30 రోజుల్లో సాధారణ పరిస్థితి

ABN , First Publish Date - 2021-05-14T04:45:14+05:30 IST

కొవిడ్‌ కేసులను గణనీయంగా తగ్గించడం ద్వారా నెల రోజుల్లో జిల్లాలో సాధారణ పరిస్థితులు తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ కోరారు. వైద్యారోగ్య శాఖ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దారులతో ఆయన గురువారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

30 రోజుల్లో సాధారణ పరిస్థితి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

కొవిడ్‌ నియంత్రణే లక్ష్యం 

ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం పెంచాలి 

ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీని అరికట్టాలి 

జూమ్‌ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ 

కలెక్టరేట్‌, మే 13 : కొవిడ్‌ కేసులను గణనీయంగా తగ్గించడం ద్వారా నెల రోజుల్లో జిల్లాలో సాధారణ పరిస్థితులు తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ కోరారు. వైద్యారోగ్య శాఖ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దారులతో ఆయన గురువారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల రోజుల పాటు పటిష్టమైన కార్యాచరణతో పనిచేయాలని, వచ్చే నెల ఇదే సమయానికి కొవిడ్‌ కేసుల సంఖ్యను రెండంకెలకు పరిమితం చేయాలని అన్నారు. ఇందుకోసం రెండంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఒకవైపు కరోనా కట్టడి చర్యలు తీసుకోవడం.. మరో వైపు వ్యాధి సోకిన వారికి సమర్థమైన చికిత్స అందించి పూర్తిగా నయం చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఇది జరగాలంటే వైరస్‌పై ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచాలని సూచించారు. కొవిడ్‌ నివారణకు  ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీటింగ్‌ విధానం మహారాష్ట్రలో మంచి ఫలితాన్ని ఇచ్చిందన్నారు. ఇక్కడ కూడా ఈ విధానం అమలు చేయాలని సూచించారు. ముందుగా వ్యాధి సోకిన వారిని గుర్తించి వారిని క్వారంటైన్‌ చేయాలని, వ్యాప్తి చెందకుండా ఫీవర్‌ సర్వేను పక్కాగా చేయాలని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లు ఇదే అదునుగా బాధితులను దోచుకునే అవకాశం ఉందని, దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు. అంబులెన్స్‌, టెస్టులు, వ్యాక్సిన్‌లు, దహన కార్యక్రమాలు, రవాణా చార్జీలు అధికంగా వసూలు చేసే అవకాశం ఉందన్నారు. నిత్యావసరాల ధరలను పెంచే అవకాశం ఉందని వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం పెంచాలని కోరారు.



Updated Date - 2021-05-14T04:45:14+05:30 IST