ఇల్లు నిర్మించి ఇవ్వనట్టే?

ABN , First Publish Date - 2021-02-25T04:51:28+05:30 IST

పేదలకు ప్రభుత్వం అందజేసిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి తొలుత మూడు ప్రతిపాదనలు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు రెండింటి వైపే మొగ్గు చూపుతోంది. పూర్తిగా ఇల్లు కట్టి ఇస్తామన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు లబ్ధిదారులకు అధికారులు సూచనలు ఇస్తున్నారు. మొదటి రెండింటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలని కోరుతున్నారు.

ఇల్లు నిర్మించి ఇవ్వనట్టే?

పేదల ఇళ్ల నిర్మాణంలో మొదటి రెండు ఆప్షన్లకే ప్రభుత్వం మొగ్గు

లబ్ధిదారులకు అవగాహన పరుస్తున్న అధికారులు

పేదలకు ప్రభుత్వం అందజేసిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి తొలుత మూడు ప్రతిపాదనలు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు రెండింటి వైపే మొగ్గు చూపుతోంది. పూర్తిగా ఇల్లు కట్టి ఇస్తామన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు లబ్ధిదారులకు అధికారులు సూచనలు ఇస్తున్నారు. మొదటి రెండింటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నేతలే భావిస్తున్నారు. 


కలెక్టరేట్‌, ఫిబ్రవరి 24:

పేదల ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ఇంటి నిర్మాణానికి ముఖ్యమంత్రే మూడు ప్రతిపాదనలు ప్రకటించారు. లబ్ధిదారులు స్వయంగా నిర్మించుకుంటామంటే బిల్లులు చెల్లిస్తామని, రెండో ఆప్షన్‌ ప్రకారం మెటీరియల్‌ సరఫరా చేస్తామని, మూడో ఆప్షన్‌ కావాలంటే ప్రభుత్వమే పూర్తిగా ఇంటిని నిర్మించి అందజేస్తుందని చెప్పారు. తర్వాతతర్వాత ప్రభుత్వం నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. మూడో ఆప్షన్‌కు విముఖత చూపుతోంది. ఈ మేరకు అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. ఆ దిశగా లబ్ధిదారులకు సంబంధిత అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మొదటి, రెండు ఆప్షన్లకు సిద్ధం కావాలని సూచనలు ఇస్తున్నారు. 

ప్రభుత్వం గత ఏడాది డిసెంబరు 24న ఇళ్ల స్థలాల పంపిణీ మొదలు పెట్టింది. జిల్లాలో సుమారు 83వేల మందికి పట్టాలు పంపిణీ చేసింది. వీరిలో కొత్తగా 52వేల మందికి పట్టాలు అందజేయగా 23, 200మందికి పొజిషన్‌ సర్టిఫికెట్లు, 6300 మందికి టిట్కో ఇళ్లను పంపిణీ చేసింది. ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన తరువాత లబ్ధిదారులకు ప్రభుత్వం మూడు ఆప్షన్లను ప్రకటించి ఏదో ఒకటి ఎంచుకోవాలని సూచించింది. తమ అభిప్రాయాన్ని తెలియజేసి ఒకటి రెండు రోజుల్లో అంగీకార పత్రం ఇవ్వాలంటూ లబ్ధిదారులను కోరింది. ఆ ప్రకారం జిల్లా వ్యాప్తంగా మొదటి ఆప్షన్‌ కోసం 6,126 మంది, రెండో ఆప్షన్‌కు 55,414 మంది, మూడో ఆప్షన్‌కు 19,605 మంది మొత్తం 81,145 మంది తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఇప్పుడు మూడో ఆప్షన్‌ కాకుండా మొదటి, రెండో ఆప్షన్ల ద్వారా ఇళ్లు నిర్మించుకోవాలని ఆధికారులు సూచిస్తున్నారు. మరోవైపు జిల్లాలో తొలివిడతగా 98,286 ఇళ్లను నిర్మించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేస్తుంది. ఈ డబ్బుతో నిర్మాణం చేయడం కష్టం అవుతుందని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో మూడో ఆప్షన్‌కు చెక్‌ పెట్టినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ వద్ద ప్రస్తావించగా మూడో ఆప్షన్‌ పూర్తిగా రద్దు చేయలేదని, ఎవరైనా దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ల స్థలాలు మంజూరై ఉంటే అటువంటి వారికి ప్రభుత్వ అధ్వర్యంలో ఇల్లు నిర్మిస్తామని వెల్లడించారు. 



Updated Date - 2021-02-25T04:51:28+05:30 IST