ఎందుకీ నిర్లక్ష్యం..?

ABN , First Publish Date - 2021-05-07T05:30:00+05:30 IST

కరోనా సెకండ్‌వేవ్‌ జిల్లాలో ఉధృతంగా ఉంది. ముఖ్యంగా కడప నగరాన్ని వణికిస్తోంది.

ఎందుకీ నిర్లక్ష్యం..?
కడపలో చేతులకు గ్లౌజులు లేకుండా పనిచేస్తున్న కార్మికులు

నెలలు గడిచినా పారిశుధ్య కార్మికులకు అందని పనిముట్లు

కరోనా రక్షణకు మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు ఇవ్వని వైనం

కడప, మే 7 (ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌వేవ్‌ జిల్లాలో ఉధృతంగా ఉంది. ముఖ్యంగా కడప నగరాన్ని వణికిస్తోంది. జిల్లాలో నమోదయ్యే కేసుల్లో అత్యధికం కడపలోనే ఉంటున్నాయి. రోజూ వందకు పైనే పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. ఏ ప్రాంతంలో ఎక్కడ, ఎవరు వైరస్‌ బారిన పడ్డారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో పారిశుధ్య పనులు చేపడుతున్న కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వారికి అవసరమైన పనిముట్లు, రక్షణ కోసం అవసరమైన గ్లౌజులు ఇవ్వడంలేదు. దీంతో కరోనా వేళ  వీరు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. కడప కార్పొరేషనలో నాలుగు లక్షల పైచిలుకు జనాభా ఉంది. సీకేదిన్నె మండలం కడపలో కలిసిపోయి ఉంది. సరాసరిన కేసులు ఇక్కడ రోజూ 200కు పైగా నమోదవుతున్నాయి. కార్పొరేషన చుట్టూ 15 కి.మీ మేర విస్తరించి ఉంది. 664 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు.


పారిశుధ్య కార్మికులకు రక్షణ కవచాలు ఏవీ?

కరోనా విజృంభిస్తున్న వేళ ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని అధికార యంత్రాంగం చెబుతోంది. మరి కార్మికులకు రక్షణ పరికరాలు అందడంలేదని వాపోతున్నారు. గత ఏడాది కరోనా సందర్భంగా పారిశుధ్య కార్మికుల సేవలు ఎనలేనివంటూ కీర్తించారు. వారికి సన్మానాలు చేశారు. మరి ఈ సారి మాత్రం వారిని పట్టించుకునే నాధుడే లేడు. అవసరమైన గ్లౌజులు, మాస్కులు, శానిటైజరు అందడంలేదని కార్మికులు వాపోతున్నారు. కరోనా నేపధ్యంలో నెలకు మూడుసార్లు చేతి గ్లౌజులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఒక్కో కార్మికుడికి మూడు గుడ్డ మాస్కులు ఇచ్చారు. ‘‘ప్రతి వీధి శుభ్రం చేస్తున్నాం, ఏ వీధులు, ఏ ఇంట్లో పాజిటివ్‌ వ్యక్తులున్నారో తెలియదు. అలాంటి తరుణంలో పనులు చేస్తుంటే నాణ్యమైన మాస్కులు ఇవ్వకుండా గుడ్డ మాస్కులు ఇవ్వడం ఎంత వరకు సమంజసం’’ అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఒక జత చేతి గ్లౌజులు ఇచ్చారని, రోజూ పనిచేసే తమకు ఇవి ఎలా రిపోతాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్లౌజులు లేకపోవడంతో ప్లాస్టిక్‌ కవర్లను గ్లౌజుగా ఉపయోగించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇంతవరకు శానిటైజరు ఇవ్వలేదు, చెప్పులు, సబ్బులు, నూనె అందించడంలేదు. హెల్త్‌ అలవెన్స ఇంకా రెండు నెలలది ఇవ్వాలి. అనారోగ్యానికి గురై ఒక్క రోజు కార్మికుడు హాజరు కాకపోయినా ఆబ్సెంట్‌ వేస్తున్నారు. ఒక్కో కార్మికుడిపై 8 మంది పర్యవేక్షిస్తున్నారు. కానీ కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలు అందించలేకపోతున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.


శానిటైజరు అందజేస్తాం 

- శ్రీనివాసులు, హెల్త్‌ ఆఫీసర్‌, కార్పొరేషన

పారిశుధ్య కార్మికులకు అవసరమైన గ్లౌజులు, మాస్కులు ఇస్తున్నాం. శానిటైజరును కూడా రెండు రోజుల్లో అందిస్తాం. శానిటైజరు కోసం నివేదిక పంపాం. ఇప్పటికే గ్లౌజులు, మాస్కులు ఇచ్చాం. 


కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు  

- సుంకర రవి, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన నగర అధ్యక్షుడు

కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్రంగా ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే వారికి అవసరమైన మాస్కులు, గ్లౌజులు, శానిటైజరు ఇవ్వకుండా అధికారులు కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు కార్మికులు కరోనాతో మృతిచెందారు. కార్మికులపై ఇంజనీరింగ్‌ అధికారులు మొదలు వార్డు వలంటీరు, సచివాలయ సిబ్బంది మొత్తం 8 మంది పెత్తనం చెలాయిస్తున్నారు. ఆరోగ్యం బాగా లేక విధులకు హాజరు కాకపోతే ఆబ్సెంట్‌ వేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కార్పొరేటర్‌ సంతకం చేస్తేనే జీతం ఇస్తున్నారు. ఈఎ్‌సఐ డబ్బులను జమ చేయలేదు. వెంటనే కార్మికులకు అవసరమైన మాస్కులు, గ్లౌజులు, శానిటైజరు ఇవ్వాలి.

Updated Date - 2021-05-07T05:30:00+05:30 IST