చివరిరోజు భారీగా.. ఆదివారం దాఖలైనవి 377నామపత్రాలు

ABN , First Publish Date - 2021-04-19T05:39:35+05:30 IST

చివరిరోజు భారీగా.. ఆదివారం దాఖలైనవి 377నామపత్రాలు

చివరిరోజు భారీగా..  ఆదివారం దాఖలైనవి 377నామపత్రాలు
నామినేషన్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న ఖమ్మం కలెక్టర్‌ కర్ణన్‌

ముగిసిన కార్పొరేషన్‌ నామినేషన్ల ఘట్టం

మొత్తం 522 అందజేసిన 417మంది అభ్యర్థులు

నేడు పరిశీలన, 22న ఉపసంహరణ

పరోక్షంగా నామినేషన్‌ వేసిన టీఆర్‌ఎస్‌ మేయర్‌ అభ్యర్థిని ?

పొత్తులపై పార్టీల్లో వీడని సందిగ్ధం

ఖమ్మం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): కార్పొరేషన్‌ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజున భారీగా నామినేషన్లు దాఖలయ్యారు. ఆదివారం ఒక్కరోజే 377నామినేషన్లు దాఖలవగా.. గడువు ముగిసే సమయానికి మొత్తం 417 నామినేషన్లు వచ్చాయి. ఆయా అభ్యర్థుల నుంచి మొత్తం 522 నామినేషన్లు రాగా.. అందులో టీఆర్‌ఎస్‌ నుంచి అత్యధికంగా 163, బీజేపీ నుంచి 84, కాంగ్రెస్‌ నుంచి 125, సీపీఎం నుంచి 35, సీపీఐ నుంచి 7, టీడీపీ నుంచి 16, ఇతర పార్టీల నుంచి 16, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 76 నామినేషన్లు దాఖలయ్యాయి. 

సోమవారం నామినేషన్ల పరిశీలన జరగనుండగా.. మంగళవారం తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీలు, బుధవారం అప్పీళ్ల పరిశీలన, 22న గురువారం మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, ఆతర్వాత అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు.  

నేరుగా వెళ్లకుండానే నామినేషన్‌..?

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీచేస్తారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఖమ్మం కార్పొరేషన్‌ మేయర్‌ పీఠం జనరల్‌ మహిళకు కేటాయించిన నేపథ్యంలో ఆమె 20వ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ తరపున పోటీచేస్తారని, ఆమే మేయర్‌ అవుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆమె నేరుగా వెళ్లకుండానే తన నామినేషన్‌ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. శనివారమే ఆమె నామినేషన్‌ దాఖలు చేశారని, 21వ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన ప్రశాంతలక్ష్మి.. ఆదివారం పువ్వాడ వసంతలక్ష్మి నామినేషన్‌ వేశారని భావిస్తున్న 20వ డివిజన్‌లోనూ నామినేషన్‌ వేయడం చర్చనీయాంశంగా మారింది. 21వ డివిజన్‌లో ప్రశాంతలక్ష్మికి డమ్మీ అభ్యర్థిగా ఎవరూ నామినేషన్‌ దాఖలు చేయలేదు. అయితే ప్రశాంతలక్ష్మి 20డివిజన్‌ నుంచి డమ్మీ అభ్యర్థిగా మాత్రమే నామినేషన్‌ వేయించారన్న ప్రచారం జరుగుతోంది.

పొత్తులపై రాని స్పష్టత

సీపీఐ, టీఆర్‌ఎస్‌ మధ్య పొత్తు విషయంలో ఇంకా సందిగ్ధం వీడలేదు. ఆ పార్టీల మధ్య పొత్తులో భాగంగా సీపీఐకి మూడు డివిజన్లు కేటాయించారని ప్రచారం జరిగింది. అయితే ఆదివారం ఐదు డివిజన్ల నుంచి సీపీఐ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాగా వారు నామినేషన్లు వేసిన చోట టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కూడా నామినేషన్‌ దాఖలు చేయడంతో అసలు సీపీఐకి ఐదు సీట్లు కేటాయిస్తారా? లేదంటే నాలుగు మాత్రమే కేటాయిస్తారా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. నామినేషన్ల చివరిరోజు సీపీఐ 15, 19, 43, 50, 60 డివిజన్లలో నామినేషన్లు దాఖలు చేసింది. బీజేపీ, జనసేన జట్టుకట్టి పోటీచేయాలని నిర్ణయించుకోగా.. అందులో భాగంగా జనసేనకు 10డివిజన్లు కేటాయించారు. అయితే జనసేన అభ్యర్థులు 2, 8, 13,14, 16, 23, 28, 36, 47, 48, 51, 60 మొత్తం12 డివిజన్లలో నామినేషన్లు వేశారు. వాటిలో మరో రెండు డివిజన్లపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే బీజేపీ మాత్రం 52 డివిజన్ల నుంచి నామినేషన్లు దాఖలు చేసింది. ఇక సీపీఎం మొత్తం 30, కాంగ్రెస్‌ 60, టీడీపీ 16డివిజన్ల నుంచి నామినేషన్లు వేశాయి. 


Updated Date - 2021-04-19T05:39:35+05:30 IST