పీఎంఏవై కింద తెలంగాణలో ఒక్క ఇల్లూ కట్టలేదు

ABN , First Publish Date - 2020-09-21T07:42:35+05:30 IST

పీఎంఏవై కింద తెలంగాణలో ఒక్క ఇల్లూ కట్టలేదు

పీఎంఏవై కింద తెలంగాణలో ఒక్క ఇల్లూ కట్టలేదు

గత 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా కోటి ఇళ్ల నిర్మాణం: కేంద్రం


న్యూఢిల్లీ, హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి అవాస్‌ యోజన - గ్రామీణ పథకం కింద తెలంగాణలో ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు పీఎంఏవై పథకంపై లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌  లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా గత నాలుగేళ్లలో కోటి 4 లక్షల ఇళ్లు నిర్మించామని తెలిపారు. ఇదే కాలంలో తెలంగాణలో ఈ పథకం కింద ఒక్క ఇల్లూ నిర్మించలేదని పేర్కొన్నారు. 2018-19, 2019-20లో ఈ పథకం కింద తెలంగాణకు నిధులు విడుదల చేయలేదని మరో సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. దేశంలో ప్రతి 1343 మందికి ఒక్క వైద్యుడు అందుబాటులో ఉన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.


ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు దేశంలో వైద్యుడు, జనాభా నిష్పత్తి మేరకు వైద్యులున్నారా? అంటూ రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ  రాతపూర్వక సమాధానం ఇచ్చింది. దేశంలో 12,55,786 మంది అల్లోపతి వైద్యులున్నారని, అందులో 10.05 లక్షల మంది వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపింది. అలాగే దేశంలో ప్రతి 658 మందికి ఒక నర్సు అందుబాటులో ఉన్నారని పేర్కొంది.  ఆహార సబ్సిడీ కింద తెలంగాణ రాష్ట్రానికి గత ఐదేళ్లలో రూ. 17479.13 కోట్లను మంజూరు చేశామని కేంద్ర మంత్రి దన్వే రావుసాహెబ్‌ దాదారావు వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు ఆదివారం మంత్రి సమాధానం ఇచ్చారు. ఇవే కాకుండా అంతర్రాష్ట్ర రవాణా, రేషన్‌ షాపుల డీలర్ల ఖర్చుల కోసం రూ. 293.14 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. తెలంగాణలో 83 లక్షల కుటుంబాలు ఉండగా 53 లక్షళ 47 వేల 166 ఆహార భద్రత కార్డులను జారీ చేశామని పేర్కొన్నారు.  

Updated Date - 2020-09-21T07:42:35+05:30 IST