Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆగని ఇసుక దందా

 బిక్కేరు వాగు నుంచి కొనసాగుతున్న ఇసుక తరలింపు

 ప్రాజెక్ట్‌ పేరుతో పక్కదారి పడుతుందన్న గ్రామస్థులు

 లారీ ఇసుకను రూ.లక్షకు విక్రయిస్తున్న వ్యాపారులు 

 ఫిట్స్‌ వచ్చిన మహిళకు అస్వస్థత... ఆస్పత్రికి తరలింపు

ఇసుకాసురుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అడ్డగూడూరు మండలం చిర్రగూడూరు బిక్కేరు వాగునుంచి ఇసుకను తరలించ వద్దని గ్రామస్థులు, రైతులు ఆందోళన చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రోజుల తరబడి లారీల కొద్దీ ఇసుకను తర లించుకుపోతున్నారని, ఆపేయాలని ఈ నెల 20వ తేదీన రైతులు వాగుకు వెళ్లి ఆందోళన చేస్తుంటే, వారందరినీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అడ్డు తగిలితే కేసులు నమోదు చేస్తామంటూ పోలీ సులు హెచ్చరికలు జారీ చేసి, ఆదివారం కూడా యథావిధి అధిక సం ఖ్యలో లారీల ద్వారా ఇసుకను తరలిస్తూనే ఉన్నారు. పోలీసులే దగ్గ రుండి ఈ అక్రమ వ్యాపారానికి మద్దతుగా నిలుస్తుంటే తాము ఎవరికి చెప్పుకోవాలంటూ గ్రామస్థులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

- మోత్కూరు

గ్రామాల్లో ఇల్లు నిర్మించుకోవాలన్నా, సీసీరోడ్డు, ప్రభుత్వ భవనాల్లాంటి నిర్మాణాలకు ఇసుక ఇవ్వడానికి నానా కొర్రీలు పెట్టే అధికారులు ఇసుకాసురులకు మాత్రం అడిగిందే తడువుగా అనుమతులు ఎలా ఇస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మైనింగ్‌, పోలీస్‌, రెవెన్యూశాఖల అధికారుల కు, అధికార, ప్రతిపక్ష పార్టీల బడా లీడర్లు మొదలుకొని, చోటామోటా లీడర్ల వరకు వారు ముడుపులు ముట్టచెబుతుండటంతో ఇసుక వ్యాపా రం మూడు పువ్వులు, ఆరుకాయలు అన్న చందంగా సాగుతున్నదంటున్నారు. ఇటు ఇసుకాసురులు, అటు అధికారులు, లీడర్లు బాగు పడుతుండగా సామాన్య ప్రజలు నష్టపోయి నలిగిపోతున్నారు. బస్వాపూర్‌ రిజర్వాయర్‌ పేరుతో తీసుకెళుతున్న ఇసుక కొంతదారి మళ్లించడంవల్లే వారు అధికారులను అంతగా మేనేజ్‌ చేయగల్గుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒక్కో లారీలో సుమారు 40 టన్నుల ఇసుక తీసుకెళుతున్నార ని, లారీ ఇసుకను హైదరాబాద్‌లో రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు విక్రయిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 


అనుమతులు ఇవ్వడమే తప్ప పర్యవేక్షణ పట్టని అధికారులు

బస్వాపూర్‌ పేరుతో గాని, మరో పేరుతోగాని ఇసుకాసురులకు అధికారులు అనుమతులివ్వడమేగాని,ఎంత ఇసుక తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చాము,వారు ఎంత ఇసుక తీసుకెళుతున్నారు, అనుమతి తీసుకున్న చో టుకే ఇసుక తీసుకెళుతున్నారా, మరెక్కడికైనా తరలిస్తున్నారా అన్నది అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిర్రగూడూరు వాగునుంచి 10వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుక బస్వాపూర్‌ ప్రాజెక్టుకు తీసుకెళ్లడానికి కాంట్రాక్టర్‌ అనుమతి పొందారని చెబుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 6నుంచి 29వ తేదీలోపు ఆ ఇసుకను తీసుకెళ్లాలి. కాగా ఆ గడువులోపు 4,456 క్యూబిక్‌ మీటర్ల ఇసుక మాత్రమే ఎత్తారని, మిగతాది తీసుకెళ్లడానికి నెలకోసారి గడవు పొడిగిస్తూనే ఉన్నారు. వాగులో నీరు ప్రవహిస్తున్నా ఇసుక తరలింపు ఆపకుండా రోజూ వందలాది లారీలు ఇసుక తరలించారని గ్రామస్థులు చెబుతున్నారు.అయినా వర్షాల కారణం గా ఇసుక తీసుకెళ్లలేదంటూ, ఇంకా 5544 క్యూబిక్‌ మీటర్ల ఇసుక తీసుకె ళ్ల వచ్చంటూ అధికారులు నెల తర్వాత మరో నెల ఇలా గడవు పెంచుతూనే ఉన్నారంటున్నారు. ఒక్కో లారీలో ఎన్ని క్యూబిక్‌ మీటర్ల ఇసుక పడుతుంది, ఎన్ని లారీలు తీసుకెళ్లాలన్నది గ్రామస్తులకు అర్థమయ్యేలా జీవోలు ఉండవు.దీంతో వారి ఇష్టానుసారం తమను బెదిరిస్తూ ఇసుక త రలింపును కొనసాగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికి మూడునెలలుకుపైగా ఇసుక తరలింపు కొనసాగుతున్నా అనుమతి ఇచ్చి న ఏ ఒక్క అధికారి అటు వచ్చిన పాపాన పోలేదని పేర్కొంటున్నారు.  


