నైరుతిలో సాధారణ వర్షాలు

ABN , First Publish Date - 2021-04-14T09:00:12+05:30 IST

రానున్న నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్‌’ అంచనా వేసింది.

నైరుతిలో సాధారణ వర్షాలు

జూన్‌, సెప్టెంబరులలో పుష్కలంగా వర్షాలు

ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్‌’ అంచనా


విశాఖపట్నం, అమరావతి, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): రానున్న నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్‌’ అంచనా వేసింది. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ దీర్ఘకాల సగటులో 96 నుంచి 104 శాతం వర్షపాతం నమోదైతే సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. అయితే ఈ ఏడాది 103 శాతం వర్షపాతం నమోదవుతుందని స్కైమెట్‌ పేర్కొంది. ఈ మేరకు మంగళవారం అంచనా నివేదికను విడుదల చేసింది. నాలుగు నెలల సీజన్‌లో 880.6 మి.మీ.ల వర్షపాతం కురవాల్సి ఉంది. అయితే ఉత్తర, ఈశాన్యంలో కొన్ని ప్రాంతాలు, మారుమూల కర్ణాటకలో వర్షాలు తక్కువగా కురుస్తాయని, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సీజన్‌ ప్రారంభం నెల జూన్‌, చివరి నెల సెప్టెంబరులలో ఎక్కువ వర్షాలు కురుస్తాయని, పశ్చిమ కనుములతో కూడిన కర్ణాటక మారుమూల ప్రాంతంలో జూలై, ఆగస్టు నెలల్లో తక్కువగా వర్షాలు కురుస్తాయని స్కైమెట్‌ సీఈవో యోగేంద్ర పాటిల్‌ పేర్కొన్నారు.


పసిఫిక్‌ మహా సముద్రంలో లానినా పరిస్థితులు కొనసాగుతున్నాయని, ఇవి రుతుపవనాలకు అనుకూలంగా ఉంటాయని, ఇంకా ఇండియన్‌ డైపోల్‌ మోడ్‌, జూలియన్‌ అస్లేషన్‌ ఇండెక్స్‌ కూడా నైరుతి రుతుపవనాలకు అనుకూలంగా ఉన్నట్టు స్కైమెట్‌ పేర్కొంది. కాగా జూన్‌లో 166.9, జూలైలో 285.3, ఆగస్టులో 258.2, సెప్టెంబరులో 170.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని వివరించింది. అయితే నాలుగు నెలల సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదుకు 60 శాతం అవకాశం ఉందని  స్కైమెట్‌ సీఈవో వివరించారు. కాగా రానున్న సీజన్‌పై భారత వాతావరణ సంస్థ ఈనెల 15 లేదా 16న అంచనా నివేదికను విడుదల చేయనున్నది. 


రాష్ట్రంలో అకాల వర్షాలు

సముద్రం నుంచి తేమగాలులు వీస్తుండడంతో వాతావరణ అనిశ్చితి నెలకొని మంగళవారం సాయంత్రం నుంచి కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల మూడు సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కోస్తాలోని మిగిలినచోట్ల ఎండ తీవ్రత నెలకొంది. బుధ, గురువారాల్లో ఉత్తరకోస్తాంధ్ర, యానాంలలో 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు, అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమలోనూ ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది.   

Updated Date - 2021-04-14T09:00:12+05:30 IST