Oct 23 2021 @ 21:04PM

తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామ‌ర్స్ ఎన్నికలకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

తెలంగాణ సినీ ప‌రిశ్ర‌మకు అండ‌గా, కార్మికుల సంక్షేమ స‌హ‌కారం కోసం ఏర్పాటైన తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ గ‌త 7 సంవ‌త్స‌రాలుగా విజ‌యవంతంగా ముందుకు సాగుతోంది. 8000 మంది సినీ కార్మికులు, 800 ప్రొడ్యూస‌ర్స్‌, 400 టీ మా ఆర్టిస్టులు టిఎఫ్‌సిసి లో ఉన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు టిఎఫ్‌సిసి ద్వారా 140 సినిమాలు సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యాయి. నిర్మాత‌ల‌కు అత్యంత సులువుగా ప్రాసెస్ జ‌రిపే సంస్థ‌గా టిఎఫ్‌సిసి ప్రాచుర్యం పొందింది. ఇక‌ ప్ర‌స్తుతం 30 మందితో కూడిన‌ టిఎఫ్‌సిసి పాల‌క‌ క‌మిటీ గ‌డువు ముగియ‌నుండ‌టంతో న‌వంబ‌ర్ 14న ఎన్నిక‌లు జరిపేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా శనివారం తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమంలో టిఎఫ్‌సిసి స్థాపకుడు ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ...``తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ స్థాపించి ఏడేళ్లు పూర్త‌యింది. మా ఛాంబ‌ర్ స్థాపించిన తొలినాళ్ల‌లో ఎంతో మంది అవ‌హేళ‌న చేశారు. కానీ మా ఛాంబ‌ర్‌లో 8000 మంది సినీ కార్మికులు, 800 ప్రొడ్యూస‌ర్స్‌, 400 టీ మా ఆర్టిస్టులు స‌భ్యులుగా చేర‌డంతో అవ‌హేళ‌న చేసిన వారే ప్ర‌శంసిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. టిఎఫ్‌సిసి ద్వారా లాక్‌డౌన్ స‌మ‌యంలో కార్డు ఉన్నా లేక‌పోయినా 20వేల సినీ కార్మికుల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు, ఆర్థిక స‌హాయం అందించాము. అంతేకాకుండా టిఎఫ్‌సిసి ద్వారా ప్ర‌తి సంవ‌త్స‌రం ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నాం. ప‌లువురు  ఆర్టిస్టుల‌కి  5ల‌క్ష‌ల రూపాయ‌ల హెల్త్ కార్డుల‌ను అంద‌జేశాము. వారి పిల్ల‌ల‌కు కూడా స్కాల‌ప్ షిప్ అందిస్తున్నాం. అలాగే వారి సొంతింటి క‌ల సాకారం కోసం మా వంతు సాయంగా రెండున్న‌ర ల‌క్ష‌లు అందజేస్తున్నాం. ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించిన వారికి రెండు ల‌క్ష‌ల భీమా అందిస్తున్నాం. ఇక ఇటీవ‌ల గౌర‌వ ముఖ్య‌మంత్రి గారిని కలిసి ఇళ్ల స్థ‌లాల కోసం విన్న‌వించుకున్నాం. త్వ‌ర‌లో 10 ఎక‌రాల ల్యాండ్‌ని కేటాయిస్తామ‌ని వారు మాట కూడా ఇవ్వ‌డం జ‌రిగింది. ఇలా ఎన్నో సేవా కార్య‌క్రమాలు చేప‌డుతున్నాం. ఇక మీద‌ట కూడా చేస్తూనే ఉంటాం. ప్ర‌స్తుతం 30 మందితో కూడిన‌ టిఎఫ్‌సిసి పాల‌క‌ క‌మిటీ గ‌డువు ముగియ‌నుండ‌టంతో న‌వంబ‌ర్ 14న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎవ‌రైనా నామినేష‌న్ వేయ‌వ‌చ్చు. టిఎఫ్‌సిసి ఎన్నిక‌ల‌తో పాటు తెలంగాణ  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు కూడా అదే రోజు జ‌రగ‌నున్నాయి. ఆస‌క్తిగ‌ల‌వారు ఎవ‌రైనా పోటీ చేయ‌వ‌చ్చు’’ అని అన్నారు. అడ్వ‌కేట్, ఎల‌క్ష‌న్ అధికారి కేవియ‌ల్ న‌ర‌సింహారావు మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 14న ఫిలింన‌గ‌ర్‌లోని టిఎఫ్‌సిసి కార్యాల‌యమందు టిఎఫ్‌సిసితో పాటు టీమా ఎల‌క్ష‌న్స్ జ‌రగనున్నాయి. అదే రోజున ఫ‌లితాలు కూడా ప్ర‌క‌టించ‌నున్నాం’’ అంటూ ఎన్నిక‌ల షెడ్యూల్‌తో పాటు ఎన్నిక‌ల‌ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేశారు.