందులు

ఒకే కుటుంబంలో ఆరుగురికి ఇచ్చిన వైనం 

అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పంపిణీ

రాయచోటి/చిన్నమండెం, జూలై 28: కంది పంట విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహారభద్రతా పథకం కింద రైతులకు కందులు పంపిణీ చేస్తోంది. ఇందులో ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళా రైతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. వీళ్లను ప్రోత్సహించేందుకు ఆ కందులను ఉచితంగా అందజేస్తుంది. ఎక్కువమంది వేరుశనగలో దీనిని అంతరపంటగా వేస్తుంటారు. అయితే రాయచోటి నియోజకవర్గంలో కొందరు వ్యవసాయాఽధికారుల తీరుతో కేంద్ర ప్రభుత్వ ఆశయం నీరుకారుతోంది. ఉచిత కందుల పంపిణీ అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరుగుతోందరనే ఆరోపణలున్నాయి. వివరాలిలా.. 

జాతీయ ఆహార భద్రతా పథకం కింద నాలుగు కిలోల కందులు ఉండే ఒక్కో సంచిని రైతుకు ఉచితంగా ఇస్తారు. ఈ పథకం కింద చిన్నమండెం మండలానికి జూన్‌ 20న ఎల్‌ఆర్‌జీ-52 రకం కందులు 230 సంచులు వచ్చాయి. వీటిని రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేయాలి. ఈ ఏడాది జూలై మొదటి వారంలోనే సుమారుగా వర్షాలు పడ్డాయి. దీంతో రైతులు దాదాపుగా వేరుశనగ సాగు చేశారు. అయినా ఇప్పటివరకు మండలంలో పూర్తి స్థాయిలో కందుల పంపిణీ జరగలేదు.


ఎస్సీ, ఎస్టీలకు మొండిచేయి

ఈ పథకంలో భాగంగా కేటాయించిన కందుల్లో 17 శాతం ఎస్సీ, 7 శాతం ఎస్టీ కులాలకు చెందిన రైతులు, 33 శాతం మహిళా రైతులకు, మిగిలినవి చిన్నసన్నకారు రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే రాయచోటి నియోజకవర్గంలో అందుకు విరుద్ధంగా జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా చాలా గ్రామాల్లో స్థానిక అధికార పార్టీ నాయకులు ఈ కందులను తమకు అనుకూలమైన వారికి ఇప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకే కుటుంబంలో ఆరుగురికి ఇచ్చారని తెలిసింది. చిన్నమండెం మండలంలోని బోనమలలో 19 మంది రైతులకు 25 సంచుల కందులు పంపిణీ చేశారు. అందులో ఒకరు మాత్రమే ఎస్సీ కులానికి చెందిన రైతు ఉన్నారు. చిన్నమండెం ఆర్‌బీకే-2లో 17 మంది రైతులకు 20 సంచులు పంపిణీ చేశారు. ఇందులో కూడా ఒకరు మాత్రమే ఎస్సీ కులానికి చెందిన రైతు ఉన్నారు. చిన్నమండెం ఆర్‌బీకే-1 లో 13 మంది రైతులకు 20 సంచుల కందులు ఇచ్చారు. ఇందులో ఒకరు కూడా ఎస్సీ, ఎస్టీ రైతులు లేరు. ఇదే పరిస్థితి నియోజకవర్గ వ్యాప్తంగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి.


అధికార పార్టీ నేతల సేవలో..

కొందరు వ్యవసాయ శాఖాధికారులు స్థానిక అధికారపార్టీ నాయకుల సేవలో తరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జాతీయ ఆహార భద్రతా పథకం నిబంధనలకు విరుద్ధంగా కందుల పంపిణీ జరుగుతున్నా వీరు పట్టించుకోవడం లేదని అంటున్నారు. మండలాల పరిస్థితి ఇలా ఉంటే.. నియోజకవర్గ కేంద్రంలో ఉండే సహాయ సంచాలకుల కార్యాలయం వారు కూడా ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి.. జాతీయ ఆహార భద్రతా పథకం నిబంధనల ప్రకారం కందులు పంపిణీ చేయాలని పలువురు కోరుతున్నారు.


అర్హులు లేరు.. అందుకే అందరికీ ఇస్తున్నాం

- రామాంజులు, వ్యవసాయాధికారి, చిన్నమండెం

జాతీయ ఆహార భద్రతా పథకంలో పేర్కొన్నట్లు మా మండలంలో చాలా గ్రామాల్లో అర్హులైన ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన రైతులు లేరు. వాళ్లకు భూమి లేదు. మహిళా రైతులు అంత మంది లేరు. దీంతో సాగు చేస్తామని అడిగిన రైతులకు ఉచిత కందులు పంపిణీ చేశాం.

Updated Date - 2021-07-29T05:16:22+05:30 IST