Advertisement
Advertisement
Abn logo
Advertisement

చెప్పవలిసింది పాలకుడికి కాదు, ప్రజలకే !

ప్రధాని గానీ, మరో రకపు అధికారి గానీ, తనకై తనే పదవిని వదలడం జరుగుతుందా? ప్రస్తుత ప్రధాని చేష్టల మీద ఆగ్రహాలతో ప్రజలే, ఆ ప్రధానిని దింపి వేసే మార్గమే లేదా? ఉండదా? సంస్కర్తల ప్రయత్నం, ప్రజలేం చెయ్యాలో ప్రజలకే నేర్పడం గాక, నేరస్తుడికే విన్నపాలు చెయ్యడమా? పార్లమెంటు సభ్యుల మీద ప్రజలే ఒత్తిడి చేసే లాగ, సంస్కర్తల బోధనలు సాగరాదా? ఆ సభ్యుల్ని తమ ఓట్లతో ఎంచుకున్నది సాధారణ ప్రజలే. ఆ ప్రజలే పార్లమెంటు సభ్యుల్ని విమర్శలతో ఒత్తిడి చేస్తే, ఆ సభ్యులు, ప్రధానిని తిరస్కరించలేరా?


కోవిడ్‌ మరణాల గురించి వింటోంటే, పత్రికల్లో చూస్తొంటే, ‘ప్రాణం’ అంటే ఏమిటో అర్ధం చేసుకోవచ్చు అనిపిస్తోంది ఇప్పుడు. మానవుల, జంతువుల దేహాల్లో, ‘ప్రాణం’ అనే ఏదో అంశం ఒకటి ఉంటుందనీ, అది ఎగిరి పోయినప్పుడే ఆ దేహానికి మరణం సంభవిస్తుందనీ, అందరమూ నమ్ముతూ వుంటామనుకుంటా. కానీ, కోవిడ్ మరణాలు ఎలా జరుగుతున్నాయో, ఎందుకు జరుగుతున్నాయో చూస్తే, ‘ప్రాణం’ అంటే ఏమిటో, స్పష్టం గానే తెలుసు కోవచ్చనిపిస్తోంది. రోజూ పత్రికల నిండా, చీకటి లోనే కనపడే మరణాలు, ‘ప్రాణం అంటే ఇదే, ఇంతే’ అని మళ్ళీ మళ్ళీ వివరిస్తూ నిర్ఘాంత పరుస్తున్నాయి. 


ఒక రోజు, ఒక ఆస్పత్రిలో 10 పక్కల మీద వున్న కోవిడ్ రోగులు, హఠాత్తుగా ఒక్కసారిగా మరణించడం! ఆ ఒక్క రోజే కాదూ, ఆ మర్నాడు ఇంకో ఆస్పత్రిలో 24 మరణాలు ఒక్క సారిగా! ఆ మర్నాటికి మర్నాడు ఇంకో చోట 39 మరణాలు, ఒక్క సారి గానే! ప్రతి రోజూ ఈ రకం వార్తలే! సంఖ్యలు పెరిగి పోతూ!


బాగా తెలిసిన, ఒక పాఠకుడు కోవిడ్ రోగిగా 2 వారాల క్రితం ప్రభుత్వ ఆస్పత్రి పాలై, తర్వాత రెండు రోజుల్లోనే ప్రైవేటు ఆస్పత్రికి మారి, మాట పెగలని స్తితి లోనే, పక్కింటి వారికి ఫోనులో మూగలతో, తన ఎకరం స్తలాన్ని అమ్ముతానని వాగ్దానాలు చేసి, 3 లక్షల డబ్బుని ప్రైవేటు ఆస్పత్రికి కట్టి, ఆ తంటాలన్నీ పడ్డ తర్వాత, ఆ రోగి నడవ లేని స్తితి లోనే ఇంటికి చేరాడు. ఆ మర్నాడే ఆ రోగితో నేను కొంచెం మాట్లాడాలని ఆతృతగా ప్రయత్నిస్తే, అతను నిజంగా మాట్లాడ లేని స్తితి లోనే, ‘బతికే వున్నానండీ, చచ్చి పోలేదు’ అన్నాడు, ఓపికలేని మాటలతో. నలభై యేళ్ళ మనిషే. ఆస్పత్రి నించి ఇంటికి చేరాక కూడా ఆ మనిషి రోగి గానే వుంటాడని, నేను ఊహించలేదు. 


