సన్స్‌ కాదు... డాటర్స్‌!

ABN , First Publish Date - 2020-05-27T05:30:00+05:30 IST

మన పితృస్వామ్య సమాజంలో సాధారణంగా వారసులు అనగానే కొడుకుల వైపే చూస్తారెవరైనా. తండ్రి చేసే వ్యాపారంలో కొడుకులే పాలుపంచుకుంటారు కాబట్టి దుకాణాల పేర్లు

సన్స్‌ కాదు... డాటర్స్‌!

మన పితృస్వామ్య సమాజంలో సాధారణంగా వారసులు అనగానే కొడుకుల వైపే చూస్తారెవరైనా. తండ్రి చేసే వ్యాపారంలో కొడుకులే పాలుపంచుకుంటారు కాబట్టి దుకాణాల పేర్లు ‘నీలకంఠం అండ్‌ సన్స్‌’, ‘వినోద్‌రాయ్‌ అండ్‌ సన్స్‌’ అంటూ కనిపిస్తాయి. కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని తిరగరాయించారు ‘లుథియానా’కు చెందిన ఒక వ్యాపారి. ఆయన నిర్వహించే మెడికల్‌ షాప్‌నకు ‘గుప్తా అండ్‌ డాటర్స్‌’ అని బోర్డు రాయించడంతో అది కాస్త వైరల్‌ అవుతోంది. ఆయన ప్రయత్నాన్ని అంతా ముక్తకంఠంతో మెచ్చుకుంటున్నారు. 


మనోజ్‌కుమార్‌ గుప్తా (54)... పంజాబ్‌ రాష్ట్రంలోని లుథియానా నగరంలో కాంట్రాక్టర్‌. ‘గుప్తా అండ్‌ సన్స్‌’ పేరిట ఒక నిర్మాణ సంస్థను నడుపుతున్నాడు. ఆయన తన రెండో వెంచర్‌ కింద లుథియానా సివిల్‌ లైన్స్‌లో మూడేళ్ల క్రితం ఒక ఛారిటబుల్‌ ఫార్మసీని ప్రారంభించారు. ‘గుర్మికి’ (గురునానక్‌  మోడీ ఖానా) పేరిట ఏర్పాటు చేసిన ఈ షాపు యజమాన్య హక్కులు ఆయన కూతురు ఆకాన్షకు వెళ్లడమేగాక, బోర్డు మీద ‘గుప్తా అండ్‌ డాటర్స్‌’గా పేరు మారింది. ‘‘లింగ సమానత్వానికి ఇదొక ఉదాహరణ. నేను ‘గుప్తా అండ్‌ డాటర్స్‌’ అని చెప్పగానే మా ఇంట్లో వాళ్లు మొదట్లో కొత్తగా వినిపిస్తోందని అన్నారు గానీ తర్వాత అందరూ ఒప్పుకున్నారు. అయితే షాపు పేరు ఇలాగే పెట్టాలని నేను ముందుగానే డిసైడ్‌ అయ్యాను’’ అని గుప్తా వివరించారు. 


ఇన్నేళ్ల సంప్రదాయానికి భిన్నంగా తండ్రి లింగ సమానత్వం పేరిట ‘సన్స్‌’కు బదులుగా ‘డాటర్స్‌’ అని పెట్టడం చాలా గొప్ప విషయం అంటారు ఆకాన్ష. న్యాయవిద్య చదువుతున్న ఆమె ఇంట్లో కూడా ఎప్పుడూ లింగ వివక్షను ఎదుర్కోలేదని చెబుతోంది. ఆమె సోదరుడు రోషన్‌ కరణ్‌ ఎంబీఏ చదివాడు. ‘‘మా నాన్న చేసింది చాలా గొప్ప పని. అసలు ఇలాంటి ఆలోచనను నేను ఇంతకుముందు ఎక్కడా వినలేదు... చదవలేదు’’ అని గర్వంగా చెబుతున్నాడు రోషన్‌.


మనోజ్‌కుమార్‌ గుప్తాకు ఈ విభిన్న ఆలోచన రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘బేటీ బచావో... బేటీ పడావో’ కార్యక్రమం. మగపిల్లాడైనా, ఆడపిల్ల అయినా సమానమే అనే భావన ఉంటే లింగ వివక్ష అనే ప్రశ్నే తలెత్తదనేది ఆయన అభిప్రాయం. తనలో ఈ సమానత్వ భావన ఏర్పడటానికి తల్లిదండ్రులతో పాటు భార్య ఇచ్చిన ప్రోత్సాహం కూడా కారణమే అంటారాయన. ‘‘ఇలాంటి విలువలు (మహిళా సమానత్వం) నాలో పెంపొందడానికి కారణమైన ఆ భగవంతుడికి, నా తల్లిదండ్రులకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నా భార్య రమను కూడా అలాగే చూస్తా. ఆమే మా ఇంటి బాస్‌’’ అని గర్వంగా చెబుతారు గుప్తా. స్థానిక ‘సిఖ్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌’తో కలిసి ‘గుప్తా అండ్‌ డాటర్స్‌’ ఫార్మసీ పేద రోగులకు మందుల పంపిణీ చేయడం విశేషం. మొత్తానికి గుప్తా చేసిన ‘బోర్డు’ ప్రయత్నం ప్రస్తుతం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. లింగ సమానత్వంపై అందరి దృష్టి పడేలా చేసింది.

Updated Date - 2020-05-27T05:30:00+05:30 IST