కేంద్రంపై నిందలేయడమేంటి?

ABN , First Publish Date - 2020-10-22T07:26:50+05:30 IST

భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక బృందాన్ని పంపుతోందని కేంద్ర

కేంద్రంపై నిందలేయడమేంటి?

వ్యక్తిగత విమర్శలు సరికాదు.. నేను 3 నెలల జీతం విరాళమిచ్చా

నష్టంపై కేంద్ర బృందం నివేదిక రాగానే నిధులిస్తాం: కిషన్‌రెడ్డి 

న్యూఢిల్లీ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక బృందాన్ని పంపుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందం గురువారం నుంచి 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తుందని తెలిపారు.


హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్‌ వశిష్ట, ఆర్బీ కౌల్‌, మనోహరన్‌, ఎస్‌.కె.కుశ్వాహాతో పాటు జలశక్తి శాఖ నుంచి సీనియర్‌ అధికారి ఈ బృందంలో ఉంటారన్నారు. బుధవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను కేంద్ర బృందం సందర్శిస్తుందని చెప్పా రు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించి నష్టానికి సంబంధించిన నివేదికను అందిస్తుందని.. ఆ తర్వాత కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. ఆలోపు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండే విపత్తునిర్వహణ నిధి నుంచి ఖర్చు చేయాలని, తర్వాత కేంద్రం రీయింబర్స్‌ చేస్తుందని పేర్కొన్నారు.


తెలంగాణ ప్రభుత్వం నిధులు అడగడంలో తప్పులేదు కానీ, బాధ్యత కలిగిన రాష్ట్ర మంత్రులు కేంద్రంపై నిందలు వేసే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.   తనను వ్యక్తిగతంగా విమర్శించడంలో అర్థం లేదని, తాను 3 నెలల జీతాన్ని విరాళంగా ఇచ్చానని తెలిపారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం మూసీ అభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి చైర్మన్‌ను నియమించినప్పటికీ నది ప్రక్షాళన విషయంలో మాత్రం ఒక్క అడుగు ముందుకేయలేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. నది వెంబడి ఆక్రమణలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. 2014 ముందు ఎన్ని అక్రమణలు జరిగాయి, ఆ తర్వాత ఎన్ని అక్రమణలు జరిగాయో రికార్డులు పరిశీలిస్తే అర్థమవుతుందన్నారు. 


Updated Date - 2020-10-22T07:26:50+05:30 IST