విద్యా దీవెనలో మొండిచేయి

ABN , First Publish Date - 2021-01-18T06:12:20+05:30 IST

ప్రతి ఇంట్లో ఒక్కరైనా పెద్ద చదువులు చదవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అందుకే విద్యార్థుల మెస్‌, హాస్టల్‌ ఫీజులు చెల్లించే పథకాన్ని ప్రవేశపెడుతున్నామని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి గత ఏడాది విద్యా, వసతి దీవెన పథకాన్ని ప్రారంభించే రోజున ప్రకటించారు

విద్యా దీవెనలో మొండిచేయి

  1. అందరికీ అని చెప్పి మాట మార్చిన ప్రభుత్వం 
  2. ప్రైవేటు, ఎయిడెడ్‌ విద్యార్థులకు ఇవ్వరట
  3. పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం.. 


కర్నూలు(ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంట్లో ఒక్కరైనా పెద్ద చదువులు చదవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అందుకే విద్యార్థుల మెస్‌, హాస్టల్‌ ఫీజులు చెల్లించే పథకాన్ని ప్రవేశపెడుతున్నామని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి గత ఏడాది విద్యా, వసతి దీవెన పథకాన్ని ప్రారంభించే రోజున ప్రకటించారు. కానీ అమలుకు వచ్చే సరికి మాట నిలబెట్టుకోవడంలో ఆయన ప్రభుత్వం తడబడుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుందని చెప్పిన ప్రభుత్వం,  ఇపుడు కేవలం ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకే వర్తిస్తుందని చెబుతోంది. దీంతో ప్రైవేటు, ఎయిడెడ్‌ కళాశాలల్లో పీజీ, ఇంటిగ్రెటెడ్‌, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులు జగనన్న వసతి దీవెన, విద్యా దీవెనకు దూరం అవుతున్నారు. దీనిపై జీవో 77 కూడా విడుదల చేశారు. ఉన్నత విద్య మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థులు ఈ జీవోతో షాక్‌కు గురయ్యారు. గత ఏడాది ఈ పథకం కింద దాదాపు 2 వేల మంది లబ్ధిపొందారు. ఈ ఏడాది కూడా దాదాపు అంతేమంది ఉంటాయరని అంచనా. ప్రభుత్వం ఇచ్చిన జీవోతో వీరంతా నష్టపోతారు. 


ఏడాదికే అటకెక్కుతోంది..

ఐటీఐ, పాలి టెక్నిక్‌, డిగ్రీ, పీజీ విద్యార్థుల వసతి, భోజన ఖర్చుల కోసం ఏడాదికి రూ.20 వేలు జగన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకం ద్వారా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా పాలిటెక్నిక్‌, డీగ్రీ, పీజీ చదువుతున్న 86,143 మందికి ఈ పథకాన్ని వర్తింప జేసింది. ఏడాది గడవక ముందే పథకాన్ని అటకెక్కించే ప్రయత్నం చేస్తోంది. జీవో 77 ప్రకారం 2020-21 విద్యా సంవత్సరంలో ప్రైవేటు, ఎయిడెడ్‌ కళాశాలలో ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులు చదివే విద్యార్థులకు వసతి దీవెన వర్తించదు. ఈ కోర్సులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఉంటుందన్న దీమాతో చాలా మంది పీజీ కోర్సుల్లో చేరడానికి ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వ నిర్ణయంతో నిరాశ చెందుతున్నారు. తమ పిల్లలను పై చదువులకు ఎలా పంపించాలని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లిందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.


ఉమ్మడి ఏపీలో నాటి సీఎం వైఎస్సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా అందరికీ పథకాన్ని వర్తింపజేశారు. దీనివల్ల వేలాది మంది పేద విద్యార్థులు బీటెక్‌, ఎంసీఏ వంటి ఉన్నత చదువులు చదివారు. కానీ ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ ఉన్నత చదువులను పేద విద్యార్థులకు దూరం చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పథకాన్ని అందరికీ వర్తింపజేయకపోతే ఆందోళన చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.


