వుమెన్ టీంను తయారు చేస్తున్న టీమిండియా.. అందరికీ అమ్మాయిలే..

ABN , First Publish Date - 2021-01-13T02:13:28+05:30 IST

‘మాకు అమ్మాయి పుట్టింది. ఈ విషయం మీతో పంచుకోవడానికి చాలా థ్రిల్‌గా ఫీలవుతున్నాం’ అంటూ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంట ప్రకటించింది.

వుమెన్ టీంను తయారు చేస్తున్న టీమిండియా.. అందరికీ అమ్మాయిలే..

ఇంటర్నెట్ డెస్క్: ‘మాకు అమ్మాయి పుట్టింది. ఈ విషయం మీతో పంచుకోవడానికి చాలా థ్రిల్‌గా ఫీలవుతున్నాం’ అంటూ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంట ప్రకటించింది. ఈ విషయం వినగానే చాలామంది మదిలో ఓ విషయం మెదిలింది. అదేంటంటే.. కొన్నేళ్ల నుంచి తండ్రులైన భారత క్రికెటర్లలో ఎక్కువ మందికి ఆడపిల్లలే పుట్టారు. నిజమేనా? అని అనుమానమా? ఇంకేం ఈ కథనం చదివేయండి.


భారత్ ఓపెనింగ్‌కు వెన్నెముకలా మారిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు రితికా సజ్దాతో వివాహమైంది. వీరిద్దరికీ అమ్మాయే పుట్టింది. ఈ పాప పేరు సమైరా. తనకు కొంచెం ఖాళీ దొరికినా సరే తనతోనే గడిపేస్తాడీ హిట్‌మ్యాన్. టూర్లలో ఉంటే సమైరాను మిస్ అవుతున్నానంటూ పోస్టులు పెడుతుంటాడు.


నేటితరం మేటి టెస్టు క్రికెటర్లలో మన నయా వాల్ ఛతేశ్వర్ పుజారా ఒకడు. ఇతనికి కూడా తొలి సంతానం అమ్మాయే. భార్య పూజతో కలిసి కుమార్తె అదితి చేసే అల్లరి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకోవడం పుజారాకు సదరా.


కెప్టెన్ కోహ్లీ లేని తరుణంలో ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్లో ఉన్న భారత జట్టును ముందుండి నడిపిస్తూ.. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్న అజింక్య రహానేకు కూడా ఆడపిల్లే పుట్టింది. చిన్న నాటి స్నేహితురాలు రాధికను వివాహమాడిన రహానేకు.. 2014లో ఆర్య పుట్టింది. ఆర్య అంటే రహానేకు పిచ్చి ప్రేమ. దగ్గరుండి ఆమెకు పాలు పట్టిస్తూ, పాటలు పాడి ఆడిస్తూ గడిపేస్తుంటాడు. రహానే సోషల్ మీడియాలో ఈ వీడియోలే ఎక్కువగా ఉంటాయి.


ప్రస్తుత ఆస్ట్రేలియా టూర్లో బంతితో మ్యాజిక్ చేస్తూ.. మూడో టెస్టులో గోడలా నిలబడి జట్టుకు డ్రా అందించిన రవిచంద్రన్ అశ్విన్‌కు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న అశ్విన్-ప్రీతి జంటకు ఆద్యా, అకీరా ఇద్దరు కుమార్తెలు. ముద్దు ముద్దు మాటలతో వీళ్లిద్దరూ ట్విట్టర్లో భలే పాపులర్ అయిపోయారు. కరోనా జాగ్రత్తలు సరిగా పాటించాలంటూ అశ్విన్‌కు వీళ్లు జాగ్రత్తలు చెప్పిన వీడియో చాలా పాపులర్ అయింది.


అశ్విన్‌లాగే బంతితో బ్యాటుతో ఆసీస్ టూర్లో అద్భుతాలు సృష్టించిన మరో ఆటగాడు రవీంద్ర జడేజా. జడేజా తొలి సంతానం కుమార్తే. పేరు నిద్యానా. తను పుట్టినప్పుడు ‘మా ఇంటికి చిన్నారి రాకుమార్తె వచ్చింది’ అంటూ అందరికీ సంతోషంగా చెప్పుకున్నాడీ ఆల్‌రౌండర్. కూతురు పుట్టిన తర్వాతే తను ఆటలో బాగా రాణిస్తున్నానని, ఆమె తన లక్కీస్టార్ అని చెప్తుంటాడు.


పేసర్ ఉమేశ్ యాదవ్ కూడా ఇటీవలే తండ్రి అయ్యాడు. అతనికి కూడా కుమార్తే పుట్టింది. ‘ఆడపిల్ల పుట్టింది. చిన్నారి రాకుమార్తెకు ప్రపంచంలోకి స్వాగతం’ అంటూ ఈ ఏడాది జనవరి 1న కుమార్తెకు స్వాగతం పలికాడీ ఫాస్ట్ బౌలర్.


గతేడాది క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ ప్లేయర్ సురేశ్ రైనాదీ ఇదే కథ. రైనా-ప్రియాంకా జంట ముద్దుల కుమార్తె పేరు గ్రేసీ రైనా. ఆమె అంటే రైనాకు ఎంత పిచ్చంటే.. కుమార్తె పేరును చేతిపై పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాడు. అలాగే గ్రేసీ పేరు మీద చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు.


భారత జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ కుమార్తె గురించి వేరే చెప్పాలా? సోషల్ మీడియాలో జీవా ఎంత పాపులరో తెలుసు కదా. తన గారాల పట్టి జీవా ఫొటోలను ధోనీ సోషల్ మీడియాలో తెగ పంచుకుంటూ ఉంటాడు. 


భారత పురుషుల క్రికెట్ జట్టులో ఇంతమంది ఆటగాళ్లకు ఆడపిల్లలే పుట్టడంపై సోషల్ మీడియాలో కొందరు జోకులేస్తున్నారు. వీళ్లందరూ కలిసి భవిష్యత్తులో భారత మహిళల క్రికెట్ జట్టును తయారు చేస్తున్నారంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2021-01-13T02:13:28+05:30 IST