చట్టం కాదు, శాస్త్రం ముఖ్యం

ABN , First Publish Date - 2020-12-02T07:42:44+05:30 IST

కోవిడ్‌ కేసుల పెరుగుదల భారీస్థాయిలో లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ నెల 14 వ తేదీ నాటికి ప్రాథమిక, ప్రాథమికోన్నత...

చట్టం కాదు, శాస్త్రం ముఖ్యం

విద్యార్థి- ఉపాధ్యాయ నిష్పత్తి విషయంలో కేంద్ర ప్రభుత్వ ‘విద్యా హక్కు చట్టం-–2009’ నిర్దేశాలు సవ్యంగా లేవు. మరి ఆ చట్టం ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల సహేతుకీకరణ విద్యా ప్రమాణాల మెరుగుదలకు దోహదం చేస్తుందా? కేంద్ర విద్యా హక్కు చట్టాన్ని అధిగమించి బోధనా శాస్త్రం సూచిస్తున్నట్టు విద్యార్థి- ఉపాధ్యాయ నిష్పత్తి 20:1గా ఉండితీరాలి. పాఠశాల విద్య ప్రమాణాలు మెరుగుపడేందుకు ఇదే ఉత్తమోత్తమ మార్గం. 


కోవిడ్‌ కేసుల పెరుగుదల భారీస్థాయిలో లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ నెల 14 వ తేదీ నాటికి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు అన్నీ పునఃప్రారంభమవుతాయి. మరి విద్యాబోధనకు తగినంతమంది ఉపాధ్యాయులు ఉంటారా? ఉపాధ్యాయుల బదిలీలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ పోస్టుల సహేతుకీకరణ కారణంగానే ఆ ప్రశ్న వేయవలసివచ్చింది. ఈ ప్రక్రియ, ప్రభుత్వ పాఠశాల విద్యను తీవ్రంగా ప్రభావితం చేయగలదనే భయాందోళనలు విస్మరించరానివి. 

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వ ‘విద్యా హక్కు చట్టం- 2009’ ప్రకారం ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేస్తామని రాష్ట్ర పాలకులు చెబుతున్నారు. గమనార్హమైన వాస్తవమేమిటంటే ఆ విద్యాహక్కు చట్టం ఉపాధ్యాయ పోస్టుల విషయాలలో బలహీనంగా ఉంది. ఆ చట్టం ప్రకారం, 60 కంటే తక్కువ మంది బాలలు ఉండే ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులకు ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారు! 61 నుంచి 90 మధ్య బాలలు ఉన్న పాఠశాలల్లో ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారు. ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయులు కావాలంటే ఈ విద్యార్థుల సంఖ్య 120కి మించి ఉండాలి. అదనంగా ఒక ప్రధానోపాధ్యాయ పోస్టు కావాలంటే విద్యార్థుల సంఖ్య విధిగా 150 దాటాలి. అయితే రాష్ట్రంలో అటువంటి పాఠశాలలు ఒక్కటి కూడా లేని మండలాలే అధికం! ఈ కారణంగా విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తికి సంబంధించి కేంద్ర విద్యా హక్కు చట్టం అమలుచేస్తే ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందడం కలలో కూడా జరగదు. 

మరి పాఠశాలలను విలీనం చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను కేంద్రీకరిస్తే సమస్య పరిష్కారం అవుతుందా? అవదు. ఎందుకని? దిగువ మధ్యతరగతి బాలలు సైతం ప్రైవేట్ పాఠశాలల్లోనే ప్రధానంగా విద్యాభ్యాసం చేస్తుండడం వల్ల ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. రెండు మూడు పాఠశాలలు చొప్పున విలీనం చేసినా విద్యార్థుల సంఖ్య 150 దాటదు. పైగా పాఠశాలల విలీనం వల్ల పలువురు బాలలకు బడి దూరం అవుతుంది. పేద కుటుంబాలలో తల్లిదండ్రులు ఉదయాన్నే పనులకు వెళ్ళిపోతారు. బాలలను దించి రావడానికి వారి వద్ద స్కూటర్లు కాదు కదా సైకిళ్ళు కూడా ఉండవు. పాఠశాలలను విలీనం చేస్తే గణింప దగ్గ స్థాయిలో బాలలు బడి మానివేసే ప్రమాదం ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలలో విద్యా ప్రమాణాలు మెరుగు పడాలంటే కేంద్ర విద్యా హక్కు చట్టాన్ని అధిగమించి బోధనా శాస్త్రం సూచిస్తున్నట్టు విద్యార్థి- ఉపాధ్యాయ నిష్పత్తి 20:1గా ఉండితీరాలి. పాఠశాల విద్య ప్రమాణాలు మెరుగుపడేందుకు ఇదే ఉత్తమోత్తమ మార్గం. దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఈ కోణంలో ఆలోచించడం లేదు

