ప్రైవేటు వద్దు!

ABN , First Publish Date - 2021-04-01T07:31:15+05:30 IST

మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన ప్రైవేటీకరణ ప్రతిపాదనలను, ప్రయత్నాలను కేంద్ర ప్రభత్వంలోని కొన్ని కీలక

ప్రైవేటు వద్దు!

  • పెట్టుబడుల ఉపసంహరణ వద్దన్న బొగ్గు శాఖ
  • జాతీయ భద్రత దృష్ట్యా  రక్షణ ఉత్పత్తుల తయారీ
  • ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి: రక్షణ శాఖ
  • యాంత్రిక్స్‌ను, న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ను
  • ప్రైవేటు పరం చేయొద్దు: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌
  • ఆ అభ్యంతరాలన్నింటినీ తోసిరాజని మరీ..
  • ప్రైవేటీకరణపై ముందుకు సాగుతున్న కేంద్రం
  • ఇప్పటికే సమ్మె బాటలో ఉద్యోగ సంఘాలు
  • కేంద్రం ప్రతిపాదనలు ముందుకు కదిలేనా..?



మోదీ ప్రణాళికలకు పలు శాఖల అభ్యంతరాలు

జాతీయ భద్రత దృష్ట్యా రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగాలి

- ప్రైవేటీకరణపై రక్షణ శాఖ అభ్యంతరం


ప్రైవేటీకరణ వల్ల రక్షణ శాఖలో ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయి. సాంకేతికతలో నవ్యతకు, నాణ్యతకు ఆస్కారముంటుంది. అత్యుత్తమమైన యాజమాన్య ప్రమాణాలను నెలకొల్పడం వీలవుతుంది

- రక్షణ శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ జవాబు


కొవిడ్‌ మహమ్మారి కమ్మేసినపుడు ప్రభుత్వ ఆస్పత్రులు అద్భుతంగా పనిచేశాయి. ఆరోగ్య సిబ్బంది పనితీరు సర్వత్రా ప్రశంసలందుకొంది. ఆరోగ్య రంగాన్ని వ్యూహాత్మక జాబితాలో చేర్చాలి.

- వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి


కరోనా సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు కూడా గణనీయమైన సేవలందించాయి. వాక్సిన్‌ ఉత్పత్తిలో, సరఫరాలో, అధ్యయనంలో వాటి పాత్ర కూడా తక్కువేం కాదు

- ఆరోగ్య శాఖ విజ్ఞప్తికి కేంద్ర ఆర్థిక శాఖ సమాధానం


న్యూఢిల్లీ, మార్చి 31: మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన ప్రైవేటీకరణ ప్రతిపాదనలను, ప్రయత్నాలను కేంద్ర ప్రభత్వంలోని కొన్ని కీలక శాఖలే వ్యతిరేకిస్తున్నాయి. పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టవద్దని సూచించాయి. ముఖ్యంగా.. రక్షణ, బొగ్గు, అణుశక్తి, అంతరిక్ష, ఆరోగ్య విభాగాలు డిజిన్వె్‌స్టమెంట్‌ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ.. ఆ అభ్యంతరాలన్నింటినీ తోసిరాజని మరీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణపై ముందుకే సాగుతోందని ‘బ్లూమ్‌బర్గ్‌ క్వింట్‌’ ఒక వార్తా కథనంలో పేర్కొంది. ఆ కథనం ప్రకారం.. పెట్టుబడుల ఉపసంహరణపై మొత్తం 49 శాఖల నుంచి ప్రతిస్పందనలను ఆర్థిక శాఖ కోరగా 7 శాఖలు ప్రైవేటీకరణకు ససేమిరా అన్నాయి. మూడు శాఖలు షరతులతో అయితే ఓకే అన్నాయి.


