16,614 పోలీసు పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2022-04-26T07:31:17+05:30 IST

నిరుద్యోగుల ఎదురు చూపులు ఫలించాయి! కొలువుల పండుగ

16,614 పోలీసు పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

  • వీటిలో 16,027 కానిస్టేబుల్‌, 587 ఎస్సై పోస్టులు
  • భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్‌
  • మే 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. 20 వరకూ గడువు
  • మహిళలకు సివిల్‌లో 33 శాతం; ఏఆర్‌లో 10ు కోటా
  • భర్తీ ప్రక్రియలో కీలక మార్పులు చేసిన బోర్డు
  • 100, 800 మీటర్ల పరుగు, హైజంప్‌కు స్వస్తి
  • పురుషులకు 1600, మహిళలకు 800 మీటర్ల పరుగు
  • లాంగ్‌ జంప్‌, షాట్‌ పుట్‌ ప్రమాణాల్లో మార్పులు
  • అన్ని వర్గాలకూ ప్రిలిమినరీ కటాఫ్‌ 30 శాతం
  • నెగెటివ్‌ మార్కింగ్‌ 25 నుంచి 20 శాతానికి తగ్గింపు
  • డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంటే 3 మార్కుల వెయిటేజీ
  • ఈసారి 7 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగుల ఎదురు చూపులు ఫలించాయి! కొలువుల పండుగ మొదలైంది! ఉద్యోగ ఖాళీల నియామకానికి తొలి నోటిఫికేషన్‌ విడుదలైంది! అంతా ఊహిస్తున్నట్లే.. పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రకటనతోనే సర్కారు శ్రీకారం చుట్టింది. హోం శాఖలో 16,614 పోస్టుల భర్తీకి పోలీస్‌ నియామక మండలి సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో 16,027 కానిస్టేబుల్‌, 587 ఎస్సై పోస్టులున్నాయి. వీటిని భర్తీ చేసేందుకు నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఆర్థిక శాఖ అనుమతి మేరకు పోలీస్‌, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, జైళ్లు, అగ్నిమాపక శాఖలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆయా పోస్టులకు మే రెండో తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. మే 20 వరకూ స్వీకరణకు తుది గడువు విధించారు.


ఖాళీల వివరాలను జిల్లాలు, జోన్లవారీగా www.tslprb.in వెబ్‌సైట్‌లో నియామక మండలి పొందుపరిచింది. కొత్త జోనల్‌ విధానం ప్రకారం.. కానిస్టేబుల్‌ సివిల్‌, ఏఆర్‌, ఫైర్‌మన్‌ పోస్టులను జిల్లాస్థాయిలో; టీఎ్‌సఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టును మల్టీ జోనల్‌లో; జైలు వార్డెన్‌, ఎస్సై పోస్టులను జోనల్‌; ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పోస్టులను రాష్టస్థాయిలో భర్తీ చేయనున్నారు. పోలీస్‌ పోస్టుల నియామక ప్రక్రియలో ఈసారి కీలక మార్పులు చేశారు.




గతంలో అభ్యర్థులకు 100, 800 మీటర్ల పరుగుతోపాటు లాంగ్‌ జంప్‌, హై జంప్‌, షాట్‌పుట్‌ తదితర దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించేవారు. పురుష అభ్యర్థులు 800 మీటర్ల పరుగులో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉండేది. 100 మీటర్లు, లాంగ్‌ జంప్‌, హై జంప్‌, షాట్‌పుట్‌ల్లో ఏవైనా మూడింటిలో అర్హత సాధిస్తే సరిపోయేది. తాజాగా, 100, 800 మీటర్లు, హై జంప్‌ పరీక్షలకు స్వస్తి పలికారు. పురుష అభ్యర్థులకు 800 మీటర్ల స్థానంలో 1,600 మీటర్ల పరుగును నిర్వహిస్తారు. దానిని 7.15 నిమిషాల్లో పూర్తి చేయాలి. పురుష అభ్యర్థులు 1,600 మీటర్లు, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌లలో తప్పనిసరిగా అర్హత సాధించాలి. గతంలో మహిళా అభ్యర్థులకు 100 మీటర్ల పరుగు తప్పనిసరిగా ఉండేది. దానిని ఇప్పుడు 800 మీటర్లకు పెంచారు. వారు దీనిని 5.20 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.


