రష్యా, ఫిలిప్పైన్స్ జర్నలిస్టులకు నోబెల్ శాంతి బహుమతి

ABN , First Publish Date - 2021-10-08T20:43:11+05:30 IST

నోబెల్ శాంతి పురస్కారం ఇద్దరు పాత్రికేయులకు లభించింది

రష్యా, ఫిలిప్పైన్స్ జర్నలిస్టులకు నోబెల్ శాంతి బహుమతి

ఓస్లో : నోబెల్ శాంతి పురస్కారం ఇద్దరు పాత్రికేయులకు లభించింది. ఫిలిప్పైన్స్‌కు చెందిన మారియా రెస్సా, రష్యాకు చెందిన దిమిత్రీ మురటోవ్‌ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. భావ ప్రకటన స్వేచ్ఛ కోసం పోరాడినందుకు వీరిని ఎంపిక చేసినట్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్‌పర్సన్ బెరిట్ రెయిస్స్-ఆండర్సన్ శుక్రవారం ప్రకటించారు. 


ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు క్రింద విజేతలకు ఓ బంగారు పతకం, సుమారు 1.14 మిలియన్ డాలర్లు లభిస్తాయి. స్వీడిష్ ఇన్వెంటర్ ఆల్ఫెడ్ నోబెల్ వీలునామా ఆధారంగా ఈ బహుమతులను ఏర్పాటు చేశారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారికి ఈ పురస్కారాలను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందజేస్తుంది. 


ఫిజియాలజీ లేదా మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని సోమవారం ప్రకటించారు. అమెరికాకు చెందిన డేవిడ్ జులియస్, ఆర్డెమ్ పటపౌషియన్ ఈ పురస్కార విజేతలుగా నిలిచారు. రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కార విజేతలను బుధవారం ప్రకటించారు. బెంజమిన్ లిస్ట్, డేవిడ్ మెక్‌మిలన్‌లకు ఈ అవార్డు లభించింది. అబ్దుల్‌రజాక్ గుర్నాహ్‌కు సాహిత్యంలో నోబెల్ బహుమతి గురువారం లభించింది. వచ్చే సోమవారం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటిస్తారు. 


Updated Date - 2021-10-08T20:43:11+05:30 IST