‘అదానీ’కి నోటీసు

ABN , First Publish Date - 2021-04-04T05:51:11+05:30 IST

కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘించిన అదానీ సంస్థకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నోటీసులు జారీ చేసింది.

‘అదానీ’కి నోటీసు

  •  జారీ చేసిన ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ
  •  కాంట్రాక్టు నిబంధనల ఉల్లంఘనే కారణం
  •  మంగళూరు విమానాశ్రయంలో సొంత బ్రాండ్ల ప్రచారం!
  •  లఖ్‌నవూ, అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుల్లోనూ అదే తీరు?


బెంగళూరు (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘించిన అదానీ సంస్థకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నోటీసులు జారీ చేసింది. కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్ర ప్రభుత్వం 50 ఏళ్ల పాటు కాంట్రాక్టు పద్ధతిన గుజరాత్‌కు చెందిన అదానీ సంస్థకు 2020 అక్టోబరులో అప్పగించింది. అదానీ సంస్థ పర్యవేక్షణ, నిర్వహణ, అభివృద్ధి చేపట్టాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా విమానాశ్రయ ప్రాంగణంలో తమ సొంత బ్రాండ్లను ఆ సంస్థ ప్రచారం చేసుకుంటోంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఏఏఐ శుక్రవారం అదానీ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఇదే తరహాలో లఖ్‌నవూ, అహ్మదాబాద్‌ విమానాశ్రయాల్లోనూ ఆ సంస్థ నిబంధనలు ఉల్లంఘించినట్టు తెలుస్తోంది.


దేశంలోని పలు విమానాశ్రయాలను అదానీ, జీవీకే, జీఎంఆర్‌ సంస్థలకు కాంట్రాక్టు పద్ధతిన అప్పగించారు. ఒప్పందం ప్రకారం విమానాశ్రయ ప్రాంగణంలో ఎక్కడా ప్రకటనలను డిస్‌ప్లే, రిఫ్లెక్ట్‌ తరహాలో ప్రదర్శించరాదు. ఏఏఐ పేరు, లోగోను ఏ బోర్డుల్లోనూ కాంట్రాక్టు సంస్థ అనుబంధంగా వాడుకునేందుకు వీలు లేదు. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం అని మాత్రమే ప్రకటించేలా స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలను అదానీ సంస్థ ఉల్లంఘించడంతో సామాజిక కార్యకర్త దిల్‌రాజ్‌ ఆళ్వా అభ్యంతరం వ్యక్తం చేశారు.


విమానాశ్రయ ప్రవేశ మార్గంలోని బోర్డుపై అదానీ సంస్థ పేరు రాయడం వివాదానికి కారణమైంది. దీనిపై దక్షిణ కన్నడ జిల్లా ముల్కి, మూడబిదరె ప్రాంతాల కాంగ్రెస్‌ వర్గాలు సైతం ఆందోళన చేశాయి. దీంతో ఏఏఐ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అదానీ సంస్థకు నోటీసులు జారీ చేసింది. 


Updated Date - 2021-04-04T05:51:11+05:30 IST