దుర్గా పండల్స్‌లోకి ప్రవేశం లేదు: కలకత్తా హైకోర్టు

ABN , First Publish Date - 2021-10-02T01:32:38+05:30 IST

దసరా ఉత్సవాల నేపథ్యంలో కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో

దుర్గా పండల్స్‌లోకి ప్రవేశం లేదు: కలకత్తా హైకోర్టు

కోల్‌కతా: దసరా ఉత్సవాల సందర్భంగా కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో దుర్గా పూజా మండపాల్లోకి సందర్శకులు వెళ్లడాన్ని నిషేధిస్తున్నట్టు తెలిపింది. మండపాలున్న ప్రాంగణాలను కంటైన్మెంట్ జోన్లుగా వ్యవహరించాలని ఆదేశించింది. గతేడాది కూడా కోర్టు ఇలాంటి ఆదేశాలనే జారీ చేసింది.


కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు గతేడాది విధించిన ఆంక్షలనే ఇప్పుడు కూడా విధించాలంటూ ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్ కుమార్ బిందాల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌ను విచారించింది. 


గతేడాది విధించిన ఆంక్షలే యథాతథంగా ఇప్పుడు కూడా అమల్లో ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. చిన్న మండపాల ప్రవేశ ద్వారానికి ఐదు మీటర్ల దూరంలో, పెద్ద మండపాలకు 10 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.


గతేడాది లానే బారికేడ్ల వద్ద ‘ప్రవేశం లేదు’ అన్న బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. పూజలు నిర్వహించే కమిటీలోని 15, 20 మంది మాత్రం మండపాల్లోకి వెళ్లొచ్చని స్పష్టం చేసింది. అలాగే, సందర్శకులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయాలని, కరోనా నేపథ్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. 

Updated Date - 2021-10-02T01:32:38+05:30 IST