మందకొడిగా.. ముందుకుసాగని వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-08-02T06:14:04+05:30 IST

కరోనా మూడవ వేవ్‌ ముంచుకువస్తూ డెల్టా వేరియంట్‌ తెలంగాణాలో కూడా ప్రవేశించి కలవరపాటుకు గురిచేస్తుండగా మహమ్మారికి అడ్డుకట్టవేసే వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మాత్రం ఆశించినంత వేగంగా ముందుకు సాగడం లేదు. వ్యాక్సిన్‌ ద్వారా మాత్రమే మూడో వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలమని ప్రపంచ వ్యాప్తంగా వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మందకొడిగా.. ముందుకుసాగని వ్యాక్సినేషన్‌

 

- జిల్లాలో ఇవ్వాల్సింది 7,93,959 మందికి 

- 3,29,155 మందికే అందిన మొదటి డోస్‌ 

- రెండో డోస్‌ పొందిన వారు 1,06,952 మంది

- అరకొర సరఫరాతోనే అసలు సమస్య

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

కరోనా మూడవ వేవ్‌ ముంచుకువస్తూ డెల్టా వేరియంట్‌ తెలంగాణాలో కూడా ప్రవేశించి కలవరపాటుకు గురిచేస్తుండగా మహమ్మారికి అడ్డుకట్టవేసే వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మాత్రం ఆశించినంత వేగంగా ముందుకు సాగడం లేదు. వ్యాక్సిన్‌ ద్వారా మాత్రమే మూడో వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలమని ప్రపంచ వ్యాప్తంగా వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. జిల్లాకు ఏరోజుకారోజు అరకొరగా అందుతున్న వ్యాక్సిన్‌ కారణంగా ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకునే అవకాశం పొందలేకపోతున్నారు. 


41.6 శాతం మందికే వ్యాక్సినేషన్‌


వ్యాక్సినేషన్‌ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ వరకు 41.6 శాతం మందికి మాత్రమే మొదటి డోసు లభించింది. రెండో డోసు వ్యాక్సిన్‌ పొందినవారు 13.4 శాతం మాత్రమే కావడం జిల్లాలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ మందకొడితనానికి అద్దం పడుతున్నది. ఇప్పటి వరకు మొదటి, రెండవ డోసులు కలుపుకొని 4,36,104 డోసుల టీకాలు ఇచ్చారు. 

- జిల్లాలో 18 నుంచి 44 సంవత్సరాల వయసు వారు 4,92,696 మంది ఉన్నారు.  45 నుంచి 59 సంవత్సరాల వయసు గలవారు 1,511,762 మంది, 60 సంవత్సరాల పైవారు 1,49,601 మంది ఉన్నారు. 

- మొదట దశలవారీగా ఆయా గ్రూపుల వయసు వారికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ మూడు గ్రూపుల వారికి వ్యాక్సినేషన్‌ చేయాలని ప్రభుత్వం భావించి అందుకు ఆదేశాలు జారీ చేసింది. 

- జిల్లావ్యాప్తంగా 18 సంవత్సరాల నుంచి ఆపై వయసు వారు 7,93,859 మంది ఉన్నారు. వీరందరికి కేంద్ర వ్యాక్సినేషన్‌ ప్రోటోకాల్‌ ప్రకారం రెండు డోసుల వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉన్నది. ఇందుకోసం 15,87,718 డోసుల వ్యాక్సిన్‌ అవసరమవుతుంది. 

- జూలై 31వరకు 3,29,152 మందికి మొదటి డోసు, 1,06,952 మందికి రెండో డోసు వ్యాక్సిన్‌ ఇచ్చారు. మొదటి డోసు పొందినవారిలో 18 నుంచి 44 సంవత్సరాల వయసుగలవారు 1,08,674 మంది, 45 నుంచి 59 సంవత్సరాల వయసుకలిగినవారు 1,34,425 మంది ఉన్నారు.

- 60 సంవత్సరాలపై వారు 74,701 మంది, హెల్త్‌ కేర్‌ వర్కర్లు 8,146 మంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు 7,206 మంది ఉన్నారు. 

రెండో డోసు పొందినవారిలో 18 నుంచి 44 సంవత్సరాలవారు 13,302 మంది, 45 నుంచి 59 సంవత్సరాల వయసువారు 51,562 మంది, 60 సంవత్సరాలపై వారు 31,612 మంది, హెల్త్‌కేర్‌ వర్కరుల 6,828 మంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు 3,648 మంది ఉన్నారు. 

- ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాల ద్వారా 4,17,089 డోసులు, ప్రైవేట్‌ వ్యాక్సిన్‌ కేంద్రాల ద్వారా 19,015 డోసుల వ్యాక్సిన్‌ను ప్రజలకు ఇచ్చారు. 

- జిల్లాకు పూర్తిస్థాయిలో అర్హులందరికి వ్యాక్సిన్‌ ఇవ్వడానికి 15,87,078 డోసుల వ్యాక్సిన్‌ అవసరం. ఇప్పటి వరకు 4,36,104 డోసులు ఇవ్వగా మరో 11,51,614 డోసుల వ్యాక్సిన్‌ అవసరమున్నది. 

- జిల్లాకు ఇప్పటి వరకు 3,94,730 డోసుల కోవిషీల్డ్‌, 69,860 కోవాగ్జిన్‌ డోసులు వచ్చాయి. 


అందరికి ఎప్పుడు అందేనో..?


వ్యాక్సిన్‌ ఏరోజుకారోజు పంపిస్తున్న కారణంగా ఎన్ని కేంద్రాల్లో వ్యాక్సిన్‌ ఇస్తారో, మొదటి డోసు వారికి ఇస్తారా, రెండో డోసు వారికి ఇస్తారా అన్న వివరాలు ఏరోజుకారోజు ప్రకటించాల్సి వస్తున్నది. గడిచిన 10 రోజుల్లో ఆది, బుధవారాలు సెలవు దినాలు కాగా మిగిలిన ఏడు రోజులపాటు సగటున 6,401 మంది చొప్పున 44,811 డోసుల వ్యాక్సిన్‌ మాత్రమే ప్రజలకు లభించింది. ఇదే తరహాలో వ్యాక్సినేషన్‌ కొనసాగితే జిల్లా ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ఎనిమిది నుంచి తొమ్మిది నెలల కాలం పడుతుంది. మూడో వేవ్‌ అప్పుడే వివిధ రాష్ట్రాల్లో విజృంభిస్తున్నదని, డెల్టా వేరియంట్‌ తెలంగాణ రాష్ట్రంలో కూడా సోకుతుందని తేలడంతో ప్రజలు వ్యాక్సినేషన్‌ తొందరగా కావాలని కోరుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా దృష్టిసారించాలంటున్నారు. 



నేడు అన్ని పీహెచ్‌సీలలో కోవిషీల్డ్‌ రెండో డోస్‌


సుభాష్‌నగర్‌: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సోమవారం 98 రోజులు వ్యవధి పూర్తయిన వారికి కోవిషీల్డ్‌ టీకా రెండో డోస్‌ వేస్తారని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జువేరియా ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్‌లోని విద్యానగర్‌ యూపీహెచ్‌సీ పరిధిలో గల ఆర్టీసీ డిస్పెన్సరీ, హౌసింగ్‌బోర్డు యూపీహెచ్‌సీ పరిధిలోని కుమ్మరివాడ స్కూల్‌, మోతాజ్‌ఖానా యూపీహెచ్‌పీ పరిధిలోని ఎస్‌ఆర్‌ డీజీ స్కూల్‌, జిల్లా ప్రధాన వైద్యశాలలోని వెల్‌నెస్‌ సెంటర్‌లో, హుజూరాబాద్‌, జమ్మికుంట ఏరియా ఆసుపత్రుల్లో కోవిషీల్డ్‌ రెండో డోస్‌ వేస్తారని పేర్కొన్నారు. అలాగే కరీంనగర్‌ కట్టరాంపూర్‌ యూపీహెచ్‌సీ పరిధిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియం, సప్తగిరికాలనీ యూపీహెచ్‌సీ పరిధిలోని సప్తగిరి హైస్కూల్‌లో 28 రోజుల వ్యవధి పూర్తయిన వారికి కోవాక్సిన్‌ రెండో డోస్‌ వేస్తారని తెలిపారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకు బుట్టిరాజారాంకాలనీ యూపీహెచ్‌సీలో కోవిషీల్డ్‌ టీకాలు వేస్తారని డీఎంహెచ్‌వో పేర్కొన్నారు. 




Updated Date - 2021-08-02T06:14:04+05:30 IST