Abn logo
Aug 2 2021 @ 00:00AM

దాక్కోవాల్సింది బాధితులు కాదు!

‘‘రవయ్యేళ్ళనాటి యాసిడ్‌ దాడి నా ముఖం మీద మాసిపోని గుర్తుల్నీ, అంతులేని వేదననూ మిగిల్చింది. అవే నాలాంటివారికి అండగా నిలవాలనే సంకల్పాన్ని బలపరుస్తున్నాయి’’ అంటారు మైసూర్‌కు చెందిన వైద్యురాలు వై.ఎన్‌. మహాలక్ష్మి. యాసిడ్‌ బాధితులకు న్యాయం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్న ఆమె కొవిడ్‌ వారియర్‌గానూ నిబద్ధమైన సేవలందిస్తున్నారు. మహాలక్ష్మి జీవన పోరాటం గురించి ఆమె మాటల్లోనే...


‘‘ఆవేశంతోనో, అనాలోచితంగానో, కక్షతోనో, మూర్ఖత్వంతోనో ఎవరి మీదైనా యాసిడ్‌ పొయ్యడానికి కొన్ని క్షణాలు చాలు. కానీ బాధితులు ఆ పరిణామాలను జీవితాంతం భరించాలి. ఇది చాలా అనాగరికమైన, క్రూరమైన నేరం. ఈ నేరానికి పాల్పడినవాళ్ళు కఠిన శిక్ష అనుభవించి తీరాలి. దాని కోసమే నేను పోరాడుతున్నాను. దీని వెనుక నా జీవితాన్ని మార్చేసిన ఒక సంఘటన ఉంది. అది నిన్ననే జరిగినట్టు ఇంకా నా కళ్ళముందు కదులుతోంది. 


కర్ణాటకలోని మైసూర్‌ నా స్వస్థలం. మైసూర్‌ మెడికల్‌ కాలేజీలో వైద్య విద్య పూర్తి చేశాక, సొంతంగా ప్రాక్టీస్‌ చెయ్యాలనుకున్నాను. విద్యారణ్యపురం ప్రాంతంలోని ఒక ఇంట్లో కొంత భాగం అద్దెకు తీసుకొని, క్లినిక్‌ ప్రారంభించాను.  ఆ ఇంటి ఓనర్‌ ప్రవర్తన మంచిది కాదనీ ఆ తరువాత నాకు తెలిసింది. చాలాసార్లు నన్ను వేధించేవాడు. అనవసరమైన చొరవ తీసుకొనేవాడు. దీంతో ఆ ఇల్లు ఖాళీ చేసి, మరో చోట క్లినిక్‌ తెరిచాను. అయితే అతను అక్కడా నన్ను వెంటాడాడు. ఆ వేధింపులు పెరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆ సంగతి తెలిసి నా మీద కక్ష పెంచుకున్నాడు. ఆ రోజు 2001 జనవరి 11. క్లినిక్‌ నుంచి ఇంటికి వెళ్తున్న నా మీద అతను యాసిడ్‌ పోశాడు. ఇది మా ఇంటికి కొద్ది దూరంలో జరిగింది. ఆ వీధిలో ఉన్న ఒక మహిళ, ఆమె అయిదేళ్ళ కొడుకు నాకు సాయం చేశారు. నా ఎడమ కన్ను, చెవి, ముఖం మంటల్లో కాల్చేస్తున్న బాధ. వెంటనే ఆటోలో దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి వెళ్ళాను. నాకు పరీక్షలు చేశాక... నా ఎడమ వైపు ముఖ కండరాలు పూర్తిగా దెబ్బతిన్నాయనీ, నా ముఖం పూర్వస్థితికి రావడం కష్టమనీ వైద్యులు చెప్పారు. దాంతో తీవ్రమైన వేదనకు గురయ్యాను. కొన్ని రోజులు చీకటి గదికే పరిమితమైపోయాను. అప్పటికి నాకు ఇరవయ్యారేళ్ళు. ఆ సమయంలో నా తల్లితండ్రులు నాకు ఎంతో అండగా నిలిచారు. 


పాతికకు పైగా సర్జరీలు చేయించుకున్నా!

