సంగారెడ్డి మున్సిపల్‌ కో ఆప్షన్‌ల ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ

ABN , First Publish Date - 2020-07-26T10:40:11+05:30 IST

సంగారెడ్డి గ్రేడ్‌ వన్‌ మున్సిపల్‌ కో ఆప్షన్‌ల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇన్‌చార్జి కమిషనర్‌, అదనపు కలెక్టర్‌ రాజర్షిషా ..

సంగారెడ్డి మున్సిపల్‌ కో ఆప్షన్‌ల ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ

31 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు 

ఆగస్టు 15లోగా ఎన్నిక


సంగారెడ్డి టౌన్‌, జూలై 25: సంగారెడ్డి గ్రేడ్‌ వన్‌ మున్సిపల్‌ కో ఆప్షన్‌ల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇన్‌చార్జి కమిషనర్‌, అదనపు కలెక్టర్‌  రాజర్షిషా శనివారం జారీ చేశారు. నలుగురు కో ఆప్షన్‌ల ఎన్నికకుగాను అర్హులైన వారి నుంచి ఈ నెల 31వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆగస్టు 15లోగా మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి కో ఆప్షన్‌లను ఎన్నుకోనున్నారు. నలుగురు కో ఆప్షన్‌లలో మున్సిపల్‌ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం కలిగిన ఇద్దరిని, మైనార్టీ వర్గానికి చెందిన మరో ఇద్దరిని ఎన్నుకోనున్నారు. వీరిలో ఇద్దరు మహిళలకు అవకాశం దక్కనున్నది.  పట్టణంలోని ఓటరు జాబితాలో అభ్యర్థుల  పేరు నమోదై ఉండాలి. మున్సిపల్‌లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, వార్డు సభ్యుడిగా పని చేసి ఉండాలి. మున్సిపల్‌ కౌన్సిల్‌ మూడు సంవత్సరాల కాలవ్యవధిలో పని చేసిన న్యాయవాది కూడా అర్హులే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల్లో గెజిటెడ్‌ హోదాలో పదవీ విరమణ చేసిన అధికారులు కూడా నామినేషన్‌ దాఖలు చేయవచ్చు. మైనార్టీ కోటాలో కోఆప్షన్‌ ఎన్నిక కాదలచినవారు అల్పసంఖ్యాక (మైనార్టీ) వర్గాలైన ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కులు, బుద్దిస్టులు, పార్శీలకు చెందిన వారై ఉండాలి.  ఈ నెల 31 సాయంత్రం 5గంటల వరకు సంగారెడ్డిలోని మున్సిపల్‌ కార్యాలయంలో నామినేషన్లను దాఖలు చేయాలని ఇన్‌చార్జి కమిషనర్‌, అదనపు కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2020-07-26T10:40:11+05:30 IST