కార్మిక సంక్షేమమేదీ..!

ABN , First Publish Date - 2021-08-30T04:06:46+05:30 IST

నిర్మాణరంగ కార్మికుల సంక్షేమం.. నీరుగారిపోయింది. కష్టజీవులు చెల్లించిన నిధులు కూడా.. వారికి దక్కడం లేదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యామ్నాయంగా వైఎస్సార్‌ బీమా పథకాన్ని చూపి సంక్షేమ ఫలాలను పూర్తిగా నిలిపేసింది. జిల్లాలో సుమారు రూ.45 కోట్ల మేర కార్మిక సంక్షేమ నిధులు దారి మళ్లాయని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. నిర్మాణ రంగ కార్మికులకు ప్రభుత్వం రెండేళ్లుగా ఒక్క సంక్షేమ ప్రయోజనాన్ని కూడా అందజేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కార్మిక సంక్షేమమేదీ..!
పనులు చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు

- వైఎస్సార్‌ బీమా పేరుతో రిక్తహస్తం

- పథకాలకు దూరమవుతున్న నిర్మాణ కార్మికులు

- జిల్లావ్యాప్తంగా 2602 మందికి అందని సాయం

(ఇచ్ఛాపురం రూరల్‌)

నిర్మాణరంగ కార్మికుల సంక్షేమం.. నీరుగారిపోయింది. కష్టజీవులు  చెల్లించిన నిధులు కూడా.. వారికి దక్కడం లేదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యామ్నాయంగా వైఎస్సార్‌ బీమా పథకాన్ని చూపి సంక్షేమ ఫలాలను పూర్తిగా నిలిపేసింది. జిల్లాలో సుమారు రూ.45 కోట్ల మేర కార్మిక సంక్షేమ నిధులు దారి మళ్లాయని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. నిర్మాణ రంగ కార్మికులకు ప్రభుత్వం రెండేళ్లుగా ఒక్క సంక్షేమ ప్రయోజనాన్ని కూడా అందజేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  దీంతో కార్మికులు భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో తమ పేర ్లను నమోదు చేసుకునేందుకు వెనకాడుతున్నారు.  


రెండేళ్లుగా నిలిచిన పథకం : 

భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా 2019లో 4428 మంది కార్మికులకు రూ.7.34 కోట్లు వివిధ ప్రయోజనాలుగా అందాయి. కానీ రెండేళ్లుగా ఇవన్నీ నిలిచిపోయాయి. వైఎస్సార్‌ బీమా, వివిధ కార్పొరేషన్ల రుణాలు అమలు చేస్తున్నామనే నెపంతో ప్రభుత్వం కార్మిక సంక్షేమ పథకాన్ని నిలుపుదల చేసింది. ప్రమాద, మరణసాయం, అంత్యక్రియల ఖర్చులు, పెళ్లి కానుకలు, డెలివరీ సహాయం, స్కాలర్‌షిప్‌లు అన్ని నిలిపివేసింది. జిల్లావ్యాప్తంగా 2602 మంది కార్మికులు వివిధ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఒక్కరికీ కూడా ప్రయోజనం దక్కకపోవడం విశేషం. దీంతో 25 వేల మంది కార్మికులు భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకు దూరమయ్యారు. రెండేళ్లు కిందట బోర్డు పరిధిలో 1.19 లక్షల మంది కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకోగా, ఈ ఏడాది 94 వేల మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సంక్షేమంపై దృష్టి సారించాలని కార్మికులు కోరుతున్నారు. 

 

పథకం ప్రయోజనాలివీ.. : 

భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం 1996లో రూపొందించారు. రాష్ట్రంలో 2007 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం కార్మికశాఖ.. ఒక్కొక్క కార్మికుడి నుంచి సభ్యత్వ రుసుం కింద ఏటా రూ.110 వసూలు చేస్తుంది. దీనికి తోడు వివిధ భవనాలు, నిర్మాణాల కాంట్రాక్టర్లు, ఓనర్లు నుంచి 1 శాతం సెస్‌ వసూలు చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి కార్మికులకు వివిధ సంక్షేమ ప్రయోజనాలు  కింద అందజేసేది. కార్మికుల ఆడ పిల్లలకు పెళ్లయితే ఒక్కొక్కరికి రూ.20 వేలు, కార్మికుడి భార్య లేక కుమార్తె ప్రసవిస్తే రెండు కాన్పులకు రూ.20 వేలు చొప్పున అందించాలి. ప్రమాదంలో కార్మికుడు మరణించినా, తీవ్రంగా గాయపడి దివ్యాంగుడిగా మారినా రూ. 5 లక్షలు పరిహారం ఇవ్వాలి. ఆసుపత్రి ఖర్చులకు 3 నెలలు పాటు రూ.3 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేయాలి. కార్మికుడు సహజ మరణమైతే అంత్యక్రియలకు రూ.20 వేలు చెల్లించాలి. నమోదు కాని కార్మికుడు ప్రమాదంలో మరణించినా, తీవ్రంగా గాయపడినా రూ.50 వేలు పరిహారం అందించాలి. 9 నుంచి ఇంటర్‌ చదివే కార్మికుల పిల్లలకు ఏటా రూ.1200లు, ఆపై చదువులకు రూ.5 వేలు స్కాలర్‌షిప్‌ ఇవ్వాలి. కార్మికుల ట్రైనింగ్‌ నిమిత్తం 15 రోజులకు రూ.7 వేల చొప్పున ఉచిత సాయం అందించాలి.


రెండు, మూడు చోట్ల నమోదు :

కార్మికుల పేర్లు ఇటు భవన నిర్మాణ సంక్షేమ బోర్డులోనూ, కార్పొరేషన్లు, వైఎస్సార్‌ బీమాలోనూ ఉన్నాయి. అందువలన రెండు చోట్ల కార్మికులు క్లెయిముల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో క్లెయిముల పరిష్కారం సమస్యగా మారుతోంది. వీటిని పరిశీలిస్తున్నాం. కొవిడ్‌ కారణంగా పరిస్థితులు గాడిన పడలేదు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే పెండింగ్‌లో ఉన్న క్లెయిములకు నగదు అందజేస్తాం. 

- ఎస్‌డీవీ.ప్రసాదరావు, డీసీఎల్‌, శ్రీకాకుళం.

Updated Date - 2021-08-30T04:06:46+05:30 IST