ఎన్టీఆర్‌ వైద్యాలయంలో పనిచేయని ఫ్రీజర్లు

ABN , First Publish Date - 2021-06-18T05:37:25+05:30 IST

ఎన్టీఆర్‌ వైద్యాలయంలోని మార్చురీ గదిలో ఫ్రీజర్లు నిరుపయోగంగా ఉన్నాయి.

ఎన్టీఆర్‌ వైద్యాలయంలో పనిచేయని ఫ్రీజర్లు
మార్చురీ గదిలో నిరుపయోగంగా ఉన్న ఫ్రీజర్లు

ఆరుబయటే మృతదేహాలు
రోగులు, గర్భిణులు, బాలింతల అగచాట్లు
పట్టించుకోని అధికారులు

అనకాపల్లి టౌన్‌, జూన్‌ 17:
ఎన్టీఆర్‌ వైద్యాలయంలోని మార్చురీ గదిలో ఫ్రీజర్లు నిరుపయోగంగా ఉన్నాయి. కొంత కాలంగా పనిచేయకపోవడంతో ప్రమాదాలు జరిగినప్పుడు గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలను ఫీజర్‌లో పెట్టేందుకు అవకాశం లేక ఆరుబయటే ఉంచాల్సి వస్తోంది. దీంతో ఆసుపత్రిలోని రోగులు, గర్భిణులు, బాలింతలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్రామీణ జిల్లాకు ప్రధాన కేంద్రమైన అనకాపల్లిలో జిల్లా ఆస్పత్రిగా ఉన్న ఎన్టీఆర్‌ వైద్యాలయం మార్చురీకి అనకాపల్లి నుంచే కాకుండా మునగపాక, కశింకోట, అచ్యుతాపురం, పరవాడ, సబ్బవరం పోలీస్‌ స్టేషన్ల పరిధిలో  జరిగిన సంఘటనల్లో మరణించిన వారి మృతదేహాలను తీసుకొస్తుంటారు. గుర్తు తెలియని మృతదేహాలను కనీసం మూడు రోజుల పాటు ఫీజర్‌లో ఉంచి, తరువాత వారి కోసం ఎవరూ రాకపోతే పోలీసులు అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. ఇంతటి  ప్రాధాన్యత ఉన్న వైద్యాలయంలో ఫ్రీజర్లు మూలకు చేరాయి. దీంతో మృతదేహాలను ఆరుబయట ఉంచుతున్నారు. ఫలితంగా మార్చురీ గదికి దగ్గరలోనే ఉన్న గైనిక్‌ విభాగంలోని గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. మృతదేహాలు ఉన్నప్పుడు వచ్చే దుర్వాసనతో వారు నరకం చూస్తున్నారు. చాలా కాలంగా ఫ్రీజర్లు పనిచేయకపోయినా వైద్యాధికారులు స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ పది రోజుల క్రితం వైద్యాలయంలో జరిగిన సమీక్షలో తక్షణమే ఫ్రీజర్లకు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించినా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈ విషయమై వైద్యాలయం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ను వివరణ కోరగా, కొవిడ్‌ కారణంగా మరమ్మతులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలిపారు. ఒక మెకానిక్‌ను రప్పించామని, త్వరగా మరమ్మతులు చేయించి ఫ్రీజర్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు.

Updated Date - 2021-06-18T05:37:25+05:30 IST