అలాగే, లాంగ్‌ జంప్‌, షాట్‌పుట్‌ పరీక్షల్లోనూ మార్పులు చేశారు. లాంగ్‌ జంప్‌ గతంలో 3.80 మీటర్లు ఉంటే దానిని ఇప్పుడు 4 మీటర్లకు పెంచారు. షాట్‌పుట్‌ (7.26 కిలో లు) గతంలో 5.60 మీటర్లు ఉండగా.. దానిని ఇప్పుడు 6 మీటర్లకు పెంచారు. అభ్యర్థుల పరుగును రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎ్‌ఫఐడీ) సాంకేతికతతో నమోదు చేస్తామని పోలీస్‌ నియామక మండలి తెలిపింది. అలాగే, దేహదారుఢ్య పరీక్షల్లో అభ్యర్థు లు ఒక్కసారి అర్హత సాధిస్తే అది మూడు నెలల వరకు అమల్లో ఉంటుందని తెలిపింది.




ఇక, మహిళా అభ్యర్థులకు సివిల్‌ పోస్టుల్లో 33%, ఏఆర్‌లో 10% రిజర్వేషన్‌ కల్పించారు. అభ్యర్థుల వయః పరిమితికి ఈ ఏడాది జూలై ఒకటో తేదీని కటా్‌ఫగా నిర్ణయించారు. కానిస్టేబుల్‌ పోస్టులకు అర్హత వయసును 18 నుంచి 22 ఏళ్లుగా; ఎస్సై పోస్టులకు 21 నుంచి 25 ఏళ్లుగా నిర్ధారించారు. యూనిఫాం పోస్టులకు ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన మూడేళ్ల సడలింపు వర్తిస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీనికి అదనంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదే ళ్లు; మాజీ సైనికులు, ఎన్‌సీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. అంటే, కానిస్టేబుల్‌ పోస్టులకు ఓపెన్‌ కేటగిరీలో అభ్యర్థులు 25 ఏళ్ల వరకూ; ప్రభుత్వ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 30 ఏళ్ల వరకూ పోటీ పడవచ్చు.



ప్రిలిమినరీలో అర్హత 30 శాతమే!

పోలీస్‌ పోస్టులను మూడు దశల్లో భర్తీ చేస్తారు. తొలుత ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత తుది రాత పరీక్ష ఉంటుంది. గతంలో ప్రాథమిక, తుది పరీక్షలు రెండింటికీ ఓసీలకు 40ు, బీసీలకు 35ు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు 30ు మార్కులు వస్తేనే తదుపరి పరీక్షలకు అర్హులు (కటా ఫ్‌)గా పరిగణించేవారు. అయితే, తాజా ప్రకటనలో ప్రిలిమినరీ రాత పరీక్ష అర్హతకు మార్కుల శాతాన్ని తగ్గించారు.


అన్ని వర్గాలకూ దానిని 30 శాతమే అర్హతగా నిర్ణయించారు. అయితే, తుది పరీక్ష కటాఫ్‌ విషయంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. అలాగే, తాజా ప్రకటనలో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానంలో కూడా మార్పులు చేశారు. ప్రిలిమినరీ, తుది పరీక్షలో ఒక తప్పు ప్రశ్నకు 25ు  నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండగా.. ఇప్పుడు దానిని 20 శాతానికి తగ్గించారు. అలాగే, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంటే మూడు మార్కుల వెయిటేజీ ఉంటుంది.   కాగా, పోలీస్‌ పోస్టులకు ఈసా రి పోటీ పెరిగే అవకాశముంది. గతంలో 18 వేల పోస్టులకు 6లక్షల వరకు దరఖాస్తులు వ చ్చాయి. ఈసారి 7 లక్షల వరకు రావొచ్చని పోలీస్‌ నియామక మండలి అంచనా వేస్తోంది.


Updated Date - 2022-04-26T07:31:17+05:30 IST