ఒక్క ప్రశ్నే అడిగాను, ‘మీరు యంత్రం ద్వారా ప్రాణ వాయువుని పీల్చుకునేటప్పుడు, మీ స్వంత వూపిరి ఏ మాత్రమూ వుండేది కాదా?’ ఆయన తడబడుతూ, రోగిగానే చెప్పిన మాటలు ఇవీ: ‘నా ఊపిరితిత్తులకి ఎనబయ్ శాతం కంటే ధ్వంసం జరిగిందని ఆసుపత్రోల్లు చెపారమ్మా! అప్పుడు నా సొంత వూపిరి వున్నా పిసరంతే! బైట్నించి ఆక్సిజను అందకపోతే, నా సొంత వూపిరి నన్ను కాపాడేదా?’


నాలుగు రోజుల తర్వాత ఆయన్ని మళ్ళీ కొంచెం పలకరించాలనుకుంటే, అతను నిద్ర పోతున్నాడని అతని భార్యే అంతా చెప్పింది. వాళ్ళ వూళ్ళో వున్న ఆస్తి అమ్మి వేసి, డబ్బు మూటని ఆస్పత్రికి కట్టి వేసి, భర్తని బ్రతికించడంలో, ఆమే చొరవ చేసినట్టు తెలిసింది. అలా జరగక పోతే, ‘కొంప మునిగేది’ అంది ఆవిడ. 


ఆయన నిద్రనించి లేచి మాట్లాడినప్పుడు, ‘ఈ రోగంలో అసలు సమస్య, సొంత వూపిరి చాలకే బైటి ఊపిరి కావాలి. అది అందకే చావులు’ - అన్నాడు. కోవిడ్ మరణం అయినా, ఏ మరణం అయినా, ‘ప్రాణం’ అంటే ఏమిటో, కొంతైనా తెలిసేలాగ, కోవిడ్ చేస్తున్నట్టుంది. ఊపిరి ఆడక పోవడమే, దాని చలనం ఆగి పోవడమే మరణంగా అనిపిస్తోంది. నిద్ర నించి లేచిన రోగి మాటలు: ‘ముక్కు లోకి బైట నించి ప్రాణ వాయువు పోతూ వుంటే కొంత శాంతిగా వున్నా, ముక్కుకి చిరాకే. ఆ గాయాల ఇబ్బంది వుంటుంది లెండి. ఆ గాలి కోసం అదంతా భరించే వాణ్ణి’ 


‘రోగులందరూ అలాగే భరిస్తారు కదండీ? మరణాల దాకా ఎందుకు?’ అంటే, ‘ఆ మరణాలు నేను చూడలేదు గానీ, సొంత ఊపిరి తగ్గి, బైటి ఊపిరి కూడా అందకుండా పోతే? బైటి యంత్రమే ఖాళీ అయిపోతే? పేషెంట్లేమవుతారు? గాలి ఆగిపోతే, ఒక్క అర నిమిషం తేడాలో, అందరికీ చావులే కదా? ఎవరి ప్రాణం నిలుస్తుంది? నా కైతే, ఆ గాలి అందుతూన్నా సరే, ఏ క్షణంలో పోతానో అనిపిస్తూ వుండేది. గాలిని అందించే గొట్టం, ముక్కు దగ్గిరే వుంటే, కొంత నయం. వెంటిలేటర్ గొట్టాలు ఊపిరి తిత్తుల వరకూ దిగి వుంటాయంట!’- భయపడిపోతూ అన్న మాటలు అవి.


‘‘ఎంత ఆశ్చర్యం! గాలే ఒక ‘మందై’ పోయింది! ఊపిరి కదిలితే బ్రతుకూ; లేకపోతే చావూ!’’


కోవిడ్ రోగుల్ని బ్రతికించి, ఇంటికి పంపడానికి సునాయాసమైన మార్గం ప్రాణ వాయువుని ఆపకుండా అందించడమే అయితే, అంత చిన్న వైద్యం అందక, వేలాది, లక్షలాది, మానవుల మరణాలా? ఎంత అన్యాయం ఇది! ఎంత అశ్రద్ధ ఇది! 


ఏ రోగి కైనా ఊపిరి ఆగిపోతే, తక్షణం గుండె ఆగిపోతుందట! మెదడులో చలనం కూడా నిలిచి పోతుందట! ఏ రకపు రోగం అయినా, ఆ రోగికి, మొదట ఊపిరి ఆగి, గుండె ఆగిపోయి, అదే ‘ప్రాణం పోవడం’ అనే అర్ధం స్తోంది. 


