ఆగని లీకులు

ABN , First Publish Date - 2021-12-04T06:16:26+05:30 IST

మోపాడు జలాశయం కట్టకు ఏర్పడ్డ లీకుల కట్టడి చర్యలు కొనసాగుతున్నా నీరు బయటకు వస్తూనే ఉంది.

ఆగని లీకులు
అలుగు వద్ద కాలువ తీస్తున్న ఎక్స్‌కవేటర్‌ (ఇన్‌సెట్‌లో) కట్ట వద్ద లీకుకు ఇసుక బస్తాలు వేస్తున్న కూలీలు

మోపాడు వద్ద కొనసాగుతున్న కట్టడి పనులు

పరిశీలించిన జేసీ వెంకటమురళి 

పామూరు, డిసెంబరు 3 : మోపాడు జలాశయం కట్టకు ఏర్పడ్డ లీకుల కట్టడి చర్యలు  కొనసాగుతున్నా నీరు బయటకు వస్తూనే ఉంది. లీకుల వద్ద కూలీలతో ఇసుక, కంకరతో కలిపిన బస్తాలతో అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు చెరువుకట్ట లోపలి ప్రాంతాల్లో లీకుల వద్ద గ్రావెల్‌ వేసి చదును చేసే కార్యక్రమాన్ని నిలుపుదల చేశారు. జలాశయంలో నీరు నిండుగా ఉండటంతో చదును చేసే ప్రక్రియ సాధ్యం కావడం లేదు.  జేసీ వెంకటమురళి, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌తో కలిసి శుక్రవారం మోపాడు చేరుకొని పరిస్థితిన సమీక్షించారు. రిజర్వాయరులో 25 అడుగుల నీటిమట్టం ఉంచేలా చర్యలు తీసుకునేందుకు అలుగు ప్రాంతంలో ప్రత్యేక కాలువను తీయించి వరద నీటిని మన్నేరులోకి పంపించేందుకు ఉన్నతాధికారుల అనుమతితో చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రిజర్వాయరు నీటిమట్టం 29 అడుగుల మేర  ఉంది. త్వరితగతిన 4 అడుగుల మేర నీటిని బయటకు పంపేందుకు కాలువ తూము ద్వారా నీటిని కిందకు వదలడానికి కంభాలదిన్నె, బొట్లగూడూరు రైతులు అభ్యంతరం తెలిపారు. కాలువలు సక్రమంగా లేవని, ఇలాంటి తరుణంలో తూము ఎత్తితే ఆయకట్టు పొలాలు కోతకు గురవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు చేసేదిలేక అలుగు దగ్గరే ప్రత్యామ్నాయ కాలువను తీసి నీటిని వదులుతున్నారు. కార్యక్రమంలో జేడీఏ శ్రీరామమూర్తి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ లక్ష్మీరెడ్డి, డీఈ రవికుమార్‌ పాల్గొన్నారు. 


అర్ధరాత్రి హైఅలర్ట్‌

కట్ట వద్ద లీకుల ద్వారా మట్టినీరు వస్తుందని, దాంతో కట్ట బలహీనపడి పగుళ్లు ఏర్పడ్డాయని జిల్లా ఉన్నతాధికారులకు గురువారం అర్ధరాత్రి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన వారు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా కట్ట వద్ద ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు. దీంతో ఏమైందోనని మోపాడు కట్ట కింద గ్రామాల ప్రజలు వణికిపోయారు. అవి మట్టి పగుళ్లు మాత్రమేనని, ఎలాంటి ప్రమాదం లేదని అఽధికారులు తెలపడంతో ఊపిరిపీల్చుకున్నారు. డీఎస్పీ కండే శ్రీనివాసరావు, తహసీల్దార్‌ సిహెచ్‌.ఉష, సిబ్బంది, రెస్క్యూ టీం బృందం రాత్రంతా కట్ట మీదనే జాగరణ చేస్తూ ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని ఉన్నతాధికారులకు చేరవేస్తూనే  ఉంది. 



Updated Date - 2021-12-04T06:16:26+05:30 IST