కశ్మీర్‌లో స్థానికేతర రగడ

ABN , First Publish Date - 2021-10-17T08:11:04+05:30 IST

జమ్మూకశ్మీర్‌లో అమాయక పౌరుల హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

కశ్మీర్‌లో స్థానికేతర రగడ

  • మరో ఇద్దరు పౌరులను కాల్చిన ఉగ్రవాదులు
  • వలసవచ్చిన వారే లక్ష్యంగా దాడులు
  • గత రెండు వారాల్లో 9 మంది హత్య


జమ్మూ/శ్రీనగర్‌/నాగ్‌పూర్‌, అక్టోబరు 16: జమ్మూకశ్మీర్‌లో అమాయక పౌరుల హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శనివారం శ్రీనగర్‌లో పానీపూరి వ్యాపారిని, పుల్వామాలో ఓ కార్పెంటర్‌ను ఉగ్రవాదులు అతిసమీపం నుంచి కాల్చి చంపి పరారాయ్యరు. మృతులను బిహార్‌కు చెందిన అర్వింద్‌ కుమార్‌ షా (30), ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాఘిర్‌ అహ్మద్‌గా గుర్తించామని అధికారులు తెలిపారు. ఆ ఇద్దరి మరణంతో కశ్మీర్‌లో గత రెండు వారాల్లో ఉగ్రవాదుల చేతుల్లో చనిపోయిన మొత్తం పౌరుల సంఖ్య తొమ్మిదికి చేరింది. కాగా పూంఛ్‌ జిల్లాలో ఉగ్రవాదులతో పోరాడుతూ ఇద్దరు ఆర్మీ సిబ్బంది వీర మరణం పొందారు. అమరుల్లో ఒక జవాన్‌తో పాటు జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి (జేసీఓ) కూడా ఉన్నారు. జిల్లాలోని నార్‌ ఖాస్‌ అటవీ ప్రాంతంలో ముష్కరులు నక్కినట్లు సమాచారం అందడంతో గురువారం సాయంత్రం బలగాలు గాలింపు చేపట్టాయి. 


ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య జరిగిన కాల్పుల్లో జేసీఓ యోగంబర్‌ సింగ్‌, జవాన్‌ విక్రమ్‌ అమరులయ్యారు. వారి భౌతికకాయాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. ఇటీవలే పూంఛ్‌ జిల్లాలో ఐదుగురు ఆర్మీ సిబ్బందిని హత్యచేసిన ముష్కరులే ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొని ఉండవచ్చని పేర్కొన్నారు. అలాగే పుల్వామా, శ్రీనగర్‌లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లలో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. పుల్వామాలో ముష్కరులు సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. అతడిని షాహిద్‌ బషీర్‌ షేక్‌గా గుర్తించారు. ఇక శ్రీనగర్‌లోని బెమీనా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తంజిల్‌ అనే ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి. అలాగే శనివారం పుల్వామా జిల్లాలోని పాంపోర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.


శ్రీనగర్‌, జమ్మూలోని భారతీయ వాయుసేన (ఐఏఎఫ్‌) స్థావరాలకు నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌జీ) బలగాలను తరలించారు. ఈ స్థావరాలకు శత్రువుల డ్రోన్‌ల నుంచి రక్షణ కల్పించేందుకు ఎన్‌ఎ్‌సజీ బలగాలను తరలించామని అధికారులు చెప్పారు.


మిలిటరీ సన్నద్ధతను పెంచాలి: భాగవత్‌

జమ్మూకశ్మీర్‌లో అమాయక పౌరులను భయభ్రాంతులకు గురిచేయడానికి ఉగ్రవాదులు లక్షిత దాడులకు పాల్పడుతున్నారని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల వద్ద మిలిటరీ సన్నద్ధతను మరింత పెంచాలని ఆయన సూచించారు. శుక్రవారం విజయదశమి సందర్భంగా నాగ్‌పూర్‌లో నిర్వహించిన సంఘ్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్టికల్‌ 370ని నిర్వీర్యం చేసిన తర్వాత సాధారణ ప్రజలు రద్దు తాలూకు ఫలితాలను పొందుతున్నారని, అయితే యావత్‌ కశ్మీర్‌ను దేశంలోకి విలీనం చేసే ప్రయత్నాలు అవసరమని పేర్కొన్నారు. ఓటీటీ ప్లాట్‌ఫాంలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హద్దు, అదుపులేని ఓటీటీలను నియంత్రించాల్సిన అవసరం ఉందని, జాతీయ జనాభా విధానాన్ని మళ్లీ రూపొందించాలని అభిప్రాయపడ్డారు. ముస్లింల జనాభా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వాల నియంత్రణలో ఉన్న హిందూ ఆలయాలను విడిపించాలని ఆయన కోరారు. హిందూ దేవతలపై విశ్వాసంలేని హిందూయేతరుల కోసం ఆలయాల సొమ్మును ఖర్చుపెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-17T08:11:04+05:30 IST