ప్రాణం అనే దానికి నిర్వచనం లేదనుకుంటాను. ‘‘ప్రాణం వుందా, లేదా’’ అనే దాన్ని మాత్రమే చెపుతారు డాక్టర్లు. ఊపిరి వుందనీ, లేదనీ. ఊపిరి ఆగడమే ప్రాణం పోవడం, అదే మరణం అవుతుందని, కోవిడ్ రోగం బట్ట బయలుగా చూపిస్తోంది. వేరే వ్యాధుల వల్ల కూడా, ఊపిరి ఆగడమే ప్రాణం పోవడం. అంటే, ఊపిరే ప్రాణమా?


మానవ దేహం, ఏ యంత్రమూ కాదు. కానీ, యంత్రానికి రిపేర్లు వున్నట్టే, ఏ దేహానికైన రిపేర్లు వుంటాయి. యంత్రానికి, దాని వృద్ధాప్యంలో, ఏ రిపేరు వల్లా చలనం జరగని చిట్ట చివరి దశ రాక మానదు. మానవ దేహానికైతే, ఏ వృద్ధాప్యమూ లేకుండానే, ప్రాణం ఆగి పోయే స్తితి వుంటుంది. 


కోవిడ్ మరణాల్ని అయితే, ఈ నాటి వృద్ధులైనా ఎవ్వరూ వినీ, కనీ వుండరు. ప్రతి రోజూ ఘోర వార్తల్ని చదవాల్సి వస్తోంది. ఈ రకం మరణాల దుర్వార్తలన్నీ ఆగాలంటే, సవ్యమైన వైద్య విధానం వుండాలనీ, దానికి ప్రస్తుత ప్రధాన మంత్రి పనికి రాడనీ, అతడు ఆ పదవి నించీ తప్పుకోవాలనీ–

-ఈ రకం వాదనలు వినిపిస్తున్నాయి, ఇప్పుడు! 


ప్రస్తుత ప్రధాని సమర్ధుడు కాకపోతే, అతడు తప్పుకోవాలనే నిర్ణయం, అతడి నిర్ణయంగానే వుండాలా; అతణ్ణి తప్పించాలనే నిర్ణయం, ప్రజల నిర్ణయంగా వుండాలా? సమర్ధుడు కాని ప్రధానిని తీసివేసే పని ప్రజలే చేయాలి. పార్లమెంటు సభ్యుల్లో మెజారిటీ సభ్యులు ఆ నిర్ణయం చేయవచ్చు. కానీ, ఆ పార్టీలో, ప్రస్తుతం అటువంటి పరిస్తితి లేదు. 


ప్రజలలో ఏ వ్యక్తి అయినా, ఇలా అంటారనుకుందాం: ‘ప్రధాని గారూ! మీరు తప్పుకోండయ్యా! మీ పార్టీ లోనించే మీరు నిర్ణయించే ఇంకో వ్యక్తిని ప్రధానిగా పెట్టాలి మీరే. ఈ కోవిడ్ సమస్యలో మీరు ప్రజల క్షేమం కోసం సమర్ధతతో చెయ్యలేక పోతున్నారు. ఈ సంగతి మీరు తెలుసుకుని, దయచేసి మీరు తప్పుకోండి, తప్పుకోండి’ -అని, ప్రధానయ్యకి విన్నపాల మీద విన్నపాలు! ఈ విన్నపాలలో, గుంభనగా, అంతర్లీనంగా కొంత వ్యంగ్యం వున్నప్పటికీ,ఆ వ్యంగ్యం వల్లనే ప్రజలకు సరైన మార్గం దొరుకుతుందా? 


కోవిడ్ విషయంలో, ప్రజల క్షేమం కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయాలో, కొంత మంది పెద్ద పెద్ద సైంటిస్టులు, ప్రధానికి అనేక సార్లు ఎన్నో వివరాలతో, ఫలానా ఫలానా రకంగా మందుల ఏర్పాట్లు చేయాలని, రాశారట, చెప్పారట! ప్రధాని గారు అయితే, ప్రజల కోసం దేనినీ వినరూ, చేయరూ. జనాలు, కోవిడ్ వల్ల వందలుగా, వేలుగా, లక్షలుగా మరణిస్తూ వున్న మొదటి కాలంలో, ప్రధాని, బెంగాల్ ఎన్నికల ముచ్చట్లలో మునిగి పోయి వున్నారు. ఇప్పుడు మళ్ళీ ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ముచ్చట్లలో! వారి అవసరం వారిదీ! అట్టి ప్రధానికి విన్నపాలా, పదవి నించి తప్పుకోమని? ఆ విన్నపాలు వెటకారాలే అయినప్పటికీ! ప్రజల మరణాల గురించి ఏ సానుభూతీ లేని ప్రధానితో, ‘ప్రధాని గారూ! తమరు దిగండి బాబూ!’ అంటూ వెటకారాల సరసాలా? 


