Abn logo
Apr 4 2021 @ 00:04AM

షూటింగ్స్‌తో సందడే సందడి

  • రూ.500 కోట్ల విలువైన సినిమాలకు బ్రేక్‌
  • షూటింగ్‌ సగంలో ఆగిన 50పై చిలుకు సినిమాలు
  • తెలుగు నేలపై 1700 థియేటర్ల బంద్‌
  • 50 వేల మంది ఉపాధిపై దెబ్బ.. నిర్మాతలపై పెరుగుతున్న వడ్డీ భారం


కరోనా కారణంగా గత ఏడాది తెలుగు చిత్రపరిశ్రమ దుస్థితి ఇది. యావత్‌ ప్రపంచంతో పాటు తెలుగు సినీ పరిశ్రమకూ ఆ తొమ్మిది నెలలు నిజంగా గడ్డు కాలమే! కొవిడ్‌-19 వైరస్‌ కారణంగా షూటింగులు మొదలు సినిమా విడుదల వరకూ అన్నీ ఆగిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చిత్రపరిశ్రమే పూర్తిగా స్తంభించిపోయింది.

పెద్దా చిన్నా అనే తేడా లేకుండా ఎవరి స్థాయిలో వారు కరోనా కారణంగా చాలా ఇబ్బందులు పడ్డారు. 

ఇలాంటి పరిస్థితిని గతంలో ఎన్నడూ కనీవినీ ఉండకపోవడంతో, పరిశ్రమకు పూర్వ వైభవం తిరిగి వస్తుందా రాదా అనే నైరాశ్యం చాలా మందిని ఆవరించింది. 

కరోనా కారణంగా కొంతమంది సినీ ప్రముఖులు కన్నుమూయడం కూడా చాలా మందిని కలవరపరిచింది. 

మార్చిలో మొదలైన కరోనా ప్రభావం తొమ్మిది నెలల పాటు తెలుగు చిత్రపరిశ్రమను వణికించింది. కంటికి కనుకు లేకుండా చేసింది. ఉపాధి కోల్పోయిన ఎంతోమంది సినీ కార్మికులు వీధిన పడ్డారు. 

అయితే గత ఏడాది డిసెంబర్‌ నాటికి పరిస్థితులు కొంత మెరుగయ్యాయి. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ తిరిగి షూటింగ్స్‌ మొదలయ్యాయి. థియేటర్లు కూడా తెరుచుకున్నాయి.

ఎవరూ ఊహించని విధంగా చాలా కొద్ది కాలంలోనే తెలుగు చిత్రపరిశ్రమ కోలుకొని పాత వైభవాన్ని పొందగలుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎటు పక్కకు వెళ్లినా షూటింగ్‌ సందడి కనిపిస్తోంది. ప్రస్తుతం 74 షూటింగ్స్‌ జరుగుతున్నాయని ఓ అంచనా. అందులో సినిమాలు, వెబ్‌ సిరీస్‌.. అన్నీ ఉన్నాయి. 30 సినిమాల షూటింగ్స్‌ జరుగుతున్నాయని చలనచిత్ర కార్మిక సమాఖ్య కార్యదర్శి పి.ఎ్‌స.ఎన్‌.దొర చెప్పారు. తమిళ, హిందీ, ఒరియా భాషల చిత్రాల షూటింగ్స్‌ కూడా హైదరాబాద్‌లో జరుగుతున్నాయనీ, అందుకే చాలా మందికి ఉపాధి దొరుకుతోందని దొర తెలిపారు. ఆంధ్రాలో కూడా కొన్ని సినిమా షూటింగ్స్‌ జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. 

 దాంతో ఎవరూ ఖాళీగా లేరు. చిన్న చిన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ప్రొడక్షన్‌ మేనేజర్లు.. అందరూ బిజీ. కెమెరాలు దొరకడం కూడా కష్టం అవుతోందంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. అదనపు ఖర్చు అయినా కరోనా బారిన పడకుండా నిర్మాతలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్‌ చేస్తున్నారు.


షూటింగ్స్‌ పెరగడానికి కారణాలు ఏమిటి?

కరోనా కష్టకాలంలో థియేటర్లు మూతపడడం, లాక్‌డౌన్‌ వల్ల ఇంటికే పరిమితమైన జనానికి ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) వేదికలు కొత్త ఊపిరినిచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కరోనా సమయంలోనే తెలుగు సినీ వినోద రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైందని చెప్పాలి. థియేటర్లు లేని సమయంలో తమ సినిమాలను ప్రేక్షకుల దగ్గరకు చేర్చడానికి అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, జీ 5, ఆహా వంటి ఓటీటీ వేదికలకు నిర్మాతలకు అండగా నిలిచాయి. ఇంట్లోనే కూర్చుని టీవీల్లో కొత్త సినిమాలు చూడడం ప్రేక్షకులకు కూడా కొత్తగా అనిపించింది.


అందుకే ఓటీటీ వేదికలు అతి తక్కువ కాలంలోనే చేరువ కాగలిగాయి. థియేటర్లు తిరిగి తెరుచుకొనే వరకూ ఆగలేని నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ లకు అమ్మి సొమ్ము చేసుకొన్నారు. ఓటీటీ కోసమే ప్రత్యేకంగా సినిమాలు తీయడం  మొదలైంది. థియేటర్లు తెరుచుకున్న తర్వాత కూడా చాలా మంది వాటి కోసం చూడకుండా ఓటీటీ కోసమే సినిమాలు తీస్తుండడం కూడా షూటింగ్స్‌ సంఖ్య పెరగడానికి ఓ కారణం. సినిమా థియేటర్‌కు ప్రత్యామ్నాయంగా మరో ఫ్లాట్‌ఫామ్‌ రావడం నిర్మాతలకు బాగా కలిసొచ్చిన అంశం. 


మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారా?

తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైర్‌సను చూసి సినిమా జనం కలవరపడుతోంది, కరోనా తీవ్రత పెరిగితే మళ్లీ లాక్‌డౌన్‌ పెట్టే పరిస్థితి వస్తుందేమోనని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న తెలుగు చిత్ర పరిశ్రమకు మళ్లీ కరోనా కష్టాలను భరించే శక్తి ఉండదని భయపడుతున్నారు.


పొరుగు రాష్ట్రం మహారాష్ట్రాలో నైట్‌ కర్ఫ్యూ విధించడంతో ఆ ప్రభావం అక్కడి చిత్రపరిశ్రమ మీద పడుతోంది. ఇప్పటికే ఆంధ్రాలోని కొన్ని మండల కేంద్రాల్లో లాక్‌డౌన్‌ విధించారు.  తెలంగాణలో కూడా మళ్లీ లాక్‌డౌన్‌ విఽధిస్తారనే వార్తలు ఆ మధ్య వినిపించినా, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస యాదవ్‌ వెంటనే వాటిని ఖండించారు. ఆ ఆలోచన ప్రభుత్వానికి లేదని వివరించారు. ఏప్రిల్‌, మే నెలల్లో చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్‌ తదితర అగ్రహీరోలు నటించిన చిత్రాలు విడుదలవుతుండడంతో సహజంగానే బయ్యర్లలో, థియేటర్‌ యజమానుల్లో భయాందోళనలు ఉండడం సహజం. అందుకే శ్రీనివాస యాదవ్‌ అలా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. 

 వినాయకరావు