భాషానిష్ఠ లేని తెలుగు ఛానళ్లు

ABN , First Publish Date - 2021-09-12T05:43:51+05:30 IST

తెలుగు టీవీ ఛానళ్లు 60కి పైగా ఉన్నాయి. వీటిలో సగానికిపైగా వార్తలను ప్రసారం చేస్తున్నాయి. కొన్ని ఛానళ్ళు తెలుగు వార్తలను తెలుగులోనే ప్రసారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే నూటికి తొంభైఐదుకి పైగా తెలుగుమాటలతోనే వార్తలు వినిపిస్తున్నాయి....

భాషానిష్ఠ లేని తెలుగు ఛానళ్లు

తెలుగు టీవీ ఛానళ్లు 60కి పైగా ఉన్నాయి. వీటిలో సగానికిపైగా వార్తలను ప్రసారం చేస్తున్నాయి. కొన్ని ఛానళ్ళు తెలుగు వార్తలను తెలుగులోనే ప్రసారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే నూటికి తొంభైఐదుకి పైగా తెలుగుమాటలతోనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రజలు పూర్తిగా అలవాటుపడిన కమిటీ, బోర్డు వంటి ఇంగ్లీషు పదాలను వార్తల్లో రెండు మూడు దశాబ్దాలకు పైబడి వినియోగిస్తున్నా అందరికీ అర్థమైన ఇంగ్లీషు పదాలవి. బస్సు, రైలు, కరెంటు, బల్బు, రేడియో, టీవి, సైకిల్ వంటివి దేశీకరణం చెందిన ఇంగ్లీషు పదాలు. దేశీకరణం చెందినవి అంటే అర్ధశతాబ్దం పైగా తెలుగులో వాడుకలో ఉండి పూర్తిగా తెలుగుగా మారిన పదాలని అర్థం. ఇలాంటివి ఏ అన్యదేశ్యభాషా పదాలు అయినా ఫర్వాలేదు. తెలుగు వార్తల్లో ఈ రెండు రకాలకు చెందిన పదాలు ఐదుశాతం వాడి మిగతా 95 శాతం తెలుగు వాడాలనే పట్టుదలతో వార్తలను ప్రసారం చేసే ఛానళ్లు ఉన్నాయి. కొత్తగా వస్తున్న ఇంగ్లీషు పదాలను, కొంత శ్రద్ధపెట్టి తెలుగులోనికి అనువదించి వార్తలలో వాడదాం అనే ధోరణిలో పనిచేస్తున్న ఛానళ్లు ఉన్నాయి. అలాకాక తెలుగులోకి అనువాదం చేయకపోయినా ఫర్వాలేదు వాటిని పూర్తిగా అలాగే వాడేద్దాం అని ఏమాత్రం శ్రద్ధ పెట్టకుండా లేదా అనువాదం చేయాలనే ఆలోచన లేకుండా వార్తలను ప్రసారం చేసే ఛానళ్లూ ఉన్నాయి. ఇక ఇంతకన్నా ఘోరంగా పనిచేస్తున్న తెలుగు వార్తాఛానళ్లు కూడ కనిపిస్తున్నాయి. వార్తలు చదివే యాంకర్లు– మహిళలు, పురుషులు అనే భేదం లేకుండా– అధికంగా నటించడం, చేతులు తిప్పుకుంటూ తాము ఆ వార్తని ఏదో అనుభవిస్తున్నట్లుగా చెప్పడం రివాజుగా మారింది. జరిగిన ఘోరాన్ని కానీ విషాదాన్ని కానీ ఒకింత స్వరం తగ్గించి చెబితే సరిపోతుంది. ఏ భావం లేకుండా పొడిగాను చెప్పవచ్చు. లేదా కొంచెం బాధ గొంతులో తెలిసీ తెలియనట్లుగాను చెప్పవచ్చు. తాము వార్తను అందిస్తున్నామే కానీ ఆ విషయం గురించి తమకు ఏ విధమైన భావం లేదనే ధోరణిలోనూ చెప్పవచ్చు. అలా కాకుండా వార్తలు వినే ప్రజల్లో రక్తపోటు పెరిగే స్థాయిలో దారుణం జరిగింది, ఘోరం జరిగిందని నటిస్తూ, వీక్షకులకు మరింత బాధను, ఆందోళనను బట్వాడా చేసే రీతిలో చెప్పడం కొన్ని ఛానళ్లకు నిత్యధోరణిగా మారింది. ఇదంతా ఎందుకు? వార్తని వార్తలాగా అందించలేరా? వార్తల్ని అలా చెబితేనే తమ ఛానల్‌కు వీక్షకులు పెరుగుతారని, లేకుంటే పెరగరనే భ్రమ ఆ ఛానళ్ల యాజమాన్యాలకు ఏమైనా ఉందా? 