ఇక.. తమను వ్యూహాత్మక రంగాల (అంటే ప్రైవేటు పరం చేయని) జాబితాలో చేర్చాలని మరో ఏడు శాఖలు కోరగా.. 21 శాఖలు, విభాగాలు పెద్దగా అభ్యంతరాలు చెప్పకుండా ప్రైవేటీకరణకు మద్దతిచ్చాయి. మరో పది విభాగాలు తమ తమ అభ్యంతరాలను, కామెంట్లను పంపాయి. ముఖ్యంగా.. వ్యూహాత్మక రంగాల కేటగిరీలో ఉన్న బొగ్గు శాఖ ప్రైవేటీకరణ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. గనుల తవ్వకం వాణిజ్యపరం చేసినందుకే విమర్శలు ఎదుర్కొంటున్నామని, ఇపుడు పూర్తి ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమని ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలోని బొగ్గు శాఖ తేల్చిచెప్పింది. వ్యూహాత్మక కేటగిరీలోనే ఉన్న రక్షణ, అంతరిక్ష విభాగాలు కూడా పెట్టుబడుల ఉపసంహరణపై ఆందోళన వ్యక్తం చేశాయి. 


ఉదాహరణకు.. జాతీయ భద్రత దృష్ట్యా రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగాలని పేర్కొంటూ రక్షణ శాఖ 2020 జూలై 20న.. డిజిన్వె్‌స్టమెంట్‌పై ఆర్థిక శాఖ పరిధిలో పనిచేస్తున్న దీపమ్‌ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ అండ్‌ పబ్లిక్‌ ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌) విభాగానికి ఒక లేఖ పంపింది. కానీ, రక్షణ శాఖ సూచనలను దీపమ్‌ తిరస్కరించింది. ప్రైవేటీకరణ వల్ల ఆ శాఖలో ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయని, సాంకేతికతలో నవ్యతకు, నాణ్యతకు ఆస్కారముంటుందని, అత్యుత్తమమైన యాజమాన్య ప్రమాణాలను నెలకొల్పడం వీలవుతుందని తన ప్రత్యుత్తరంలో వివరించింది.


అలాగే.. వ్యూహాత్మక కేటగిరీలోనే ఉన్న అంతరిక్ష విభాగం (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌) కూడా.. తమ పరిధిలో ఉన్న యాంత్రిక్స్‌ కార్పొరేషన్‌ను, న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ను ప్రైవేటు పరం చేయొద్దంటూ లేఖ రాసింది. అణుశక్తి విభాగం కూడా.. తన పరిధిలో ఉన్న నాలుగు సంస్థల్లో రెండింటిని ప్రైవేటీకరణ విధానం పరిధి నుంచి తప్పించాలని కోరింది. న్యూక్లియర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 49 శాతాన్ని డిజిన్వెస్ట్‌ చేయవచ్చని, అది కూడా అన్ని ప్రతిపాదనలూ సమగ్రంగా సమీక్షించాకే జరపాలని, ఇక యురేనియం కార్పొరేషన్‌ను జాతీయ భద్రత దృష్ట్యా ప్రైవేటుకు అమ్మేయరాదని గట్టిగా కోరింది. ఇలా పలు శాఖలు సూచనలు చేశాయి.



మా కేటగిరీ మార్చండి..

వ్యూహాత్మకేతర జాబితాలో ఉన్న పెట్రోలియం- సహజవాయు మంత్రిత్వ శాఖ.. తమను వ్యూహాత్మక జాబితాలోకి మార్చాలని కోరింది. అయితే స్థూలంగా ప్రైవేటుకు దారులు పరిచే దీపమ్‌ ముసాయిదాను సమర్థిస్తున్నట్లు పేర్కొంది. అటు షిప్పింగ్‌ శాఖ కూడా తమను వ్యూహాత్మక కేటగిరీలోకి చేర్చాలని కోరింది. ‘మన పొరుగు దేశాలు చైనా, పాక్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల్లో నేషనల్‌ షిప్పింగ్‌ కంపెనీలు ఉన్నాయి. మనదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటేనే మంచిది’ అని ఆ శాఖ దీపమ్‌కు పంపిన 30 పేజీల రిపోర్ట్‌లో అభిప్రాయపడింది.


