‘నామినీ’ మోసం..!

ABN , First Publish Date - 2021-01-18T09:31:08+05:30 IST

‘‘మీ బ్యాంక్‌ ఖాతాలో నామినీ పేరు మారింది. ఖాతాలోని నగదును నామినీకి 30 నిమిషాల్లో బదిలీ చేస్తాం. ఒకవేళ నామినీ పేరును మీరు మార్చకుంటే.. ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి. వివరాలన్నింటిని

‘నామినీ’ మోసం..!

బ్యాంక్‌ ఖాతాలో పేరు మారిందంటూ సందేశాలు

రాష్ట్రంలో పదుల సంఖ్యలో బాధితులు


హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ‘‘మీ బ్యాంక్‌ ఖాతాలో నామినీ పేరు మారింది. ఖాతాలోని నగదును నామినీకి 30 నిమిషాల్లో బదిలీ చేస్తాం. ఒకవేళ నామినీ పేరును మీరు మార్చకుంటే.. ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి. వివరాలన్నింటిని నమోదుచేయండి’’ అంటూ సైబర్‌నేరగాళ్లు మొబైల్‌ ఫోన్‌కు సందేశాలు పంపుతూ కొత్త తరహా మోసాలకు తెరతీశారు. హ్యాకర్లు అడుగుతున్న వివరాల్లో.. బ్యాంక్‌ ఖాతా నంబర్‌, డెబిట్‌ కార్డు, సీవీవీ, ఎక్స్‌పైరీ నంబర్‌, ఏటీఎం పిన్‌నంబర్‌ ఉంటున్నాయి. ఎవరైనా తమ నగదు నిజంగానే ఇతరులకు బదిలీ అవుతుందేమోననే భయంతో లింక్‌పై క్లిక్‌పై చేసి.. వివరాలన్నీ నమోదు చేస్తే.. వారి ఖాతాను లూటీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు అధికసంఖ్యలో జరుగుతున్నాయి. మూడు రోజుల్లోనే పదుల సంఖ్యలో బాధితులు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లింక్‌లో పేర్కొన్న వివరాలను నమోదు చేసిన కొద్ది నిమిషాల్లోనే.. తమ బ్యాంక్‌ ఖాతా నుంచి నగదు బదిలీ అయిపోయిందంటూ వాపోతున్నారు. ‘‘ఖాతాదారుడి ప్రమేయం లేకుండా నామినీ పేరు మార్చడం సాధ్యంకాదు. సైబర్‌ మోసగాళ్లు పంపే సందేశాలను నమ్మొద్దు. లింక్‌లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్‌ చేయొద్దు. వ్యక్తిగత, బ్యాంక్‌ ఖాతా వివరాలను సమర్పించొద్దు. కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 10 కేసులు నమోదుచేశాం’’ అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

Updated Date - 2021-01-18T09:31:08+05:30 IST