ఇక భాష విషయానికి వస్తే పైన చెప్పిన దాన్ని కొంత పొడిగించి చెప్పాలి. తెలుగు వార్తలలో ‘వెల్‌కమ్ టు న్యూస్’ అని మొదలుపెట్టి వాక్యాలలో విచ్చలవిడిగా ఇంగ్లీషు పదాలు వినియోగిస్తూ, మధ్యలో ‘ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం’ అని ఒక ముక్తాయింపు ఇచ్చి, తర్వాత ‘వెల్‌కమ్ బ్యాక్’ అని పిలిచి తర్వాతి కార్యక్రమం కోసం ‘స్టేట్యూన్డ్‌’ అని ముగింపు పలుకుతున్నారు ఈ యాంకరీమణులు. వార్తల్ని ఎలా చదవమని రాసిస్తే అలా చదువుతున్నారా లేక ఈ యాంకర్లు తమ ఇంగ్లీషు పాండిత్యాన్ని ప్రజల మీదికి వదులుతున్నారా అనేది కూడా అర్థం కావడం లేదు. వాళ్లు తెలుగువారి కోసం తెలుగులో వార్తలు చెబుతున్నారు. ఈ ఇంగ్లీషు పాండిత్యం ఎందుకు, ‘చిన్న విరామం’ అని అనలేరా, ‘తిరిగి వార్తల లోనికి’ అని చెప్పలేరా? ‘చూస్తూనే ఉండండి’ అని చెప్పడానికి బదులు స్టేట్యూన్డ్ అని అనడం ఎందుకు? ఎందుకీ ఇంగ్లీషు వెర్రి? వారు తెలుగువారికి ఏం చెప్పదలచుకున్నారు? తెలుగుని ఇలా ఇంగ్లీషు పదాలమయం చేసి మాట్లాడడం నేటి ఫ్యాషన్ అని చెప్పదలచుకున్నారా? తెలుగు వార్తలలో తెలుగు భాషలో ఈ పనికిమాలిన పోకడలు ఈ సంకరభాష ఎందుకు? తెలుగును పూర్తిగా భ్రష్టు పట్టించడానికి కంకణం కట్టుకున్నాయా ఈ ఛానళ్లు? 


మరొక విషయం. వార్తలు రాసేవారికి ఏదో ప్రౌఢమైన భాష వాడాలని లేదా తెలుగు పాండిత్యాన్ని ప్రదర్శించాలని మోజు ఉండి కొన్ని పదాలకు అర్థం తెలియకపోయినా గంభీరంగా, బరువుగా ఉన్నాయని వాడేయటం ఈ మధ్య అలవాటైంది. ఒక విషయానికి ఉన్న పర్యాయపదాలన్నిటినీ మోజుపడి వాడుతున్నారు. గులాబీదళపతి, కమలనాథులు లాంటి కొత్తపదాల సృష్టి మీడియావారు చేసినవే. ఫర్వాలేదు రాసేవారికి తెలివిడి ఉంది అని భావించడానికి ఇవి ఉపయోగపడతాయి. కానీ కొత్తపదాల మోజులోపడి అర్థాలు తెలియని వాటిని ప్రయోగించి నెత్తిమీద కొరివితో గోక్కున్నట్లు గోక్కుంటున్నారు. ఒకసారి భద్రాచలంలో శ్రీరామనవమికి సంబంధించిన వార్తలు చెబుతూ ‘భార్గవరాముడి కళ్యాణానికి భారీగా తరలివచ్చిన జనం’ అని చెప్పిందో యాంకరీమణి. భారీగా అనే పదానికి ప్రాస కోసం భార్గవరాముడిని తెచ్చారు! భార్గవరాముడు అంటే రాముడు కాదని, పరశురాముడని తెలియదు. ఇలా తెలియని వాటిని వాడడం ఎందుకు? 