విద్యార్థుల సంఖ్య 60 లోపున ఉన్నప్పుడు ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయులను ఇవ్వాలని ఎవరూ అనలేరు. అయితే ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్య సమకూర్చాలంటే విద్యార్థులు- ఉపాధ్యాయుల నిష్పత్తి విధిగా 20:1గా ఉండితీరాలి. ఈ ప్రకారం 40కి మించి విద్యార్థులు ఉన్న పాఠశాలకు 3వ, 60కి మించి బాలలు ఉన్న బడికి 4వ, 80కి మించి విద్యార్థులు ఉన్న పాఠశాలకు 5వ టీచర్ పోస్టు ఇవ్వాలని విద్యాపరిరక్షణ వేదికలు, ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చాయి. ఈ అభ్యర్థనకు పాక్షికంగా స్పందించిన తెలుగు దేశం ప్రభుత్వం 2015 నవంబర్‌లో 80, అంతకు మించి విద్యార్థులు ఉన్న 3,884 ప్రాథమిక పాఠశాలలను ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా ప్రకటించి, వాటికి ఐదుగురు ఉపాధ్యాయులను ఇచ్చింది. అయితే 20 కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలను ఏకోపాథ్యాయ పాఠశాలలుగానే కొనసాగించింది. ప్రస్తుత ప్రభుత్వం 20 లోపు బాలలు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు విద్యాహక్కు చట్టం ప్రకారం రెండవ టీచర్ పోస్టు ఇచ్చేందుకు సమ్మతిస్తూ ఆదర్శ పాఠశాలలు అన్నిటినీ రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. ఏకోపాధ్యాయ పాఠశాలలకు రెండవ పోస్టు ఇవ్వాలా లేకా ఆదర్శ పాఠశాలలను కొనసాగించాలా అనే యక్ష ప్రశ్నలను సంధిస్తున్నది. అయితే ఇది పరిష్కారం లేని సమస్య ఎంతమాత్రమూ కాదు. 

వేల సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేస్తే ఆదర్శ పాఠశాలలను కొనసాగిస్తూనే 20 లోపు బాలలు ఉన్న పాఠశాలలకు రెండవ పోస్టు ఇవ్వవచ్చు. అలాగే విద్యార్థి- ఉపాధ్యాయ నిష్పత్తిని 20:1గా అమలుచేసి అన్ని ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి బాటలు వేయవచ్చు. అవసరమైనన్ని కొత్త పోస్టులు మంజూరుచేసి వెంటనే డి.యస్‌.సి- 2020కి నోటిఫికేషన్‌ జారీ చేయాలి. మొత్తం ఖాళీలను భర్తీ చేయాలి. గత మే మొదటి వారంలో ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు 21,461 కాగా అందులో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే యస్‌.జి.టి ఖాళీలు 7,642. ఇప్పుడు ఖాళీలు ఇంకా పెరిగి ఉంటాయి. ఈ ఖాళీలు అన్నింటిననీ నింపితే సమస్య పరిష్కారం అవుతుంది. ఈ పరిష్కారాలు ప్రభుత్వానికి తెలియనివి కావు. అయితే వారి ప్రాధాన్యతలు వేరు కదా. 

