టెస్టింగ్‌కిట్లు లేక పడిగాపులు

ABN , First Publish Date - 2021-05-08T05:26:56+05:30 IST

టెస్టింగ్‌కిట్లు లేక పడిగాపులు

టెస్టింగ్‌కిట్లు లేక పడిగాపులు
కరోనా పరీక్షల కోసం దోమ పీహెచ్‌సీకి వచ్చిన ప్రజలు

  •  పరీక్ష కేంద్రాల వద్ద ప్రజల నిరీక్షణ
  •  లక్షణాలు ఉన్నా పరీక్షించని వైద్యసిబ్బంది
  •  టెస్టుల సంఖ్య పెంచాలని పలుచోట్ల ధర్నా 

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : జిల్లాలో ఓ వైపు కరోనా ఉధృతి పెరుగుతూ ఉంటే, మరోవైపు నిర్ధారణ పరీక్షలు తగ్గించడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పరీక్షల కోసం వచ్చే బాధితుల సంఖ్యకు అనుగుణంగా కేంద్రాల్లో కిట్లు అందుబాటులో లేకపోవడంతో వచ్చిన వారు పరీక్ష చేసుకోకుండానే వెనుదిరగాల్సి వస్తోంది. ఈ పరిస్థితి గత రెండు వారాలుగా పరీక్షా కేంద్రాల్లో నెలకొంటోంది. ఉన్నతాఽధికారుల ఆదేశాల మేరకు ప్రతీ పీహెచ్‌సీలో 50మందికి తగ్గకుండా పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, సరిపడా కిట్లు లేక ఉన్న వాటి వరకే స్వాబ్‌ నమూనాలు సేకరించి మిగతా వారిని వెనక్కు పంపుతున్నారు. కొవిడ్‌ అనుమానిత లక్షణాలు ఉన్న వారు పరీక్ష చేసుకునేందుకు శుక్రవారం ఉదయమే దోమ పీహెచ్‌సీకి వచ్చి బారులు తీరగా, కిట్లు రాక వచ్చిన వారందరినీ పరీక్ష చేయకుండానే వెనక్కి పంపించి వేశారు. మోమిన్‌పేట పీహెచ్‌సీలో పరీక్షల కోసం వచ్చిన వారు పడిగాపులు పడాల్సి వచ్చింది. పూడూరు పీహెచ్‌సీలో పరీక్షల కోసం వచ్చే వారి సంఖ్యకు అనుగుణంగా కిట్లు లేక వచ్చిన వారు పడిగాపులు పడాల్సి వస్తోంది. జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

యాచారం ప్రభుత్వాసుపత్రి ఎదుట ధర్నా

యాచారం : కరోనా యాంటిజెన్‌ పరీక్షల కోసం ఉదయం ఏడున్నర  గంటలకే ఆసుపత్రికి వచ్చినా తమను పట్టించుకోవడం లేదని శుక్రవారం యాచారం ప్రభుత్వాసుపత్రి ఎదుట వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు 10గంటల నుంచి మధ్యాహ్నం 12:15గంటల వరకు ధర్నాకు దిగారు. కాగా టీకాలు కూడా సకాలంలో ఇవ్వడం లేదన్నారు. ఇదే విషయమై జిల్లా వైద్యాధికారిణి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మికి ఫిర్యాదు చేయగా, ఆమె హుటాహుటిన అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్‌ నాగజ్యోతిని యాచారం పంపించారు. ఆమె పర్యవేక్షణలో యాంటిజెన్‌ పరీక్షలతోపాటు కోవ్యాక్సిన్‌ ఇంజక్షన్లు ఇచ్చారు. పీహెచ్‌సీకి 30యాంటిజెన్‌ కిట్లు ఇస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాగా ఆసుపత్రిలో నిత్యం 60నుంచి 100వరకు యాంటిజెన్‌ కిట్లు అందించాలని యాచారం ఎంపీపీ కొప్పు సుకన్యబాషా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా ప్రజలకు ఇబ్బందులు రాకుండా తగు చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి కరోనా యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించేట్లు చర్యలు తీసుకుంటామన్నారు.

టెస్టుల సంఖ్య పెంచాలని బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా 

ఆమనగల్లు: కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు వరికుప్పల శ్రీనివాస్‌,   మున్సిఫల్‌ అధ్యక్షుడు రాజు గౌడ్‌, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కండె సాయిల ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా ఆసుపత్రికి చేరుకుని ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎస్‌ఐ ధర్మేశ్‌ అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పారు. పరీక్షల సంఖ్య పెంపు విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతానని ఎంపీహెచ్‌ఈవో తిరుపతిరెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు వరికుప్పల రాఘవ, నాగిళ్ల సందీప్‌, ప్రశాంత్‌, పాషా, తదితరులున్నారు.

దివ్యాంగులకు టీకాలు వేయించండి

ఘట్‌కేసర్‌ : పోచారం మున్సిపాలిటీలోని రాజీవ్‌ గృహకల్ప వద్ద ఉన్న దివ్యాంగుల కాలనీవాసులకు కరోనా టీకాలు వేయించేందుకు చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు మొక్క ఉపేందర్‌, ఉపాధ్యక్షుడు లింగమల్లు మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కాలనీలో 200మంది దివ్యాంగులు ఉన్నారని, వారంతా నిరుపేదలు కావడంతో తక్షణమే టీకాలు వేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి 

కీసర రూరల్‌ : జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని మేడ్చల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ జాన్‌శాంసన్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. గురువారం నాగారం మున్సిపల్‌ పరిధిలో నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే బృందాలు ఇంటింటికీ వెళ్లి కుటుంబసభ్యుల ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకోవాలన్నారు. అనారోగ్య సమస్యలున్న వారికి మందులను అందజేయాలని, కొవిడ్‌ లక్షణాలున్న వారు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుంట్ల చంద్రారెడ్డి, కమిషనర్‌ వాణి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

కొవిడ్‌ బాధితులు అధైర్యపడొద్దు : ఎంపీపీ 

ఘట్‌కేసర్‌ రూరల్‌ : కొవిడ్‌ బాధితులు అధైర్యపడొద్దని ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఎదులాబాద్‌లో కొవిడ్‌ బారినపడిన నాలుగు కటుంబాలకు ఎంపీపీ శుక్రవారం గుడ్లు, పోషక ఆహార పదార్థాలతోపాటు మందులు పంపిణీ చేశారు. అనంతరం అదే గ్రామానికి చెందిన రాజయ్యయాదవ్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతుంటే తన సొంత వాహనంలో ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి కొవిడ్‌ పరీక్షలు చేపించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కాలేరు సురేష్‌, ఉపసర్పంచ్‌ ఉప్పు లింగేశ్వర్‌రావు, వార్డుసభ్యులు పాల్గొన్నారు. 

గ్రామాల్లో కొనసాగుతున్న జ్వర సర్వే

ఘట్‌కేసర్‌ రూరల్‌ : గ్రామాల్లో ముమ్మరంగా జ్వర సర్వే కొనసాగుతోంది. మర్రిపల్లిగూడలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ నరేష్‌, వార్డుసభ్యులు సాయికుమార్‌, మంజుల, ఆనంద్‌, నాయకులు శ్రీకాంత్‌, అశవర్కర్లు, తదితరులు సర్వేలో పాల్గొన్నారు. 

మేడ్చల్‌, గుండ్లపోచంపల్లిలో..

మేడ్చల్‌  : మేడ్చల్‌, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం జ్వర సర్వే చేపట్టారు. మండలంలోని నూతన్‌కల్‌, రాయిలాపూర్‌ గ్రామాల్లో సర్వేను ఎంపీపీ పద్మజగన్‌రెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కవితాజీవన్‌, కో-ఆప్షన్‌ సభ్యురాలు రుక్సానాబేగం, కార్యదర్శి శరత్‌కుమార్‌, ఉపసర్పంచ్‌ ప్రభాకర్‌రెడ్డి, వార్డుసభ్యులు పాల్గొన్నారు. గౌడవెల్లి గ్రామంలో సర్పంచ్‌ సురేందర్‌ సర్వేను పరిశీలించారు.

కరోనా కట్టడికి ఇంటింటా సర్వే

శామీర్‌పేట : కరోనా కట్టడిలో భాగంగా ఇంటింటా సర్వేతో ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటున్నామని తూంకుంట మున్సిపాలిటీ ఇన్‌చార్జి కమిషనర్‌ శ్రవణ్‌కుమార్‌ అన్నారు. తూంకుంట మున్సిపల్‌ పరిధిలో కరోనా కట్టడికి సర్వే చేపట్టి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

 కరోనా లక్షణాలున్నవారికి మందులు అందజేత

  ఘట్‌కేసర్‌ : ఇంటింటా సర్వేలో భాగంగా ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో 1,394 ఇళ్లను సర్వే చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ వసంత తెలిపారు. ఇందుకోసం 12 బృందాలు పనిచేస్తున్నట్లు వివరించారు. శుక్రవారం 28మందికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించి వారికి అవసరమైన మందులను ఆశ కార్యకర్తలు అందజేసినట్లు తెలిపారు.

