అజ్ఞానం వంటి పగ లేదు

ABN , First Publish Date - 2020-03-15T07:56:13+05:30 IST

దానంగావున నుదాత్త ధర్మ విధజ్ఞాశ్రీశ్రీ’’ అంటూ భీష్ముడు ధర్మరాజుతో నిజమైన పగ అంటే ఏమిటో చెబుతూ.....

అజ్ఞానం వంటి పగ లేదు

ఆంధ్ర మహాభారతం.. శాంతి పర్వంలో ధర్మరాజుకు భీష్మ పితామహుడు పలు ఉపాఖ్యానాల ద్వారా జ్ఞానబోధ చేశాడు. వారి సంభాషణలో జనక-పరాశర సంవాదం ఒకటి. ఈ సందర్భంలో మహాకవి తిక్కన ఓ చక్కని పద్యాన్ని రచించాడు.


  • ‘‘కంశ్రీశ్రీ మానవునకు దలపగన
  • జ్ఞానమునట్టి పగలే దసంగతకృత్యా
  • ధీనుండై రూపుసెడును

దానంగావున నుదాత్త ధర్మ విధజ్ఞాశ్రీశ్రీ’’ అంటూ భీష్ముడు ధర్మరాజుతో నిజమైన పగ అంటే ఏమిటో చెబుతూ.. పరాశరుడు జనకునకు ఏది హింస - ఏది అహింస అనే దానిలోని సూక్ష్మాంశములను తెలియజేసిన తీరును వివరించాడు. మానవులు అజ్ఞానంతో పొందిక లేని పనులకు అధీనులై.. నశిస్తూ ఉంటారు. మనుజునకు అజ్ఞానం వంటి శత్రువు లేదు. దీనిని వివరిస్తూ, ముందుగా ‘జ్ఞానం’ అంటే ఏమిటో తెలుసుకోవాలి. స్వస్వరూప జ్ఞానమే నిజమైన జ్ఞానం. తన స్వరూపాన్ని స్పష్టంగా తెలుసుకోవడం. దీన్నే తత్త్వం అంటారు. ఈ తత్త్వాన్ని మాయ చేసేది, కనుమరుగు గావించేదీ ‘అజ్ఞానం’. తాను అనగా దేహం. ఇంద్రియాలు అనే భావన అజ్ఞానం. తాను ఆత్మ అనే దానిని తెలియకుండా అడ్డుపడేది అజ్ఞానం. జ్ఞానం అనాది - అనంతం. సర్వకాల సర్వావస్థలలో ఉండటమే దీని లక్షణం.


అజ్ఞానం అనాదియే గాని.. మొదలు లేకుండా.. అంతం ఉన్నది. జ్ఞానం కలిగిన వెంటనే అజ్ఞానం మాయమౌతుంది. ఇక పగ విషయానికివస్తే.. ఇది మానవుడిని నాశనం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. ధన రూపేణా, వనితల రూపేణా, భూమి కోసమో పగ ఏర్పడుతుంది. పగ శత్రుత్వానికి దారితీస్తుంది. కానీ ఈ అజ్ఞానం అనే పగ మాత్రం ఏ కారణం వల్ల కలుగుతుందో చెప్పలేం. అకారణంగా కలిగేది పగ. ఈ అజ్ఞానం తక్కిన పగలను తలదన్ని పోయేది. తగిన కారణం తెలిస్తే దాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తాం. కానీ, తెలియకపోతే ఏమీ చేయలేం. ఈ పగ వల్ల మానవుడు అసంగతకృత్యాలకు - ఏ విధమైన పొందికలు లేని పనులకు వశమైపోతాడు. పొందికనే యోగం అంటారు. తనను పరమాత్మలో కలుపుకోవడమే యోగం. అదే మానవ జన్మకు పరమార్థం. అది లేనిది, దానికి వ్యతిరేకం అయినదే అసంగతం. ఈ అకృత్యాలను తొలగించాలంటే చాలా గొప్ప సాధన అవసరం. గురువు అనుగ్రహంతో, దైవ కృపతో తప్ప ఆ సాధన సాధ్యం కాదు.


మహాభారతంలోనే ఉద్యోగపర్వంలో ఒక పద్యంలో ‘‘పగఅడగించుటింతయు శుభంబగు’’ అన్నారు తిక్కనామాత్యులు. ఈ పగను అణచడం వల్ల జ్ఞాన సిద్ధి కలుగుతుంది. దీనినే ముక్తి/మోక్షం అని అంటారు. అందుకే.. మానవులు నిరంతరం ప్రయత్నాలు చేయాలని పరాశరుల వారు ఉపదేశించినారని, భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. సకల మానవులూ ఈ సందేశాన్ని అనుసరించి తమ అజ్ఞానాన్ని వదలి, పగను రూపుమాపి సత్య మార్గంలో పయనించి తరించాలి.

  • - పి.వి.సీతారామమూర్తి, వంకాయలపాడు
  • సెల్‌: 9490386015

Updated Date - 2020-03-15T07:56:13+05:30 IST