నోటీసులతో సరి!

ABN , First Publish Date - 2021-09-17T05:37:36+05:30 IST

రైతుబజార్లలో ఉల్లి, బంగాళాదుంపలు, టామాటాలు విక్రయించే డ్వాక్రా గ్రూపులు, దివ్యాంగులు...ఆయా స్టాళ్లను ఖాళీ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఇచ్చిన గడువు ముగిసి నాలుగు రోజులు అయినప్పటికీ మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

నోటీసులతో సరి!

రైతుబజార్లలో స్టాళ్లను ఖాళీ చేయాలని డ్వాక్రా సంఘాలకు ఆదేశాలు

ఈ నెల 13 డెడ్‌లైన్‌

మూడు రోజులు దాటినా వారే కొనసాగుతున్న వైనం

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని అధికారులు

కొత్త గ్రూపుల నియామకానికి వెలువడని ప్రకటన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


రైతుబజార్లలో ఉల్లి, బంగాళాదుంపలు, టామాటాలు విక్రయించే డ్వాక్రా గ్రూపులు, దివ్యాంగులు...ఆయా స్టాళ్లను ఖాళీ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఇచ్చిన గడువు ముగిసి నాలుగు రోజులు అయినప్పటికీ మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. తమ వద్ద కొంత సరకు వుందని, దానిని అమ్ముకునే వరకు కొనసాగించాలని డ్వాక్రా సంఘాలు కోరగా, అందుకు అంగీకరించినట్టు అనధికారికంగా చెబుతున్నారు. అయితే డ్వాక్రా సంఘాలు ఏ రోజు సరకు ఆ రోజే హోల్‌సేల్‌ మార్కెట్‌ నుంచి తెచ్చి విక్రయిస్తుంటారు. చాలావరకు సరకు అదేరోజు అమ్ముడుపోతుంది. ఈ ప్రకారం సోమవారం మిగిలిన సరకును మంగళవారం విక్రయించి, స్టాల్‌ని అప్పగించాలి. కానీ గురువారం కూడా పాత డ్వాక్రా సంఘాలే సరకు విక్రయించాయి.


నగరంలోని రైతుబజార్లలో సుమారు 90 డ్వాక్రా గ్రూపులు చాలాకాలంగా ఉల్లి, బంగాళాదుంపలు, టామాటా, వెల్లుల్లి వంటి వాటిని విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాయి. రైతుబజార్లు ఏర్పాటైనప్పుడు ఏ గ్రూపులకు స్టాల్స్‌ కేటాయించారో...ఇప్పటికే వారే నిర్వహిస్తున్నారు. దీంతో ఇతర డ్వాక్రా గ్రూపుల వారు తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ చాలాకాలంగా అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. దీంతో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అధికారులు నిర్ణయించి ఆరు నెలల క్రితం నోటీసులు ఇచ్చారు. కొన్ని డ్వాక్రా గ్రూపుల వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ప్రక్రియ తాత్కాలికంగా ఆగింది. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం...ఈ సమస్యను జిల్లా అధికారుల వద్దే తేల్చుకోవాలని సూచించడంతో డ్వాక్రా సంఘాలు...జాయింట్‌ కలెక్టర్‌ని ఆశ్రయించాయి. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో చర్చించగా...పాత సంఘాలను ఆపేసి,  కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. దీనికితోడు జీవో 29ను అమలు చేయాల్సి వున్నందున మూడేళ్లు దాటిన డ్వాక్రా సంఘాలు, దివ్యాంగుల స్టాళ్లను ఖాళీ చేయించాలని అధికారులు నిర్ణయించారు. వారం రోజుల్లో (13వ తేదీలోగా) స్టాళ్లను ఖాళీ చేయాంటూ ఈ నెల ఆరో తేదీన వారికి నోటీసులు ఇచ్చారు. ఆ ప్రకారం గత సోమవారంతో గడువు ముగిసింది. మంగళవారం నుంచి సరకు విక్రయాలకు వారిని అనుమతించకూడదు. అయితే తమ వద్ద కొంత సరకు మిగిలిపోయిందని, వాటిని విక్రయించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మార్కెటింగ్‌ శాఖ అధికారులు...సరకు అమ్మకాలు పూర్తయిన వెంటనే డ్వాక్రా సంఘాలను పంపించేయాలని ఎస్టేట్‌ అధికారులకు సూచించారు.


ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే...

రైతుబజార్లలో స్టాళ్లు నడుపుకుంటున్న డ్వాక్రా గ్రూపుల్లో మూడేళ్లు దాటిన వారిని ఈ నెల 13వ తేదీన ఖాళీ చేయాలని నోటీసులు జారీచేసిన అధికారులు... ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. కొత్త సంఘాల ఎంపికకు కనీస చర్యలు చేపట్టలేదు. డ్వాక్రా గ్రూపుల స్టాళ్లను ఖాళీ చేయిస్తే...ఆయా కూరగాయలను ఎవరి చేత విక్రయించాలో ఎస్టేట్‌ అధికారులకు స్పష్టత ఇవ్వలేదు. రైతుబజార్లలో ఉల్లి, బంగాళాదుంపలు, టమాటాలు లభించక, వినియోగదారులు గొడవ చేసే ప్రమాదం వుందని మార్కెటింగ్‌ శాఖ అధికారులకు ఎస్టేట్‌ ఆఫీసర్లు వివరించారు. దీంతో స్టాళ్లను ఖాళీ చేయించే విషయంలో డ్వాక్రా గ్రూపులపై ఒత్తిడి చేయకుండా, తాము మళ్లీ ఆదేశించే వారకు కొనసాగించాలని ఎస్టేట్‌ ఆఫీసర్లకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.   


ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

పాపారావు, కార్యదర్శి, మార్కెటింగ్‌ శాఖ

రైతుబజార్లలో మూడేళ్లకు మించి స్టాల్స్‌ నిర్వహిస్తున్న డ్వాక్రా సంఘాలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చాము. వారు ఖాళీ చేసి వెళ్లిపోవాలి. వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం క్యారట్‌, బీట్‌రూట్‌, క్యాప్సికమ్‌, బీన్స్‌ వంటి కూరగాయలు విక్రయించే వారితో వీటిని కూడా అమ్మిస్తాము. వారం, పది రోజుల్లో దరఖాస్తులు ఆహ్వానించి, నిబంధనల ప్రకారం కొత్త గ్రూపులను ఎంపిక చేస్తాము. 

Updated Date - 2021-09-17T05:37:36+05:30 IST