పోచారంలో.. పోచారం మున్సిపాలిటీలో గత రెండురోజుల్లో 1,478 ఇళ్లను సర్వే చేసి 26మందికి కొవిడ్‌ లక్షణాలున్నట్లు గుర్తించినట్లు కమిషనర్‌ సురేష్‌ తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్లు ముల్లి పావని జంగయ్యయాదవ్‌, బోయపల్లి కొండల్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ పల్గుల మాధవరెడ్డి, కమిషనర్లు వసంత, సురేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

కరోనా నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం

కడ్తాల్‌: కరోనా నియంత్రణ చర్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అయిళ్ల శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. ప్రభుత్వాల ప్రకటనలకు, పోకడలకు పొంతన లేదని ఆయన పేర్కొన్నారు. కడ్తాల మండలం మైసిగండి గ్రామంలో శుక్రవారం శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ ప్రభుత్వాల వైఫల్యంతోనే కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయన్నారు. కరోనాతో మృతిచెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

పారిశుధ్య పనులకు ప్రాధాన్యం

మాడ్గుల:  గ్రామంలో పారిశుధ్య పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఇర్విన్‌ సర్పంచ్‌ రాజమోని పుష్పలత అన్నారు. గ్రామపంచాయితీ కార్యాలయంలో శుక్రవారం కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కొప్పుల తిరుపతమ్మ,ఉపసర్పంచ్‌ బావోజి సుజాత, వార్డుసభ్యులు పాల్గొన్నారు.

గిరిజన నాయకుల ఔదార్యం

శంకర్‌పల్లి : కష్టకాలంలో వారికి వారే తోడుంటామని నిరూపించారు కొండాకల్‌ తండాకు చెందిన గిరిజనులు. గత 15 రోజులుగా సుమారు 12మందికి కరోనా సోకడంతో నాయకులు ఎవరూ పట్టించుకోకపోవడంతో తండాకు చెందిన శంకర్‌నాయక్‌, రవినాయక్‌లు సొంత డబ్బు వెచ్చించి నగరంలోని న్యూకేర్‌ ఆసుపత్రి డాక్టర్లతో కరోనా పరీక్షలు చేయించి 12మందిని ఒకేచోట ఉంచి మందులు, భోజన సౌకర్యాలు కల్పించడంతో పాటు తండాలోని 90 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తండా ప్రజలు 20రోజులుగా బయటకు వెళ్లకుండా బయటి వారు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

శామీర్‌పేట/మూడుచింతలపల్లి/చేవెళ్ల/ఇబ్రహీంపట్నం : శామీర్‌పేట, మజీద్‌పూర్‌, తుర్కపల్లి, లాల్‌గడిమలక్‌పేట గ్రామాల పంచాయతీ పాలకవర్గాలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌  తీర్మానం చేశాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 6గంటల వరకు వారం రోజులపాటు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని వివరించారు. నిబంధనలు అతిక్రమించరాదని హెచ్చరించారు. మూడుచింతలపల్లి మండలంలోని జగ్గంగూడలో పంచాయతీ పాలకవర్గం స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు తీర్మానం చేశారు. సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 7గంటల వరకు లాక్‌డౌన్‌ పాటిస్తున్నట్లు తెలిపారు. చేవెళ్ల పట్టణ కేంద్రంలో  కరోనా ఉదృతి పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చేవెళ్ల సర్పంచ్‌ బండారు శైలజారెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి నాలుగు వారాలపాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 6నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని తెలిపారు. ఇబ్రహీంపట్నంలో నేటి నుంచి ఈనెల 20వరకు మధ్యాహ్నం 3 గంటలనుంచి మరుసటి రోజు ఉదయం 5గంటల అన్ని వ్యాపార సముదాయాలు మూసివేసి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ విధించాలని మున్సిపల్‌ పాలకవర్గం, వ్యాపార సంఘాలు, పలు పార్టీల నాయకులు సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి చందు, వైస్‌చైర్మన్‌ ఆకుల యాదగిరిలు ఆమోదించారు.

Updated Date - 2021-05-08T05:26:56+05:30 IST