వ్యాక్సినై

ABN , First Publish Date - 2021-12-06T05:30:00+05:30 IST

కరోనా ఎప్పటికప్పుడు వేరియంట్‌ మార్చుకుంటోంది.. మొదట్లో కంటే టీకా సులభంగా అందుతోంది.. అయినా జనంలో ఇంకా మార్పు రాలేదు.

వ్యాక్సినై

ఇంకా అపోహలు వీడని జనం

టీకాకు ముందుకు రాని జిల్లావాసులు

తొలి డోస్‌కు దూరంగా 3 లక్షల మంది

17 లక్షల మంది రెండో డోస్‌ వేయించుకోవాలి 

12 ఏళ్ల పైబడిన వారికి ప్రారంభం కాని వ్యాక్సినేషన్‌ 

ఒమైక్రాన్‌ భయంతో బూస్టర్‌ డోస్‌ కోసం ఎదురుచూపు


గుంటూరు(సంగడిగుంట), డిసెంబరు 6: కరోనా ఎప్పటికప్పుడు వేరియంట్‌ మార్చుకుంటోంది.. మొదట్లో కంటే టీకా సులభంగా అందుతోంది.. అయినా జనంలో ఇంకా మార్పు రాలేదు. ఇంకా అపోహలు వీడలేదు.. ఈ కారణంగా జిల్లాలో వ్యాక్సినేషన్‌ లక్ష్యం 39,66,059 కాగా వీరిలో తొలి డోస్‌ 36,98,927, రెండో డోస్‌ 23,09,612   మంది మాత్రమే తీసుకున్నారు. అంటే జిల్లాలో ఇప్పటివరకు కనీసం మొదటి డోసు కూడా తీసుకోని 18 ఏళ్ల పై బడిన సుమారు మరో 3 లక్షల మంది ఉన్నారు. ఇక రెండో డోసు అయితే సుమారు 17 లక్షల మంది వేయించుకోవాలి. కొంతవరకు అపోహలు వీడి మొదటి డోసు వేయించుకున్న వారు కూడా రెండో డోసుకు ఎందుకు ముందుకు రావడంలేదనేది అంతుబట్టని ప్రశ్నగా ఉంది. అయితే కొందరు మాత్రం బూస్టర్‌ డోసుగా భావిస్తున్న మూడో టీకా కోసం ఎగబడుతున్నారు. మూడో డోసుపై ఆలోచించడం కన్నా అసలు ఇప్పటి వరకు ఒక్క టీకా కూడా తీసుకోని వారిని గుర్తించాల్సిన అవసరం వైద్యఆరోగ్యశాఖపై ఉంది. అలాంటి వారిని గుర్తించి వారికి వ్యాక్సిన్‌ అవసరం వివరించి టీకా వేసుకునేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాక్సిన్‌ వేయించుకోని వారికి కరోనా సోకితే వారి ద్వారా కొంత మ్యూటెంట్‌లు వ్యాప్తి చెందే అవకాశం పెచ్చుగా మారవచ్చు. అందువల్ల అందరికీ వ్యాక్సినేషన్‌ జరిగేలా చూడాల్సిన బాధ్యత అటు ప్రభుత్వ యంత్రాంగంపైనా.. ఇటు సమాజంపైనా ఉంది. ఇంటింటా సర్వే చేసి వ్యాక్సిన వేయించుకోని వారిని గుర్తిస్తున్నప్పటికీ టీకాకు   కొందరు విముఖంగానే ఉన్నట్లు అఽధికారులు చెబుతున్నారు. ఒమైక్రాన్‌ బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి వస్తున్న వారికి వైద్య ఆరోగ్య శాఖ పరీక్షలు నిర్వహిస్తునే ఉంది. 


అనుమతులు లేవు

ప్రస్తుతం జిల్లాలో రెండు డోసులు పూర్తి అయిన వారు ఒమైక్రాన్‌ భయాందోళనలతో బూస్టర్‌ డోసు కోసం ఆసక్తి చూపుతున్నారు. అయితే జిల్లాలో అధికారికంగా బూస్టర్‌ డోసు వేయడంలేదు. కొందరు మాత్రం తమ పలుకుబడి ఉపయోగించుకుని రహస్యంగా మూడో డోసు వేయించుకుంటున్నారు. 40ఏళ్ల పైబడిన వారికి బూస్టర్‌ డోస్‌ ఇవ్వవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే జిల్లాకి ఇప్పటికి వరకు అనుమతులు లేవు. నవంబరు 15వ తేదీ నుంచి 18 నుంచి 12 ఏళ్లపై బడిన వారికి వ్యాక్సినేషన్‌ ఇవ్వవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాని జిల్లాలో ఇంతవరకు ఎక్కడా వారికి టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభం కాలేదు. ఒక వైపు విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో ఆఫ్‌లైన్‌ తరగతులు ప్రారంభించారు. కేసులు తగ్గినా ఒమైక్రాన్‌ భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం అనుమతించినా ఇంకా జిల్లాలో 12 ఏళ్ల పైబడిన వారికి టీకా వేయక పోవడంపై పలువురులో ఆందోళన నెలకొంది. మరో వైపు ప్రైవేటుగా మాత్రం నగదుకు 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌ వేస్తున్నారు.  



Updated Date - 2021-12-06T05:30:00+05:30 IST