తిరుమల నగల విభాగంలో హిందూయేతర కాంట్రాక్టరు!

ABN , First Publish Date - 2022-04-26T09:40:54+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన నగల విభాగంలో హిందూయేతర కాంట్రాక్టరు ఉన్నారని, వారికి టీటీడీ అధికారులే రిజిస్టర్డ్‌ కాంట్రాక్టరుగా సర్టిఫికెట్‌ జారీ చేశారని రిజిస్టర్డ్‌ కాంట్రాక్టర్‌ ఆర్‌. వేణుగోపాల్‌ ఈవోకు ఫిర్యాదు చేశారు.

తిరుమల నగల విభాగంలో  హిందూయేతర కాంట్రాక్టరు!

స్వీయ నోటరీ ఆధారంగాసర్టిఫికెట్‌ ఇచ్చేసిన అధికారులు

ఆలయంలోకి వెళ్లి వస్తువుల శుద్ధికి అవకాశం

ఈవోకు ఫిర్యాదు చేసిన మరో కాంట్రాక్టర్‌


తిరుపతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన నగల విభాగంలో హిందూయేతర కాంట్రాక్టరు ఉన్నారని, వారికి టీటీడీ అధికారులే రిజిస్టర్డ్‌ కాంట్రాక్టరుగా సర్టిఫికెట్‌ జారీ చేశారని రిజిస్టర్డ్‌ కాంట్రాక్టర్‌ ఆర్‌. వేణుగోపాల్‌ ఈవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదులో ఏం పేర్కొన్నారంటే.. ‘‘రిజిష్టర్డ్‌ కాంట్రాక్టరుగా నమోదైన వారికి శ్రీవారి ఆలయంతో సహా దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలన్నింటిలో ప్రవేశానికి, శ్రీవారికి వినియోగించే పంచలోహ వస్తువులన్నింటినీ శుభ్రపరిచేందుకు అవకాశం ఉంటుంది. ఈ బాధ్యతలను నగల విభాగంలో రిజిస్టర్‌ అయిన కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. అయితే, ఈ విభాగంలో నమోదు చేసుకున్న రిజిస్టర్డ్‌ కాంట్రాక్టర్లలో ఒకరి వద్ద హిందూయేతర వ్యక్తి వర్కర్‌గా పని చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత విజిలెన్స్‌ సిబ్బంది ఆయనను ఆలయంలోకి అనుమతించ లేదు. అయితే, ఇటీవల అదే వ్యక్తికి అధికారులు రిజిస్టర్డ్‌ కాంట్రాక్టరుగా సర్టిఫికెట్‌ జారీ చేశారు. దీనికోసం ఆయన మతం మారి హిందూమతం స్వీకరించినట్టు స్వీయ నోటరీ సమర్పించినట్టు తెలిసింది. దీనిలో తన పేరు మార్చుకున్నట్టు పేర్కొన్నారు. ఇలా చేసినా.. ఆయన కుటుంబ జీవితం మాత్రం తన మతానికి అనుగుణంగా సాగిస్తున్నారు. దీనిపై ఈ నెల ప్రారంభంలో ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంతో 11వ తేదీన ఈవోకు, జేఈవోకు, నగల విభాగం ఉన్నతాధికారికి కూడా ఫిర్యాదు చేశాను. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోవాలి’’ అని ఆర్‌. వేణుగోపాల్‌ కోరారు.


శ్రీవారి పంచలోహ వస్తువులను శుభ్రపరిచే విధులను హిందూయేతరులైన కాంట్రాక్టర్లకు ఎలా అప్పగిస్తారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఆలయంలో ఏ విధుల్లోనైనా హిందూయేతరులను నియమించరాదని చట్టమే ఉందన్నారు. అయినా అధికారులు పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం దారుణమని, తక్షణం సంబంధిత హిందూయేతరుడైన రిజిస్టర్డ్‌ కాంట్రాక్టరును తొలగించాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2022-04-26T09:40:54+05:30 IST