దాదాపు పది సంవత్సరాల క్రితం పరిశోధనరీత్యా పల్లెలకు పోయినప్పుడు అక్కడ కేవలం నాలుగైదు శాతమే ఇంగ్లీషు పదాలు వినిపించేవి. అవీ దేశీకరణం చెందిన పదాలే అయిఉండేవి. ఇటీవలి కాలంలో కూడా తెలుగు జిల్లాలలోని 112 గ్రామాలలో క్షేత్రపరిశోధన చేశాను. ఇప్పుడు ఇంగ్లీషు పదాల వినియోగం విపరీతంగా పెరిగింది. చదువు రానివారు, 70, 80 సంవత్సరాల వయస్సు ఉన్నవారి మాటల్లో కూడా తెలుగులో ఇంగ్లీషు పదాల వినియోగం బాగా పెరిగింది. అలాంటివి కనీసం 20 శాతం పదాలు ఉంటున్నాయి. దీనికి కారణం ఇంగ్లీషు పదాలను పల్లెలకు బట్వాడా చేసే శక్తులు. ఇలా ప్రజల లోనికి భాషను చొప్పించే రెండు ప్రధానమైన మార్గాలు లేదా ప్రధానమైన వనరులు ఉన్నాయి. ఒకటి-– టీవీ ఛానళ్లు; రెండు–- వార్తాపత్రికలు. రేడియో పాత్ర బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు పల్లెలో ఒక పెద్ద ఇంట్లో టీవీ ఉంటే, ఇంటి ముందు పందిట్లో దాన్ని పెడితే పది ఇండ్లవారు వచ్చి చూచేవారు. కానీ నేడు టీవీ లేని ఇల్లు ఉండదు. తింటానికి తిండి, ఉండడానికి ఇల్లు లాగా చూడడానికి టీవీ వచ్చి చేరింది. టీవీ భాష ప్రభావం ప్రజలమీద చాలా ఉంది. ఈ కారణంగా టీవీ ఛానళ్ళకు భాష పట్ల చాలా బాధ్యత ఉంది. పైన చెప్పిన రీతిలో అర్ధ ఇంగ్లీషు భాషని ప్రజల మీదికి వదిలితే తల్లిభాష ప్రమాదంలో పడుతుంది. తెలుగువార్తలను తెలుగులాగా చెప్పే బాధ్యత టీవీ ఛానళ్ల పైన ఉంది. అవి కేవలం వార్తల్నే కాకుండా ఇంకా చాలా విషయాలను, చాలా ప్రదర్శనలను ప్రజలకు అందిస్తున్నాయి. వాటి ప్రభావం ప్రజలమీద చాలా ఎక్కువగానే ఉంది. సినిమా ప్రక్రియ టీవీ ద్వారా ఇంటిప్రక్రియ అయింది. అందువల్ల సినిమా కూడా ఈ బాధ్యతను తీసుకోవాలి. 


బీబీసీ యాంకర్లు వార్తలను ఎలా, ఎంత సాదాసీదాగా అందిస్తున్నారో మన యాంకర్లు చూచి నేర్చుకోవాలి. ఆ ఛానెల్‌లో సులభమైన ఇంగ్లీషు ఉంటుంది. ఓవర్ యాక్షన్ చేయడం కానీ నాటకీయంగా వార్తలను చదవడం కానీ ఉండదు. అమిత అందంగా కనిపించాలనే ప్రయత్నం ఉండదు. వారు దైనందిన దుస్తులలో ఉంటారు. వార్తను పొడిపొడిగా సాదాగా అందిస్తారు. తెలుగు వార్తాఛానళ్లలో కొన్ని బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాయి. కొన్ని ఛానళ్లు పైన చెప్పిన రీతిలో అర్ధఇంగ్లీషు సంకరభాషను వినియోగించి తెలుగుభాష పట్ల బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నాయి. అవి తమ ధోరణి మార్చుకోవాలి. అలాకాకుండా అదే ధోరణిని ఆ ఛానళ్లు కొనసాగిస్తే త్వరలో భాషోద్యమసంఘాల వారు వాటి కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు చేయవలసి ఉంటుంది.

ప్రొ. పులికొండ సుబ్బాచారి

Updated Date - 2021-09-12T05:43:51+05:30 IST