ప్రధాని గానీ, మరో రకపు అధికారి గానీ, తనకై తనే పదవిని వదలడం జరుగుతుందా? ప్రస్తుత ప్రధాని చేష్టల మీద ఆగ్రహాలతో ప్రజలే, ఆ ప్రధానిని దింపి వేసే మార్గమే లేదా? ఉండదా? సంస్కర్తల ప్రయత్నం, ప్రజలేం చెయ్యాలో ప్రజలకే నేర్పడం గాక, నేరస్తుడికే విన్నపాలు చెయ్యడమా? పార్లమెంటు సభ్యుల మీద ప్రజలే ఒత్తిడి చేసే లాగ, సంస్కర్తల బోధనలు సాగరాదా? ఆ సభ్యుల్ని తమ ఓట్లతో ఎంచుకున్నది సాధారణ ప్రజలే. ఆ ప్రజలే పార్లమెంటు సభ్యుల్ని విమర్శలతో ఒత్తిడి చేస్తే, ఆ సభ్యులు, ప్రధానిని తిరస్కరించలేరా? 


‘ప్రధాని గారూ! తమరు దిగండి! దిగండి!’ అని ప్రధానినే ప్రార్ధించడం, వెటకారం అవదు, ప్రార్ధనే అవుతుంది. ప్రార్ధనల తోనే మార్పులు జరిగితే, కోవిడ్‌ వైరస్‌నే ప్రార్ధించుకోవాలి. 


ప్రజలు ఆగ్రహిస్తే, అది ఎంత కొత్త మార్పుని అయినా తీసుకు రాగలదు. ప్రజలకు నిజాలు తెలిస్తే ఆగ్రహించరా? పని స్తలాలలోనూ, నివాస స్తలాలలోనూ, ప్రజలు ఎప్పుడూ సంఘాలు పెట్టుకోవాలి. కొన్ని చోట్ల ఇప్పటికే కార్మిక సంఘాలూ, రైతు సంఘాలూ, స్త్రీల సంఘాలూ, విద్యార్ధి సంఘాలూ, ఉద్యోగ సంఘాలూ, రచయితల సంఘాలూ, కాలనీ సంఘాలూ, బస్తీ సంఘాలూ, సంక్షేమ సంఘాలూ, వృత్తి సంఘాలూ- ఇలా ఇన్ని సంఘాలు ఎంతో కొంత పని చేస్తున్నాయి. సంఘాల ద్వారా, వైద్యం, ఆరోగ్యం వంటి సమస్యల పరిష్కారాల కోసం అధికారుల మీదా, ప్రభుత్వ అధినేతల మీదా, వత్తిడి తీసుకు రాలేరా? ప్రజలు అలా సంఘటితం, కావడానికి ప్రజల పక్షాన నిలిచే రాజకీయ సంస్తలు తమ ఆగ్రహంతో పని చెయ్యలేవా? అంతే గానీ, ప్రధాని గారు పదవిలోనించీ తప్పుకుని, ఆ వ్యక్తే, ఇంకొకరికి ఆ పదవిని అప్పజెప్పమంటే అది పరిష్కారమా? ఒక ప్రధాని పోతే ఇంకో ప్రధానీ, ఒక ముఖ్యమంత్రి పోతే ఇంకో ముఖ్యమంత్రీ రారా? కొత్త మొహాలూ, కొత్త భ్రమలూ, కొత్త మోసాలూ, తప్ప పరిస్తితి లో కొత్త మార్పులు వస్తాయా? అధికార స్తానాల్లో వున్న వ్యక్తులు మారితే చాలు, పరిస్తితి చక్క పడుతుంది-అని ప్రజలను పూర్తిగా భ్రమలకు లోను చెయ్యడం అవదా? - 


రంగనాయకమ్మAdvertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...