వంటింటి కుందేళ్ళం కాదు

ABN , First Publish Date - 2020-09-13T05:30:00+05:30 IST

జీవితంలో ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారి ఆమె ఫీనిక్స్‌ పక్షిలా తిరిగి నిలబడింది. అదే పట్టుదల కేన్సర్‌ను జయించేలా చేసింది.

వంటింటి కుందేళ్ళం కాదు

జీవితంలో ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారి ఆమె ఫీనిక్స్‌ పక్షిలా తిరిగి నిలబడింది. అదే పట్టుదల కేన్సర్‌ను జయించేలా చేసింది. ‘ద 12 కమాండిమెంట్స్‌ ఆఫ్‌ బీయింగ్‌ ఏ ఉమన్‌’ లెటర్‌ ద్వారా పురుషాధిక్య భావజాలాన్ని ధ్వంసం చేయాలనే సందేశాన్ని ఇస్తున్నారు నటుడు  ఆయుష్మాన్‌ ఖురానా భార్య తహిరా కశ్యప్‌. రచయిత్రి, దర్శకురాలైన ఆమె ఈ సందర్భంగా తన జీవితంలోని కొన్ని సంఘటనలను పంచుకున్నారిలా...


నిజం చెప్పాలంటే ఆడవాళ్లు మగవాళ్ల కన్నా ఎక్కువగా కష్టపడతారు. కానీ వారికి అంత గుర్తింపు రాదు.


‘‘సమాజంలో ప్రతిచోట ఏదో ఒక రూపంలో మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేను ఎందుకు ఈ లెటర్‌ రాయాల్సి వచ్చిందంటే... గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు నా ఓపికను పరీక్షిస్తున్నాయి. పురుషాధిక్యానికి వ్యతిరేకంగా పెల్లుబికుతున్న ఆగ్రహం నన్ను కదిలించింది. నిజం చెప్పాలంటే ఆడవాళ్లు మగవాళ్ల కన్నా ఎక్కువగా కష్టపడతారు. కానీ వారికి అంత గుర్తింపు రాదు. ముంబయిలో నాకు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఉన్న మహిళ గురించి చెబుతాను. ఒకరోజు ఎక్కువ సమయం వర్కవుట్‌ చేసిన తరువాత ఆమెకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చాను. ఆమె చేతులు గట్టిగా ఉన్నాయి. ఆమె నావంక చూస్తూ, ‘నేను మరింత కష్టపడాలి. నేను నా గేమ్‌లో టాప్‌లో ఉండాలి. ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండాలి’ అని చెప్పింది. గత పదిహేనేళ్లలో నేను చాలామంది జిమ్‌ ట్రైనర్స్‌ను చూశాను. జిమ్‌ ట్రైనర్‌గా ఉన్న 90శాతం మగవాళ్లు పూర్తిగా అన్‌ఫిట్‌. ఎందుకంటే వారి కండరాలన్ని ఫ్యాట్‌తో ఉండేవి. మహిళా శిక్షకులు అలా కాదు. థైరాయిడ్‌ సమస్యలు, హార్మోన్ల హెచ్చుతగ్గులు, సిజేరియన్‌ ద్వారా పిల్లలను కనడం వంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వారు వంద శాతం ఫిట్‌గా ఉంటారు. అయితే మేల్‌ ట్రైనర్స్‌తో పోల్చితే వీరి వద్ద ట్రైనింగ్‌ తీసుకునే వారు చాలా తక్కువ. ఎందుకు ఈ తేడా? మిగతా వృత్తుల్లో మాదిరి జీవితంలో కూడా ప్రతిసారి మహిళలు తమ సత్తాను నిరూపించుకోవాల్సి వస్తుంది. 


ఆడవాళ్లు వంటగదికే పరిమితం కాదు

హర్యానాలో ఇప్పుడు మేము ఉంటున్న కొత్త ఇంటి ప్లాన్‌ గురించి బిల్డర్‌ను కలిసిన రోజు నాకింకా గుర్తుంది. మేము హాల్‌, పడకగది, అత్తామామ ఉండే గది ఎక్కడ ఉంటాయి! అని ఆలోచిస్తుంటే ఆ బిల్డర్‌ మా వంక చూసి ‘ఖురానా అత్తాకోడళ్లు ఇక్కడ వంట చేయవచ్చు’ అంటూ వంట గదిని చూపించాడు. ఇప్పటికీ చాలామంది ఆడవాళ్లు వంటగదికే పరిమితం అనే తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు. మహిళలపై జరిగే దాడులను ప్రశ్నించినప్పుడు ‘ఫెమినిస్టులు ప్రతి దానికి పెద్దగా అరుస్తుంటారు’ అని కొందరు అంటుంటారు. ఇలా ప్రతిసారి ఏదో రకంగా నింద మోపుతుంటారు. ఆడా మగా ఇద్దరూ సమానం అని ఈ సమాజం గుర్తించేంత వరకూ అందరం ఈ పురుషాధిక్య భావజాలాన్ని ధ్వంసం చేద్దాం’’.

Updated Date - 2020-09-13T05:30:00+05:30 IST