హైదరాబాద్ టు చికాగో.. డైరెక్ట్ విమానం

ABN , First Publish Date - 2021-01-15T14:20:17+05:30 IST

ఇకపై హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లాలంటే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే శంషాబాద్ విమానాశ్రయం నుంచి యూఎస్‌కు నేరుగా విమానం సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. జాతీయ విమాన సంస్థ ఎయిరిండియా అమెరికాకు నేరుగా విమాన సర్వీసులు తీసుకొచ్చింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్777-200ఎల్‌ఆర్ విమానంలో మధ్యలో హాల్ట్ స్టాప్ లేకుండా నేరుగా చికాగోకు వెళ్లొచ్చు.

హైదరాబాద్ టు చికాగో.. డైరెక్ట్ విమానం

హైదరాబాద్: ఇకపై హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లాలంటే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే శంషాబాద్ విమానాశ్రయం నుంచి యూఎస్‌కు నేరుగా విమానం సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. జాతీయ విమాన సంస్థ ఎయిరిండియా అమెరికాకు నేరుగా విమాన సర్వీసులు తీసుకొచ్చింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్777-200ఎల్‌ఆర్ విమానంలో మధ్యలో హాల్ట్ స్టాప్ లేకుండా నేరుగా చికాగోకు వెళ్లొచ్చు. ఈ మేరకు గురువారం ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఈ రెండు నగరాల మధ్య డైరెక్ట్ విమానం కోసం చాలా కాలంగా డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిపెట్టుకుని తాజాగా ఈ సర్వీసును అందుబాటులోకి తెచ్చినట్టు ఎయిరిండియా అధికారులు పేర్కొన్నారు. 


ప్రతి బుధవారం చికాగో నుంచి రాత్రి 9.30 గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం) ఏఐ-108 విమానం హైదరాబాద్‌కు బయల్దేరుతుంది. శుక్రవారం తెల్లవారుజామున 00.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. అలాగే రిటర్న్ ఫ్లైట్ ఏఐ-107 హైదరాబాద్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు చికాగో బయల్దేరుతుంది. వారానికి ఒకసారి మాత్రమే ఈ సర్వీసు ఉంటుంది. హైదరాబాద్ నుంచి చికాగో చేరుకునేందుకు 16 గంటల 45 నిమిషాలు పడితే.. చికాగో నుంచి హైదరాబాద్‌కు రావడానికి మొత్తం జర్నీ సమయం 15 గంటల 40 నిమిషాలు. ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.airindia.in లేదా టోల్ ఫ్రీ నెం. 1860 233 1407 కాల్ చేయొచ్చు.


కాగా, బోయింగ్777-200ఎల్‌ఆర్ విమానంలో మొత్తం 238 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. వీటిలో 8 ఫస్ట్ క్లాస్, 35 బిజినెస్ క్లాస్, 195 ఎకనామీ క్లాస్ సీట్లు ఉండగా.. 4 కాక్‌పిట్, 12 క్యాబిన్ క్రూ సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇక ఈ సర్వీసులో భాగంగా బుధవారం(జనవరి 13) నాడు తొలి విమాన సర్వీసు చికాగో నుంచి బయల్దేరిందని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఇప్పటికే ఎయిరిండియా ఢిల్లీ నుంచి న్యూయార్క్, నెవార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో నగరాలకు.. ముంబై నుంచి నెవార్క్, న్యూయార్క్‌కు.. బెంగళూరు నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు నాన్‌స్టాప్ విమాన సర్వీసులు నడిపిస్తున్న విషయం తెలిసిందే.

Updated Date - 2021-01-15T14:20:17+05:30 IST