కొడుకు కాదు.. యమకింకరుడు

ABN , First Publish Date - 2022-01-25T07:34:16+05:30 IST

నెల కిందటి వరకు బాగానే ఉన్నాడు.. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఇంటికి చేదోడువాదోడుగా

కొడుకు కాదు.. యమకింకరుడు

  •  అర్ధరాత్రి వ్యాయామం ఏంటన్నందుకు ఉన్మాదం
  •  డంబెల్స్‌తో తలపై కొట్టి కన్నతల్లి దారుణ హత్య
  •  దారుణాన్ని అడ్డుకోబోయిన చెల్లెలు పైనా దాడి
  •  పోలీసులు వచ్చేదాకా 10 ని. కిరాతక ప్రవర్తన
  •  వారితో తీవ్ర వాగ్వాదం.. ఎట్టకేలకు అదుపులోకి
  •  మానసిక స్థితిపై అనుమానం.. ఎర్రగడ్డ ఆస్పత్రికి


మంగళ్‌హాట్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి): నెల కిందటి వరకు బాగానే ఉన్నాడు.. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఇంటికి చేదోడువాదోడుగా ఉండే వాడు. వివాదాస్పదుడూ కాదు.. ఇంతలోనే ఏమైందో..? కొలువు మానేశాడు. ముభావంగా మారిపోయాడు. ఇతరులతో కలవకుండా ఒంటరి గా ఉండసాగాడు. ఇన్‌స్టా గ్రాంలో మాత్రం చురుగ్గా ఉంటూ.. ప్రముఖ దర్శకులు, హీరోలకు సందేశాలు పంపేవాడు. కండలు పెంచాలనే ఉద్దేశంలో అర్ధరాత్రి లేచి వ్యాయామాలు చేసేవాడు. చుట్టుపక్కలవారు అడిగితే, అమ్మాచెల్లి సర్దిచెప్పేవారు. చివరకు అతడి విపరీత ప్రవర్తన ఆ అమ్మ ప్రాణాలనే బలిగొంది. వేళాపాళ లేకుండా ఈ కసరత్తులేమిటని ప్రశ్నించిన తల్లిని.. తలపై డంబెల్‌తో అతి దారుణంగా కొట్టి హతమార్చాడు ఓ యువకుడు.


ఈ ఘటన హైదరాబాద్‌ సుల్తాన్‌ బజార్‌  ఠాణా పరిధిలో ఆదివారం అర్ధరాత్రి 2.30 వేళ చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన దంపతులు కొండా రమేష్‌, పాపమ్మ(45) కొన్నేళ్ల క్రితం నగరంలోని రాంకోఠి ప్రాంతానికి వలస వచ్చారు. ఇళ్లలో పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి సుధీర్‌ కుమార్‌(25), సుచిత్ర(24) పిల్లలు. ఎనిమిదేళ్ల క్రితం రమేష్‌ అనారోగ్యంతో మృతి చెందాడు. పాపమ్మ కుటుంబ భారం మోస్తూ.. సుధీర్‌ను డిగ్రీ వరకు చదివించింది. నెల క్రితం వరకు అతడు స్విగ్గీ, జొమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేసి మానేశాడు.


సుచిత ప్రస్తుతం ఇంటి సమీపంలోని ఓ కార్యాలయంలో పనిచేస్తోంది. ఉద్యోగం బంద్‌ చేశాక సుధీర్‌ ప్రవర్తన మారింది. అర్థరాత్రి తర్వాత వ్యాయామాలు చేయసాగాడు. మానసిక స్థితి సరిగా లేక అలా చేస్తున్నట్లు పాపమ్మ చుట్టుపక్కలవారికి చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భోజనం తర్వాత పాపమ్మ, సుధీర్‌ వరండాల్లో, సుచిత్ర లోపలి గదిలో నిద్రపోయారు. ఒంటి గంట సమయంలో లేచిన సుధీర్‌ గదిలోకి వెళ్లి డంబెల్స్‌తో వ్యాయామం ప్రారంభించాడు. 2.30   సమయంలో మేల్కొన్న పాపమ్మ దీనిపై ప్రశ్నించింది. పడుకోవాలని చెప్పి వరండాలోకి వచ్చింది. తీవ్ర కోపోద్రిక్తుడైన సుధీర్‌ డంబెల్‌తో  వచ్చి తల్లి తలపై బాదాడు. తల్లి అరుపుతో నిద్ర లేచిన సుచిత్ర.. బయటకు వస్తుండగా ఆమెను సుధీర్‌ గదిలోకి నెట్టేసి బయటనుంచి గడియ పెట్టాడు. మళ్లీ తల్లి తలపై డంబెల్‌తో మోదాడు.


సుచిత్ర గట్టిగా తలుపులు కొడుతూ అరవడంతో గడియా తీసి ‘‘అమ్మను చంపేశాను’’ అంటూ సుధీర్‌ అరవసాగాడు. ఎందుకిలా చేశావని నిలదీసిన సుచిత్ర తలపైనా డంబెల్‌తో బాదాడు. ఆమో బయటకు పరుగులు పెట్టింది. ఇరుగుపొరుగు నిద్ర లేచి సుల్తాన్‌ బజార్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చేందుకు 10-15 నిమిషాలు పట్టగా.. అప్పటివరకు కూడా సుధీర్‌ డంబెల్‌తో తల్లి తలపై మోదుతూనే ఉన్నాడు. ఓ దశలో పోలీసులకు కూడా ఎదురుతిరిగాడు. వాగ్వాదానికి దిగాడు. ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పాపమ్మ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. సుచిత్ర తలకు 13 కుట్లు పడ్డాయి.


ఇన్‌స్టాలో సినిమా వాళ్లకు మెసేజ్‌లు

హీరో రానా, దర్శకుడు రాజమౌళితో పాటు సుధీర్‌ కొన్ని రోజులుగా ఇన్‌స్టాగ్రాంలో ప్రముఖ హీరోలు, డైరెక్టర్లకు లెక్కలేనని సందేశాలు పంపాడు. వీటిలో ఎలాంటి వ్యాయామాలు చేయాలి..? ఎలాంటి సినిమాలు తీయాలనేదానిపై బాలీవుడ్‌, టాలీవుడ్‌ ప్రముఖ హీరోలు, డైరెక్టర్లకు సలహాలు ఇచ్చాడు. అవకాశం ఇస్తే నటిస్తానంటూ కోరాడు. కాగా, సుధీర్‌ మానసిక స్థితి సరిగా లేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పరీక్షలు నిర్వహించిన ఉస్మానియా వైద్యులు ఎర్రగడ్డ ఆస్పత్రికి రిఫర్‌ చేయడంతో అక్కడికి తరలించారు.


Updated Date - 2022-01-25T07:34:16+05:30 IST