నగరపాలెంలో పనిచేయని వ్యవసాయ మోటార్లు

ABN , First Publish Date - 2021-06-18T05:40:38+05:30 IST

మండలంలోని నగరపాలెంలో రైతులకు చెందిన వ్యవసాయ విద్యుత్‌ మోటార్లు గత నెలరోజులుగా బంద్‌ అయిపోయాయి.

నగరపాలెంలో పనిచేయని వ్యవసాయ మోటార్లు
పంట పొలాలను తడిపేందుకు బిందెతో నీరు తీసుకువెళుతున్న రైతు

కాలిపోయిన విద్యుత్‌ వైరు

కొత్తది వేసేందుకు రూ.4 లక్షలు అవుతుందని పట్టించుకోని అధికారులు

వైరు వేసి కనెక్షన్లు ఇవ్వాలని కోరుతున్న రైతులు

భీమునిపట్నం, (రూరల్‌) జూన్‌ 17: మండలంలోని నగరపాలెంలో రైతులకు చెందిన వ్యవసాయ విద్యుత్‌ మోటార్లు గత నెలరోజులుగా బంద్‌ అయిపోయాయి. దీంతో రైతులు తమ పంట పొలాలకు నీరు అందించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఈ గ్రామంలో రెండు నెలల కిందట ఇందుకు సంబంధించిన విద్యుత్‌ వైర్లు కాలిపోవడంతో సంబంధిత అధికారులు ఇతర ప్రాంతాల నుంచి కనెక్షన్‌ అందించి వ్యవసాయ విద్యుత్‌ మోటార్లకు విద్యుత్‌ను అందించారు. ప్రస్తుతం ఆ వైరు కూడా కాలిపోవడంతో మోటార్లకు విద్యుత్‌ అందడం లేదు. కొత్త వైరు ఏర్పాటు చేయాలంటే సుమారు నాలుగు లక్షల రూపాయల వ్యయం అవుతుంది. అందువల్ల అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోకుండా వదిలివేశారు. దీంతో ఈ గ్రామంలో వ్యవసాయానికి ఉపయోగపడే విద్యుత్‌ మోటార్లన్నీ మూలకు చేరినట్టయ్యాయి. రైతులు కూరగాయలు, ఇతర వ్యవసాయ పంటలు పండించుకునేందుకు సాగునీరు అందక నానాపాట్లు పడుతున్నారు. కొంతమంది బావుల నుంచి బిందెలతో నీరు తీసుకువచ్చి పంట పొలాలను తడుపుతున్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నగరపాలెం గ్రామంలో అమలు కాకుండా పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు రైతులు సంబంధిత అధికారులకు వినతిపత్రాన్ని అందించారు.


Updated Date - 2021-06-18T05:40:38+05:30 IST