Abn logo
Oct 22 2021 @ 00:00AM

సౌభాగ్యాన్నిచ్చే నోము

తెలుగు ప్రాంతాల్లో మహిళలకే ప్రత్యేకమైన వేడుకల్లో అట్లతదియ ఒకటి. ఆశ్వయుజ బహుళ తదియ రోజున వివాహితలు సౌభాగ్యాన్నీ, అవివాహితలు చక్కనైన వైవాహిక జీవితాన్నీ ఆశిస్తూ దీన్ని ఆచరిస్తారు. ‘అట్ల తద్ది నోము’ లేదా ‘చంద్రోదయ ఉమా వ్రతం’గానూ ఇది ప్రసిద్ధం. చంద్రోదయం అయ్యాక... ఉమా (గౌరీ) దేవిని పూజిస్తారు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పండుగకు మరో ప్రత్యేకత కూడా ఉంది. 


తెలుగునాట జరుపుకొనే కొన్ని పండుగలకు ముందు రోజును ‘భోగి’ అంటారు. ఈ భోగి సంక్రాంతి, ఉండ్రాళ్ళ తద్ది, అట్ల తదియలకే ప్రత్యేకం. మరే పండుగకూ భోగి ఉండదు. అట్ల తద్ది ముందు రోజు మహిళలు, యువతులు తెల్లవారుజామునే తలంటు పోసుకుంటారు. అరచేతులకు, పాదాలకు గోరింట పెట్టుకుంటారు. అది ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడన్న నమ్మకం ఉంది. గోరింటాకును సంస్కృతంలో ‘నఖరంజని’ అంటారు. శరీర ఆరోగ్యానికి గోళ్ళ ఆరోగ్యం కూడా ప్రధానం. మహిళలు ఎక్కువగా నీళ్ళతో పని చేస్తూ ఉంటారు. వారి కాళ్ళకూ, చేతులకూ క్రిములు సోకే అవకాశం ఎక్కువ.  గోరింటాకు పెట్టుకోవడం ద్వారా ఈ పరిస్థితిని నివారించవచ్చని చెబుతోంది ఆయుర్వేదం. ఇక అట్ల తదియ రోజున కూడా తలంటు స్నానం చేసి, సూర్యోదయం కాకముందే ఆహారం తీసుకుంటారు. అన్నం, పొడులు, గోంగూర పచ్చడి, గడ్డ పెరుగు లాంటివి వీటిలో ప్రధానంగా ఉంటాయి.


ఈ భోజనం తరువాత... చంద్రోదయం వరకూ ఉపవాసం ఆచరిస్తారు. ఉయ్యాలలు ఊగుతూ, ఆటపాటలతో రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. రాత్రి గౌరీ దేవికి షోడశోపచారాలు చేసి, వరిపిండి, మినప పిండి కలిపిన అట్లను దేవికి నివేదన చేస్తారు. అనంతరం వ్రతకథ చెప్పుకొని,  ముత్తయిదువులకు వాయనాలు ఇచ్చి, వారి ఆశీస్సులు పొందుతారు. అట్లను ప్రసాదంగా స్వీకరిస్తారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ... మినుములు రాహువుకు, బియ్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యాలు. వాటితో చేసిన అట్లను వాయనంగా ఇవ్వడం వల్ల ఆ గ్రహ దోషాలతో పాటు... కుజదోష నివారణ కూడా అవుతుందన్నది శాస్త్రవచనం. ఇలా ఆరోగ్యానికీ, గ్రహదోష నివారణకూ దోహదపడడమే కాకుండా సకల సౌభాగ్యాలనూ ప్రసాదించే నోముగా ఇది ప్రసిద్ధి చెందింది. 

 ఎ.సీతారామారావు


 రేపు అట్ల తదియ

వ్రత కథ ప్రకారం... ఒక మహారాజు కుమార్తె ప్రతి సంవత్సరం స్నేహితురాళ్ళతో కలిసి అట్ల తద్ది నోము నోచేది. అయినా ఆమెకు సరైన వరుడు లభించలేదు. కారణం తెలియక, ఆమె ఉమా దేవిని ప్రార్థించింది. ఉమాదేవి ఆ రాకుమారి కలలో కనిపించి... ‘‘ఒకసారి నువ్వు అట్ల తద్ది రోజున ఉపవాసం చేస్తున్నప్పుడు... ఆకలికి తట్టుకోలేక నువ్వు పడుతున్న బాధను నీ సోదరులు చూడలేకపోయారు. తాటాకు మంటల మాటున ఆకాశాన్ని చూపించి, చంద్రోదయం అయిందని నీకు చెప్పారు. దీంతో చంద్రోదయానికి ముందే నువ్వు ఉపవాస దీక్ష విరమించావు. ఆ కారణంగానే నీకు ఈ పరిస్థితి వచ్చింది’’ అని చెప్పింది. జరిగిన పొరపాటును తెలుసుకున్న ఆ రాకుమారి మరుసటి ఏడాది నోమును మరింత నియమ నిష్టలతో ఆచరించి, తనకు తగిన రాకుమారుణ్ణి భర్తగా పొందింది. ఈ కథను అట్ల తదియ నోము నోచేవారు చెప్పుకొంటారు. నారదుడి సూచన మేరకు చంద్రోదయ ఉమా వ్రతాన్ని పార్వతీదేవి ఆచరించి, శివుణ్ణి భర్తగా పొందిందనే పురాణ కథ ఉంది. ఉత్తర భారతదేశంలో ‘కర్వా చౌత్‌’ అనే పేరుతో... అట్ల తదియ మరునాడు ఈ వ్రతం చేసుకుంటారు.