కలెక్టర్‌ వద్దకు వెళ్లేందుకు సిద్దమవుతున్న గ్రామస్థులు

చిర్రగూడూరు బిక్కేరు వాగు నుంచి ఇసుక అక్రమ తరలింపుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు గ్రామస్థులు, రైతులు సిద్ధమవుతున్నారు. రెం డు డీసీఎంలు అద్దెకు తీసుకుని వెళ్లి సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని, అయినా అధికారులు స్పందించి ఇసుక తరలింపును నిలిపివేయకుంటే కోర్టుకు వెళ్తామని పేర్కొంటున్నారు.  


ఆందోళన చేసిన మహిళా రైతుకు మళ్లీ అస్వస్థత

అడ్డగూడూరు మండ లం చిర్రగూడూరు  బిక్కేరు వా గు నుంచి ఇసుక తరలించవద్దంటూ శనివారం గ్రామస్థులు అడ్డుకు న్న సందర్భంగా పోలీసులు సుమారు 30 మంది మహిళలను డీసీఎంలో ఎక్కించి మో త్కూరు పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో అందులో కల్లెట్లపల్లి సావిత్రమ్మకు బీపీ పెరి గి ఫిట్స్‌ వచ్చి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్సచేసి శనివారం రాత్రి ఇంటికి పంపించారు. ఆదివారం ఉదయం ఆమె మళ్లీ ఆమె అస్వస్థతకు గురైంది. గ్రామస్తులు ఆమెను వెంటనే 108లో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతున్నది. శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన పర్రెపాటి రాములమ్మను భువనగిరి ఏరియా ఆస్పత్రి కి తరలించగా అక్కడ చికిత్స చేసి ఇంటికి పంపారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. 


వాగులోని బోర్లపై ఆధారపడి వ్యవసాయం

మోత్కూరు మండలం మోత్కూరు నుంచి మొదలుకొని అడ్డగూడూ రు మండలం కోటమర్తి, ధర్మారం, లక్ష్మీదేవికాల్వ గ్రామాల వరకు వేలా ది మంది రైతులకు బిక్కేరు వాగే ఆధారం. ఈ రైతులందరి భూముల్లో బోర్లు వేస్తే నీరు రాక బిక్కేరు వాగులో చేతి బోర్లు వేసుకుని వ్యవసా యం చేస్తున్నారు. టీడీపీ హయాంలో చేతిబోర్లు వేసుకోవడానికి, సా మూహిక వ్యవసాయ బావులు తవ్వుకోవడానికి రైతులకు ప్రభుత్వం ఆర్థికసాయం కూడా చేసింది. తీవ్ర కరువు కాలంలోనూ బిక్కేరు వాగులోని చేతి బోర్లు రైతులను బతికించాయి. అంతటి నీటివనరులు ఉన్న వాగులోంచి ఇసుక తోడేస్తున్నారని, దీంతో తమ వ్యవసాయం కుంటుప డి జీవనోపాధి దెబ్బతింటుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇసుక తరలింపును నిలివేసి భూగర్భజలాలను సంరక్షించాలని కోరుతున్నారు.


చంద్రశేఖర్‌

పట్టించుకోని అధికారులు : చంద్రశేఖర్‌, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు

అడ్డగూడూరు మండలం చిర్రగూడూరు బిక్కేరు వాగు నుంచి ఇసుక అక్రమ తరలింపును వెంటనే ఆపాలి. వాగు నుంచి ఎన్ని లారీల ఇసుక తరలించారన్నది అధికారులు వాస్తవాలు బహిర్గతం చేయాలి. నెలల తరబడి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా, ప్రజలు ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోకుండా మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ప్రజలు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడే స్థాయికి వెళ్లారంటే ఇసుక తరలింపువల్ల ఎంత నష్టం కలుగుతుందో అధికారులు అర్థం చేసుకోవాలన్నారు. వెంటనే కలెక్టర్‌ స్పందించి విచారణ జరిపించాలి, లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో రై తులును సమీకరించి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతాం. 

Advertisement
Advertisement