చదువు దూరమయ్యే ప్రమాదం

ఒకపుడు డిగ్రీ నుంచి పీజీకి వెళ్ళే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. మహిళల సంఖ్య మరీ తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పీజీ చేసేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. ప్రజల్లో చదువు పట్ల అవగాహన పెరిగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కూడా వారికి తోడ్పడింది. జిల్లా వ్యాప్తంగా పీజీ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. నూతన జీవో కారణంగా ఈ సంఖ్య పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. పేదింటి విద్యార్థులు సొంతంగా రూ.వేలు ఖర్చుచేసి ఉన్నత విద్యను అభ్యసించే పరిస్థితి లేకపోవడమే ఇందుకు కారణం.


మా ఆశలపై నీళ్లు

మాది వ్యవసాయ కుటుంబం. ఇటీవలే డిగ్రీ పూర్తి చేశాను. నేను పై చదువులు చదవాలనేది నా తల్లిదండ్రుల ఆశ. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉందన్న దీమాతో ఈ సంవత్సరం పీజీలో చేరుదామను కున్నా. కానీ ప్రభుత్వం ప్రైవేటు కళాశాలల్లో చదివే వారికి విద్య, వసతి దీవెన వర్తించదని జీవో ఇచ్చిం ది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నా లాంటి విద్యార్థులెందరో రీయింబర్స్‌మెంటు వంటి పథకా లతో చదువుకుంటారు. ప్రభుత్వ నిర్ణయంతో  ఉన్న త విద్య దూరమౌంది. - సాగర్‌, విద్యార్థి, ఆదోని


ఫీజు చెల్లించమంటున్నారు..

నేను ఆదోని ఆర్ట్స్‌ కళాశాలలో ఎంఏ రెండో సంవత్సరం చదువు తున్నా. మొదటి ఏడాది రూ. 1,250 కట్టాను. ఫీజు రియింబర్స్‌ మెంటు కింద రూ.18,500 వచ్చాయి. ప్రభుత్వం విద్యా దీవెన ఎత్తేశామని చెప్పడంతో మొత్తం ఫీజు రూ.22,250 చెల్లించాలని కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేస్తోంది. అంత చెల్లించే స్తోమత మా కుటుం బానికి లేదు. ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకునే నాలాంటి విద్యార్థులకు ప్రభుత్వ నిర్ణయం శరాఘాతం. - నర్సప్ప, విద్యార్థి, ఆదోని. 


ఆ జీవో శాపం లాంటిది..

ప్రభుత్వం తెచ్చిన జీవో 77 ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు శాపం లాంటిది. 2018-19, 2019-20 సంవత్సరానికి స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంటు సొమ్ము ఇంకా రాలేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు ఇపుడు విద్యా, వసతి దీవెన ఎత్తివేస్తున్నారు. ఇది విద్యార్థులను మోసం చేయడమే. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే జీవోను రద్దు చేయాలి. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. లేదంటే ఉద్యమిస్తాం.

- రామంజనేయులు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు.  


పేద విద్యార్థులకు శరాఘాతం

చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి స్కాలర్‌షిప్‌ ఇస్తామని చెప్పిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు మొండి చేయి చూపడం దారుణం. ప్రభుత్వం పీజీ కౌన్సెలింగ్‌ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత విద్య, వసతి దీవెన పథకాలను ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా దాదాపు 2 వేల మంది విద్యార్థులు నష్టపోతారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు అనే తేడా లేకుండా ప్రభుత్వం అందరికీ విద్యా దీవెన పథకాన్ని వర్తింపజేయాలి. అలాగే ప్రభుత్వం జీవో 77ను వెంటనే వెనక్కి తీసుకోవాలి. - శరత్‌, ఏఐఎస్‌ఎఫ్‌

Updated Date - 2021-01-18T06:12:20+05:30 IST