యాసిడ్‌ దాడివల్ల శారీరకంగా ఏర్పడే వైకల్యాల గురించి వైద్యురాలిగా నాకు పూర్తి అవగాహన ఉంది. ఒక వ్యక్తి చేసిన దురాగతం వల్ల నేను జీవితాంతం ఇలా ఉండిపోవాలన్న వేదన నన్ను వేధించేది. క్రమంగా ధైర్యం తెచ్చుకున్నాను. నా రూపాన్ని సరిదిద్దుకోవడానికి సర్జరీలు చేయించుకున్నాను. ఇరవై అయిదుకు పైగా సర్జరీలు అయ్యాయి. అయినా నా మీద జరిగిన దాడి తాలూకు ప్రభావం పూర్తిగా పోలేదు. ఎక్కువ కాంతిని చూస్తే కళ్ళు నొప్పి పెడతాయి. అందుకే ఎప్పుడూ కళ్ళద్దాలు పెట్టుకుంటాను.   కాస్త కోలుకున్న తరువాత, నాకు న్యాయం కావాలని కోరుతూ కోర్టులో కేసు వేశాను. సరైన సాక్ష్యం లేదంటూ 2005లో అతణ్ణి జిల్లా సెషన్స్‌ కోర్టు వదిలేసింది. అది నాకు పెద్ద షాక్‌! ఆ తరువాత హైకోర్టుకు వెళ్ళాను. చివరకు... 2012లో అతనికి మూడేళ్ళ జైలు శిక్ష, ఇరవై వేల జరిమానా హైకోర్టు విధించింది. పదకొండేళ్ళ తరువాత వచ్చిన ఈ తుదితీర్పు నాకు సంతృప్తి కలిగించలేదు. 


ఇదెక్కడి న్యాయం?

మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతస్థాయికి ఎదుగుతున్నారు. కానీ సమాజంలో వివక్ష పోలేదు. ఇక, యాసిడ్‌ దాడిలో ముఖాలు వికృతంగా మారిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇతర మహిళలు సైతం ఈ బాధితులు దగ్గరకు రాగానే ఉలిక్కిపడి, చీదరించుకున్నట్టు దూరంగా జరుగుతారు. దేశంలో యాసిడ్‌ దాడులు పెరగడంతో. సుప్రీంకోర్టు చట్టాలను సమీక్షించింది. నిందితులకు పదేళ్ళ కఠిన కారాగార శిక్షను కనీస శిక్షగా నిర్ణయించింది. గరిష్టంగా జీవిత ఖైదు కూడా విధించవచ్చు. యాసిడ్‌ విక్రయాలపై కఠినమైన నియంత్రణలు విధించింది. కానీ ఇది చాలదు. యాసిడ్‌ దాడికి గురైన మహిళలు జీవితాంతం బాధ పడతారు. అందవికారంగా, వైకల్యాలతో ఉన్న మహిళలను సమాజం ఆమోదించదు. దీంతో బాధితులు ఇంటి నాలుగు గోడలకే పరిమితం అయిపోతారు. కానీ, ఆ దారుణానికి పాల్పడిన వాళ్ళు కొన్నాళ్ళు జైలు శిక్ష అనుభవించి, బయటకు వచ్చి హాయిగా తిరుగుతూ ఉంటారు. ఇదెక్కడి న్యాయం? యాసిడ్‌ దాడులకు పాల్పడినవారికి మరణ శిక్ష విధించాలి. అలాంటి చట్టాల కోసం పౌర సమాజం, మీడియా, న్యాయనిపుణులు ప్రయత్నించాలి.


సమాజం దృష్టి మారాలి...

యాసిడ్‌ దాడుల్లో బాధితులు పేదలూ, అట్టడుగువర్గాలవారే ఎక్కువ. నా దృష్టికి వచ్చిన బాధితులకు వీలైనంత సాయం చేస్తున్నాను. వారు గౌరవప్రదమైన జీవనం సాగించేలా చూస్తున్నాను. న్యాయస్థానాల్లో పోరాడడానికి సాయపడుతున్నాను. ఇప్పుడు యాసిడ్‌ బాధితులకు పునరావాసం, నెలవారీ పింఛను, ఉచిత ఇళ్ళు, ఉపాధి లాంటి చర్యలను ప్రభుత్వాలు చేపడుతున్నాయి. కానీ మాలాంటి వారి పట్ల సమాజ దృక్పథం మారాలి. మాకు కావలసింది సానుభూతి కాదు, హుందాగా జీవించడానికి అవసరమైన మద్దతు. తమకు ఎదురవుతున్న అన్యాయాల పట్ల మహిళలు మౌనంగా ఉంటే.. దురాగతాలు ఇంకా పెరుగుతాయి. దాక్కోవాల్సింది నేరం చేసినవారు తప్ప బాధితులు కాదు.’’ 

వైద్యురాలినైనందుకు గర్వపడుతున్నా!

ప్రస్తుతం నేను మైసూరులోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ వైద్యురాలిగా పని చేస్తున్నాను. కిందటి ఏడాది కొవిడ్‌ మహమ్మారి తలెత్తిన తరువాత, నేనూ, నా తోటి వైద్యులూ అహర్నిశలూ శ్రమించాం. నేను ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. రోగులతో మాట్లాడి, వారిలో ధైర్యం నింపడానికి ప్రయత్నించాను. ఇలాంటి సమయాల్లో నేను వైద్యురాలినైనందుకు ఎంతో గర్వంగా ఉంటుంది. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టినా, ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు.. అందుకే వ్యాక్సిన్‌ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తున్నాం.