దానికి స్పందనగా.. ‘‘మరి 2019లో ఈ ప్రతిపాదన చేసినపుడు షిప్పింగ్‌ శాఖ దీనినెందుకు సమర్థించింద’’ని దీపమ్‌ ప్రశ్నించింది. ఇక.. కొవిడ్‌ మహమ్మారి కమ్మేసినపుడు ప్రభుత్వ ఆస్పత్రులు అద్భుతంగా పనిచేశాయని, ఆరోగ్య సిబ్బంది పని సర్వత్రా ప్రశంసలందుకొందని, ఈ దృష్ట్యా తమ రంగాన్ని వ్యూహాత్మక జాబితాలో చేర్చాలని వైద్య ఆరోగ్యశాఖ కోరగా దీపమ్‌ విభాగం ఈ వాదనను కొట్టి పడేసింది. ‘ప్రైవేటు ఆసుపత్రులు కూడా గణనీయమైన సేవలందించాయి. వాక్సిన్‌ ఉత్పత్తిలో, సరఫరాలో, అధ్యయనంలో వాటి పాత్ర కూడా తక్కువేం కాదు’ అని వ్యాఖ్యానించింది.



గత ఏడాదే...

మోదీ సర్కారు ప్రైవేటీకరణ విధానంలో భాగంగా.. వివిధ విభాగాలను వ్యూహాత్మక, వ్యూహాత్మకేతర రంగాలుగా విభజించింది. వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ పాత్ర కనిష్టంగా ఉంటుంది. వ్యూహాత్మకేతర కేటగిరీలో శాఖలను విలీనం చేయడమో, ప్రైవేటుకు అమ్మేయడమో చేస్తారు. మరీ నష్టాల్లో ఉంటే మూసేస్తారు. ఉదాహరణకు.. రక్షణ, అంతరిక్ష రంగాలు వ్యూహాత్మక కేటగిరీలోనే ఉన్నప్పటికీ వాటిలో విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వంటివాటిని పూర్తిగా ప్రైవేటు పరం చేస్తారు. లేదా మూసేస్తారు. కేంద్రం ఈ ప్రతిపాదనను కిందటి సంవత్సరమే ముందుకు తెచ్చింది.



దీనిపై 2020 జూలై 6న దీపమ్‌ విభాగం.. వివిధ శాఖలకు నోట్‌ పంపింది. ఈ ప్రతిపాదనపై స్పందనకు దీపమ్‌ 2 వారాల గడువు ఇవ్వగా.. వివిధ శాఖలు, విభాగాల నుంచి దాదాపు 7 నెలలపాటు సూచనలు, సలహాలు, అభ్యంతరాలు వెల్లువెత్తాయి. అవన్నీ ఒక కొలిక్కి రాకముందే.. ఈ ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలా సీతారామన్‌ ప్రైవేటీకరణ విధానం గురించి ప్రకటించేశారు. కొద్ది రంగాలు మినహా మిగిలిన విభాగాలన్నింటినీ ప్రైవేటుకు అప్పగిస్తామని, వ్యాపారం చేయాల్సిన పని ప్రభుత్వానికి లేదని  ప్రధాని మోదీ పదేపదే పేర్కొనడం గమనార్హం. కాగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని అనేక కార్మిక ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.


మార్చి 15న పది లక్షల మంది బ్యాంకింగ్‌ సిబ్బంది సమ్మె చేశారు. ఆ వెంటనే బీమా సిబ్బంది కూడా సమ్మె చేశారు. ఎలక్ట్రిసిటీ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 27 లక్షల మంది సిబ్బంది ఫిబ్రవరి 3న ఉద్యమించారు. సెయిల్‌ లాంటి సంస్థలు కూడా అన్నింట్లోనూ పెట్టుబడులను ఉపసంహరిస్తామన్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటుందా లేక బేఖాతరు చేస్తూ ప్రైవేటీకరణపై ముందుకే సాగుతుందా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.


Updated Date - 2021-04-01T07:31:15+05:30 IST