ఉపాధ్యాయ పోస్టుల సహేతుకీకరణలో ముందుకు వచ్చిన మరొక ప్రధాన సమస్య- కొవిడ్‌ కారణంగా ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల నమోదులో జరుగుతున్న జాప్యం. ప్రభుత్వం తొలుత గత విద్యా సంవత్సరం చివరిలో ఫిబ్రవరి 29న గల నమోదు లేదా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అయిన తరువాత నవంబర్‌ 3 నాటి నమోదులలో ఏది ఎక్కువ అయితే దానిని గమనంలోకి తీసుకోవడానికి, ఆ నమోదు ఆధారంగా పాఠశాలల వారీగా ఉపాధ్యాయుల సంఖ్యను నిర్ణయించడానికి అంగీకరించినట్లు తెలుస్తుంది. కొవిడ్‌ సమస్య లేకుంటే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అయిన నాలుగు వారాలకు గత విద్యా సంవత్సరం చివరి కంటే ఎక్కువ నమోదు సాధ్యం అయ్యేది. మహమ్మారి కారణంగా ఉన్నత పాఠశాలల్లో, ప్రధానంగా 6వ తరగతిలో చేరవలసిన విద్యార్థులు చేరడం లేదు. 6వ తరగతి విద్యార్థులకు ఇంకా తరగతులు ప్రారంభం కాలేదు. తరగతులు ప్రారంభం అయిన రెండు వారాల తరువాత లెక్కలు తీస్తే సుమారు గరిష్ఠ నమోదు తెలుస్తుంది. ఇదిలా వుంటే నవంబరు 3న ఉన్న బాలల నమోదును మాత్రమే గమనంలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. దీనివల్ల చాలా ఉన్నత పాఠశాలలు నష్టపోతున్నాయి, వాటిలో ఉపాధ్యాయ పోస్టులు తగ్గిపోతున్నాయి. ఈ ఆదేశం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల అభివృద్ధికి చాలా నష్టదాయకం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తగ్గిపోతే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల వైపు చూస్తారు. ఆర్థిక వెసులుబాటు ఏమాత్రం ఉన్నా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిపోతారు.
బాలలు ఆంగ్లం నేర్చుకోవాలని, అందుకే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రస్తుత పాలకులు చెబుతున్నారు. అవిభక్త రాష్ట్రంలో రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం ఉన్నత పాఠశాల్లోనూ, నవ్యాంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించాయి. అయితే, పాఠశాల విద్యావ్యవస్థలో ఆంగ్లమాధ్యమాన్ని తప్పనిసరి చేయడం ప్రస్తుత ప్రభుత్వ ప్రత్యేకత. నిజానికి బాలలు ఆంగ్లం నేర్చుకోవడం అవసరం అన్న విషయమై ఎవరికీ రెండవ అభిప్రాయం లేదు. మరి ఆంగ్ల భాషా నైపుణ్యాలు ఆంగ్ల మాధ్యమం ద్వారా సమకూరుతాయా? ఎల్‌.కె.జి నుండి ఇంజనీరింగు వరకు ఆంగ్ల మాధ్యమంలో చదివిన వారు నాలుగు ఇంగ్లీషు వాక్యాలు సవ్యంగా రాయలేక పోతున్నారు కదా. వారు తెలుగు సైతం సరిగ్గా రాయలేక పోతున్నారు. ఆంగ్ల మాధ్యమం వారిని రెంటికీ చెడిన రేవడులను చేసింది. మాతృభాషా మాధ్యమాన్ని అమలుచేస్తూ, ఆంగ్లాన్ని ఒక పాఠ్య విషయంగా బాలలకు నేర్పాలి. ఆంగ్ల భాషను బాగా నేర్పాలంటే ప్రత్యేక అర్హతలు, శిక్షణ ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా అవసరం. ప్రాథమిక పాఠశాలలలో విద్యార్ధి ఉపాధ్యాయ నిష్పత్తిని 20:1 కి అభివృద్ధిచేసి అందులో ఒక పోస్టును ఆంగ్ల బోధనకు కేటాయించాలి. ఆంగ్ల మాధ్యమం నుంచి బయట పడి ఆంగ్ల భాషా బోధనకు ఉపక్రమించడం, అందుకు ఒక ఉపాధ్యాయ పోస్టును మంజూరు చేయడం ఎంతైనా అవసరం.

ప్రభుత్వ పాఠశాలల నియంత్రణ గురించి ప్రస్తుత పాలకులు నిరంతరం మాట్లాడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివే బాలలను ర్యాంకులు సాధించేలా తీవ్ర ఒత్తిడికి లోను చేస్తారు. చదువులో వెనకబడిన బాలలను పట్టించుకోవడం లేదు. ఫీజులు, యూనిఫారాల పేరిట, నోటు పుస్తకాలు, మరోటని తల్లి దండ్రులను పీడిస్తున్నారు. ఉపాధ్యాయులకు చాలీ చాలని జీతాలు ఇస్తున్నారు. దశాబ్దాలుగా లాభాలు ఆర్జిస్తున్న కార్పొరేట్ పాఠశాలలు సైతం కొవిడ్‌ కష్ట కాలంలో ఉపాధ్యాయులను వీధి పాలు చేశాయి. కాబట్టి ప్రైవేట్ పాఠశాలలను నియంత్రించవలసిందే. ఎవరు నియత్రించాలి అనేదే ప్రధాన సమస్య. ప్రైవేట్ యాజమాన్యాలను ప్రభుత్వ అధికారులు నియంత్రించడం అంటే అవినీతికి అవకాశం కల్పించడమే. అధికారులు నిజాయితీగా వ్యవహరించడం మనం ఏనాడూ చూడలేదు. ప్రైవేట్ పాఠశాలలను నియంత్రించాలంటే 1992 నాటి జి.వో. 1 నిబంధనలలో ప్రస్తావించిన పాఠశాల గవర్నింగ్‌ బాడీలో తల్లిదండ్రుల ప్రాతినిథ్యాన్ని కనీసం 75 శాతానికి పెంచాలి. 
రమేష్‌ పట్నాయక్‌
కన్వీనర్‌, ఆంధ్రప్రదేశ్‌ విద్యా పరిరక్షణ కమిటి

Updated Date - 2020-12-02T07:42:44+05:30 IST