నో వెయిటింగ్‌!

ABN , First Publish Date - 2021-07-12T16:10:34+05:30 IST

దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్‌గా..

నో వెయిటింగ్‌!
రైల్వే యార్డులో అభివృద్ధి పరిచిన నూతన లైన్

విజయవాడ - విశాఖపట్నం.. విజయవాడ - సికింద్రాబాద్‌ రైళ్ల రాకపోకల నిరీక్షణకు తెర

రైల్వేస్టేషన్‌ యార్డులో భారీ మార్పులు 

1.5 కిమీ నూతన లైన్‌ ఏర్పాటు

20 రూట్లతో నూతన బల్బ్‌ క్యాబిన్‌కు అనుసంధానం 

32 రూట్లతో ప్రస్తుత బల్బ్‌ క్యాబిన్‌ ఎలక్రానిక్‌గా మార్పులు

పెరగనున్న సెక్షన ల్‌ సామర్థ్యం.. మరిన్ని రైళ్లకు అవకాశం


విజయవాడ(ఆంధ్రజ్యోతి): దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్‌గా పేరుగాంచిన విజయవాడ ఏ1 రైల్వేస్టేషన్‌ పరిధిలో నిరీక్షణకు అవకాశం లేకుండా రైళ్ల రాకపోకలకు మార్గమేర్పడింది! రైల్వేస్టేషన్‌ యార్డులో భారీ మార్పులకు కొద్ది కాలం కిందట రైల్వే శ్రీకారం చుట్టింది! ఈ మార్పులతో రైళ్ల నిరీక్షణ సమయం గణనీయంగా తగ్గిపోనుంది. సెక్షనల్‌ సామర్థ్యం మరింత పెరుగనుంది. 


విజయవాడ - విశాఖపట్నం, విజయవాడ - సికింద్రాబాద్‌ మధ్య స్థూలంగా చూస్తే సికింద్రాబాద్‌ - విశాఖపట్నం మధ్య ఏకకాలంలో రైళ్ల రాకపోకలకు అవకాశం ఏర్పడుతోంది. దేశంలోనే రెండో అతి పెద్ద రైల్వే జంక్షన్‌గా భాసిల్లుతోన్న విజయవాడ.. రద్దీ జంక్షన్‌ కావటంతో రైళ్ల నిరీక్షణకు సమయం ఎక్కువగా ఉంటోంది. గతంలో రూట్‌ రిలే ఇంటర్‌ లాకింగ్‌ పనులను పెద్ద ఎత్తున చేపట్టడంతో నిరీక్షణ సమయాన్ని కొంత తగ్గించారు. అయినా అవుటర్‌లో రైళ్లు నిలపాల్సి వస్తోంది. ఈ అంశంపై కొంతకాలంగా దృష్టి సారించిన రైల్వే డివిజన్‌ అధికారులు సమస్యను అధిగమించేందుకు రైల్వేస్టేషన్‌ యార్డులో ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌తో పాటు అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి రైళ్లు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రధానంగా సికింద్రాబాద్‌ - విశాఖపట్నం, విశాఖపట్నం - సికింద్రాబాద్‌ మార్గాల్లో రాకపోకలు సాగించే రైళ్లు విజయవాడలో నిరీక్షించాల్సి వచ్చేది. ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థ మాన్యువల్‌గా ఉండటం, బల్బ్‌లైన్‌ సామర్థ్యం తక్కువగా ఉండటంతో నిరీక్షించాల్సి వచ్చేది. ఈ రైళ్లను ఆపటంతో ఇతర మార్గాల్లో వచ్చే రైళ్ల రాకపోకలపై ప్రభావం పడేది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రస్తుత యార్డ్‌ ఉత్తర భాగంలో మార్పులు చేపట్టింది. నూతన బల్బ్‌ క్యాబిన్‌ను ఏర్పాటు చేసింది.


గతంలో ఇరుగ్గా ఉండే బల్బ్‌ క్యాబిన్‌ను మార్చారు. ప్రస్తుతం ఉన్న రెండు క్యాబిన్లలో మార్పులు చేశారు. మొత్తం 32రూట్లతో కొత్తగా ఎలక్ర్టానిక్‌ బల్బ్‌ క్యాబిన్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఆటోమేటిక్‌గా యార్డు నుంచి రైలు ఏ మార్గంలోకి వెళ్లిపోవాలో నిర్దేశం జరిగిపోతుంది. న్యూ వెస్ట్‌ బ్లాక్‌ బల్బ్‌ క్యాబిన్‌ను 1.5 కిలోమీటర్ల మేర సరికొత్త లైన్‌తో 20 రూట్లకు అనుసంధానించారు. ఈ భారీ మార్పుల కారణంగా రైళ్ల రాకపోకల నిర్వహణలో క్రాసింగ్‌లను చాలావరకు నివారించవచ్చు. ఏకకాలంలో రైళ్ల నిర్వహణ సాధ్యమౌతుంది. సెక్షనల్‌ సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా మరిన్ని రైళ్లు నడిపేందుకు అవకాశం కలుగుతుంది. సెక్షన్ల మధ్య రైళ్ల సగటు వేగం బాగా పెరగటానికి దోహదపడుతుంది. యార్డులో కూడా రైళ్లు పెద్దగా ఆగాల్సిన పనిలేకుండా నిరాటంకంగా రాకపోకలు సాగించవచ్చు.


Updated Date - 2021-07-12T16:10:34+05:30 IST