Abn logo
Aug 8 2021 @ 12:02PM

ధిక్కార కేసులో Hyderabad Collector శ్వేతా మహంతికి నోటీసులు

  • ఆర్డీవో, తహసీల్దార్‌కు కూడా జారీ
  • అధికారుల తీరును తప్పుబట్టిన హైకోర్టు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ లోతుకుంట గ్రామ సర్వే నెం.1, 2లలోని 40 ఎకరాలకు సంబంధించిన కేసులో తమ ఆదేశాలు అమలు చేయకుండా భూమి హక్కుల కోసం సివిల్‌ కోర్టులో దావా వేసిన అధికారుల తీరును హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. భూమిని నాలుగు వారాల్లోగా పిటిషనర్లకు అప్పగించాలని, కోర్టు ఖర్చుల కింద లక్ష రూపాయలు చెల్లించాలని హైకోర్టు గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారమే అవుతుందంటూ.. శాంత శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.నర్సయ్య కోర్టు ధిక్కార పిటిషన్‌ వేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం భూమిని అప్పగించలేదని, లక్ష జరిమానా చెల్లించలేదని, కోర్టు ఆదేశాలపై ప్రభుత్వం సివిల్‌ కోర్టులో దావా వేసిందని పిటిషనర్లు పేర్కొన్నారు. కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు శుక్రవారం విచారించారు. సివిల్‌  దావా వేయడం ద్వారా హైకోర్టు ఆదేశాలను వక్రీకరించాలని ప్రభుత్వం భావిస్తోందని వ్యాఖ్యానించారు.

కోర్టు ధిక్కార కేసులో హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి, సికింద్రాబాద్‌ ఆర్డీవో డి.వసంతకుమారి, తిరుమలగిరి తహసీల్దారు గఫార్‌ హుసేన్‌ నాయిబ్‌లకు నోటీసులిచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా సివిల్‌ కోర్టు ఉత్తర్వులిచ్చే సాహసం చేయలేదని, ఒకవేళ అదే చేస్తే సివిల్‌ కోర్టు జడ్జి కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లే అవుతుందని న్యాయమూర్తి  అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే, ప్రభుత్వం దాఖలు చేసిన దావా సోమవారం సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. తిరుమలగిరి లోతుకుంటలోని ఖరీదైన 40 ఎకరాల భూమి ధరను ప్రభుత్వ అధికారులు రూ.407కోట్లుగా లెక్కించారు. ఈ మొత్తానికి కోర్టు ఫీజు చట్టంలోని సెక్షన్‌ 67(4) ప్రకారం మినహాయింపు కోరారు. ప్రైవేటు వ్యక్తులైతే ఈ కేసులో సుమారు రూ.30కోట్ల వరకు కోర్టు ఫీజుల కింద చెల్లించాల్సి వస్తుంది. తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 27కి వాయిదా వేసింది.

హైదరాబాద్మరిన్ని...